- డిఆర్‌ఒకు వామపక్షాల నాయకుల వినతి
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని జీడిపిక్కలకు మద్దతు ధర కల్పించి, రైతుభరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని వామపక్షాల నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు కలెక్టరేట్‌లో జిల్లా రెవెన్యూ అధికారి మురళీకృష్ణను బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం, సిపిఐ, సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శులు డి.గోవిందరావు, బి.శ్రీరామ్మూర్తి, టి.ప్రకాశరావు మాట్లాడుతూ 80 కేజీల జీడిపిక్కల బస్తాకు రూ.16 వేల మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. జీడి రైతులకు మద్దతు ధర లేక తీవ్ర దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ దళారుల పక్షాన ఉంటుందా? రైతుల పక్షాన ఉంటుందా? ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జీడి రైతుల ఇబ్బందులు రాష్ట్ర ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు. మద్దతు ధర, ఆర్‌బికెల ద్వారా కొనుగోలుపై టిడిపి తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. జీడిపప్పు ధర ఆకాశాన్ని తాకుతుంటే, జీడిపిక్కల ధర పాతాళానికి చేరుతోందని చెప్పారు. ప్రభుత్వ అండతో జీడి యాజమాన్యాలు సిండికేట్‌గా మారి తక్కువ ధర ఇచ్చి జీడి రైతులను దోచుకుంటున్నాయని విమర్శించారు. విత్తనం నుంచి విక్రయం వరకు ఆర్‌బికెల ద్వారా కొనుగోలు చేస్తామని ప్రగల్భాలు పలికిన ప్రభుత్వం, జీడి పిక్కలను ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. 2019లో 80 కేజీల జీడిపిక్కల బస్తా రూ.14 వేలు ఉండగా, నేడు రూ.ఏడు వేలకు పడిపోయిందని, వ్యాపారుల దోపిడీకి ఇదే సాక్ష్యమన్నారు. స్థానిక మంత్రి అప్పలరాజు జీడి మద్దతు ధరపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మద్దతు ధరపై ప్రభుత్వం వెంటనే ప్రకటన చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. జీడి పరిశోధనా కేంద్రం, కేరళ తరహాలో జీడి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలన్నారు. జీడి రైతులకు రుణాలు ఇవ్వాలని, స్థానిక రైతుల నుంచి పిక్కల కొనుగోలు పూర్తయ్యాకే విదేశీ పిక్కల దిగుమతికి అనుమతించాలని, జీడి పండే ప్రాంతాల్లో జీడి అభివృద్ధి బోర్డులు ఏర్పాటు చేసి జీడి పంటను ప్రోత్సహించాలని డిమాండ్ చేశారు. జీడి రైతుల పోరాటానికి తమ సంపూర్ణ సంఘీభావాన్ని తెలిపారు.










