Oct 07,2023 21:06

కరపత్రాలు విడుదల చేస్తున్న సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు, నాయకులు

ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం : జీడి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. దీనిపై ఈ నెల 10న శ్రీకాకుళం జిల్లా పలాసలో నిర్వహించే రాష్ట్ర సదస్సుకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు హాజరవుతున్నారని, సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం గుమ్మలక్ష్మీపురంలో సదస్సు పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 4 లక్షల ఎకరాల్లో జీడితోటలు ఉన్నాయని తెలిపారు. ప్రతి ఏడాది రైతులు పండిస్తున్న జీడి పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. ఆదివాసీల్లో ప్రధానమైన పంట జీడి మాత్రమేనని తెలిపారు. 80 కిలోల జీడిపిక్కల బస్తాకు రూ.16 వేలు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. రాష్ట్రంలో జీడి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని, జీడిపంట విస్తరణకు గతంలో ఇచ్చిన రాయితీలు పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. జీడి పరిశోధన కేంద్రాలు ప్రాంతాల వారిగా ఏర్పాటుచేసి, అభివృద్ధి చేసిన నాణ్యమైన మొక్కలు రైతులకు అందించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో చెముడు గూడ ఎంపిటిసి మండంగి రమణ, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు పాల్గొన్నారు.