Jul 28,2023 22:54

మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్‌ శర్మ

- రైతుల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వానికి పట్టవా?
- స్థానిక మంత్రులు ఎందుకు మాట్లాడడం లేదు
- సత్యాగహ్ర దీక్షలో మాజీ ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్‌ శర్మ
- కాశీబుగ్గలో సత్యాగ్రహం దీక్ష
ప్రజాశక్తి - పలాస: 
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం జీడి పంటపై కక్ష కట్టిందని, అందులో భాగంగానే జీడి రైతులను నాశనం చేయాలని చూస్తోందని మాజీ ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్‌ శర్మ విమర్శించారు. జీడిపిక్కలకు మద్దతు ధర ప్రకటించాలని, రైతుభరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ కాశీబుగ్గ గాంధీ విగ్రహం వద్ద జీడిరైతు సంఘం ఆధ్వర్యాన 24 గంటల సత్యాగ్రహ దీక్షను శుక్రవారం ఆయన ప్రారంభించారు. అంబేద్కర్‌, గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. జీడిరైతు సంఘం పతాకాన్ని మార్పు ట్రస్టు అధ్యక్షులు మట్ట ఖగేశ్వరరావు, రైతు ఉద్యమ సీనియర్‌ నాయకులు కె.కృష్ణారావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జీడి పిక్కలపై ఉన్న ఎక్సైజ్‌ సుంకాన్ని ఐదు శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించడంతో ఆఫ్రికా దేశాల నుంచి దిగుమతులు వెల్లువెత్తడంతో, ఇక్కడి రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు. విదేశీ పిక్కలను దిగుమతి చేయొద్దని చెప్పే ధైర్యం రాష్ట్రంలోని అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపికి ఉందా అని ప్రశ్నించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న బిజెపి, రైతు ప్రభుత్వమని చెప్పుకుంటున్న వైసిపి ప్రభుత్వం జీడి మద్దతు ధరపై ఎందుకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీడి పంటను పరిశ్రమలకు అనుసంధానం చేసి కొనుగోలు చేయడానికి ఉన్న ఇబ్బందేమిటన్నారు. జీడి రైతుల ఘోష స్థానిక మంత్రులు సీదిరి అప్పలరాజు, ధర్మాన ప్రసాదరావు, స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు వినిపించడం లేదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వద్దకు జీడి రైతులను తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి చొరవ చూపడం లేదన్నారు. సిఎంను కలిసేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలకే అవకాశం లేదని, వీళ్లేం సమస్యలు పరిష్కరిస్తారని ఎద్దేవా చేశారు. జీడి రైతుల సమస్యలపై పోరాడే దమ్ము టిడిపి, జనసేనకు ఉందా?, ఉంటే ఎందుకు ఆ పనిచేయడం లేదని ప్రశ్నించారు. 80 కేజీల జీడిపిక్కల బస్తాకు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించి, ఆర్‌బికెల ద్వారా వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కేరళ ప్రభుత్వం నాలుగు జీడి కార్పొరేషన్లను ఏర్పాటు చేసి జీడి ఉత్పత్తి, దిగుబడులు పెంచే విధానాలను అమలు చేస్తూ జీడి రైతులు, పరిశ్రమల అభివృద్ధి, కార్మికులకు భరోసానిస్తూ ఆదర్శవంతంగా నిలిచిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా జీడి కార్పొరేషన్‌ లేదా బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యమాలతోనే సమస్యలు పరిష్కారమవుతాయని, జీడిరైతులు ఐక్యంగా పోరాడితే ప్రభుత్వాలు దిగి వస్తాయన్నారు. రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.మోహనరావు మాట్లాడుతూ మద్దతు ధర కోసం నాలుగు నెలలుగా రైతులు ఆందోళనలు చేస్తున్నా, రైతు ప్రభుత్వమని చెప్పుకుంటున్న జగన్మోహన్‌రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. జీడి రైతులు ఐక్యంగా ఉండి మద్దతు ధర కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాల్సిన అవసరముందన్నారు. జీడి రైతులు ఒంటరిగా లేరని, వారి పోరాటానికి జిల్లావ్యాప్తంగా ఉద్యోగ, కార్మిక, కర్షక, ప్రజాసంఘాలు మద్దతుగా ఉన్నాయని చెప్పారు. దీక్షకు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా కార్యదర్శి ఎన్‌.గణపతి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబూరావు, కాష్యూ లేబర్‌ యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులు కె.భీమారావు, బొమ్మాళి తాతయ్య, కాష్యూ లేబర్‌ అసోసియేషన్‌ కార్యదర్శి అంబటి ఆనందరావు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు హరీష్‌, చందు, వంకులూరు ఎంపిటిసి సురేఖ, ఎస్‌.కాంతారావు, అండమాన్‌ ప్రజా పోరాట నాయకులు డి.లక్ష్మణరావుతో పాటు పలు సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. ప్రజా కళాకారులు కె.హేమసూదనరావు, కె.బాలాజీరావు జీడి రైతుల సమస్యలపై ఆటపాటలు ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింపజేశాయి. జీడిరైతు సంఘం జిల్లా కన్వీనర్‌ తెప్పల అజరు కుమార్‌ అధ్యక్షతన నిర్వహించిన దీక్షలో ఎపి రైతుసంఘం జిల్లా కార్యదర్శి కె.మోహనరావు, కె.హేమారావు చౌదరి, పి.కుసుమ, కె.బాలాజీరావు, కె.సింహాచలం, ఎ.రామకృష్ణ, కె.తవిటయ్య, ఎస్‌.ఈశ్వరరావు, ఎస్‌.కుమార్‌, జె.గవరయ్య, కె.గురయ్య కూర్చొన్నారు.