- వామపక్షాల నాయకులు
ప్రజాశక్తి - పలాస: ఉద్దానం జీడి రైతులను ప్రభుత్వం దగా చేస్తోందని వామపక్షాల నాయకులు విమర్శించారు. కాశీబుగ్గలోని సిఐటియు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం, సిపిఐ, సిపిఐ(ఎంఎల్) లిబరేషన్, సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు ఎన్.గణపతి, సిహెచ్.వేణుగోపాల్, మద్దిల రామారావు, ఎం.వినోద్ కుమార్ మాట్లాడారు. జీడి మద్దతు ధరకు రైతులు పోరాడుతున్నా, పాలకులు యాజమాన్యాల వైపే కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. జీడి రైతులను ఆదుకోవాలని రైతులంతా కోరుతుంటే, ఈనెల 19న మంత్రి అప్పలరాజు, కలెక్టర్ ఆధ్వర్యాన నిర్వహించిన సమావేశంలో జీడి పరిశ్రమల యజమానులను బేరాలాడుతున్నారని చెప్పారు. 80 కేజీల బస్తా రూ.16 వేలకు రైతుభరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని కోరుతుంటే, రూ.తొమ్మిది వేలకు కొనాలని మంత్రి, అధికారులు వ్యాపారులను కోరడం సరికాదన్నారు. ఇది ఏకపక్ష నిర్ణయమన్నారు. గతంలోనూ మంత్రి అప్పలరాజు కలెక్టర్ సమక్షంలో బస్తాకు రూ.వెయ్యి ఇస్తామని ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదని విమర్శించారు. ప్రభుత్వమే కొనుగోలు చేసి ప్రాసెసింగ్ చేయడానికి పరిశ్రమ స్థాయిని బట్టి వారికి కేటాయించాల్సింది పోయి, వ్యాపారులతో బేరసారాలు ప్రభుత్వానికి తగదన్నారు. ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలనుకుంటే వారితో సమావేశం ఏర్పాటు చేసి న్యాయమైన ధరకు కృషి చేయాలన్నారు. వ్యాపారులతో సమావేశం వేయడం ద్వారా ప్రభుత్వం వ్యాపారుల పక్షమేనని తేలిందన్నారు. రూ.16 వేల మద్దతు ధర కోసం రైతులు సాగిస్తున్న పోరాటానికి వామపక్షాలు సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.










