ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి: జీడిపిక్కలకు మద్దతు ధర, ఆర్‌బికెల ద్వారా కొనుగోళ్లపై రైతులు పట్టుదలతో తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. కాశీబుగ్గలో 24 గంటల సత్యాగ్రహ దీక్ష చేసి తమ నిరసనను ప్రభుత్వానికి తెలియజేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు మరో పోరు మార్గం ఎంచుకున్నారు. ఆగస్టు ఐదో తేదీ నుంచి 20 వరకు లక్ష సంతకాలు సేకరించాలని నిర్ణయించారు. 80 కేజీల జీడిపిక్కల బస్తాకు రూ.16 వేలు, ఆర్‌బికెల ద్వారా కొనుగోళ్లు చేయాలని మూడు నెలలుగా వారు అడుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. జిల్లాకు చెందిన మంత్రులు ఉన్నా, ఒక చిన్నపాటి సమస్యకు పరిష్కారం చూపలేకపోతున్నారు. రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆ సమస్య పలాస ప్రాంతానికి చెందిన అంశంగా భావించి కనీసం పట్టించుకోవడం లేదు. తన నియోజకవర్గం కాకపోయినా కోటబొమ్మాళిలోని రేగులపాడులో పలు ప్రభుత్వ కార్యాలయాలు, భవన సముదాయాల ప్రారంభోత్సవానికి వెళ్లిన ధర్మానకు తాము కనిపించడం లేదా అని పలాస జీడి రైతులు ప్రశ్నిస్తున్నారు. ఒక సమస్యను అధ్యయనం చేయడం, వాటి పరిష్కారానికి అధికార యంత్రాంగానికి మంచి సూచనలు చేస్తారని పేరున్న ధర్మాన, ఈ విషయంలో ఎందుకు స్పందించడం లేదనేది ప్రశ్నార్థకంగా మిగిలింది. సమస్య పరిష్కారం వల్ల తనకు ఓట్లపరంగా ప్రయోజనం ఉండదని భావిస్తున్నారా? లేక వ్యాపారులను కాదని రైతులకు మేలు చేయడం ఇష్టం లేకనా? అని రైతులు అనుకుంటున్నారు. జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న ధర్మాన తలుచుకుంటే, ఈ సమస్య ఎప్పుడో పరిష్కారమయ్యేదన్న రైతుల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా అమాత్యులు ఇప్పటికైనా జోక్యం చేసుకుంటే మంచిది.
పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా, జీడి రైతుల గోడును ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు. జీడి పిక్కలకు మద్దతు ధర ప్రకటించాలని రైతులు నినదించిన ప్రతి సందర్భంలో మొక్కుబడి సమావేశాలు నిర్వహించి చేతులు దులుపుకోవడం పరిపాటిగా మారింది. రైతులు, వ్యాపారులతో పలు పర్యాయాలు చర్చలు జరిపినా, అవి అమలు కాకపోవడం మంత్రి అప్పలరాజు అసమర్థతకు అద్దం పడుతోంది. పిక్కల కొనుగోళ్లు, మద్దతు ధర విషయంలో మంత్రి అప్పలరాజు మూడేళ్లుగా రైతులను మోసం చేస్తూనే ఉన్నారు. 2020లో వ్యాపారులు, రైతులతో సమావేశం నిర్వహించి 80 కేజీల బస్తాకు రూ.10 వేలుగా ప్రకటించారు. అందులో ప్రభుత్వం తరుపున రూ.వెయ్యి చెల్లిస్తామని హామీనిచ్చారు. ఇప్పటివరకు ఆ డబ్బులు ఇవ్వలేదు. తర్వాత సంవత్సరం ప్రభుత్వమే పిక్కలను కొంటుందని, 80 కేజీల బస్తాకా?, క్వింటాకా? ధర నిర్ణయంలో ఉందంటూ మంత్రి అప్పలరాజు ఆ ఏడాది ఊరించారు. ఈనెల 19న మరోసారి వ్యాపారులు, రైతులతో సమావేశం నిర్వహించిన మంత్రి అప్పలరాజు రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండానే బస్తాకు రూ.9 వేలు ఇచ్చేయండంటూ వ్యాపారులను ఆదేశించి చేతులు దులుపుకున్నారు. జీడి పంట చేతికొస్తున్న మార్చిలోనే వ్యాపారులు రూ.10వేల వరకు చెల్లించారు. బస్తాకు రూ.వెయ్యి తగ్గించి రూ.తొమ్మిది వేలకు కొనుగోలు చేయాలని మంత్రి సలహా ఇవ్వడం విచిత్రంగా ఉంది. రైతులకు మేలు చేయాల్సిన మంత్రి అప్పలరాజు వ్యాపారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలను మూటగట్టుకున్నారు. ఇప్పటివరకు రైతుల నుంచి తూకం వేసి జీడి పిక్కలను కొనుగోలు చేస్తున్న వ్యాపారులకు ఇక ఆ శ్రమ అవసరం లేకుండా చేయాలని చూస్తున్నట్లుగా మంత్రి మాటలను బట్టి స్పష్టమవుతోంది.
కాశీబుగ్గలో ఈ నెల28న రైతులు ఆహారం మాని 24 గంటల సత్యాగ్రహ దీక్షకు దిగితే మంత్రి అప్పలరాజు ఆ రోజు ఉద్దానం రక్షిత మంచి నీటి పథకం పనుల పరిశీలన పేరిట హడావుడి చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులను వెంటబెట్టుకుని హిరమండలం రిజర్వాయర్ వద్ద ట్రయల్ రన్, మెళియాపుట్టిలో బహిరంగ సభ నిర్వహించి చాలా ఉద్వేగంగా మాట్లాడారు. ఉద్దానమా నీ రుణం తీర్చుకుంటాం అంటూ మాటలు చెప్పిన మంత్రి, ఉద్దానం రైతుల రుణం మాత్రం తీర్చుకోకుండా మూడేళ్లగా వారిని వంచిస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా మంత్రి అప్పలరాజు జీడి పిక్కలకు బస్తాకు రూ.16 వేలు, ఆర్‌బికెల ద్వారా కొనుగోళ్లు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సి ఉంది. లేకుంటే జీడి పోరు చిలికిచిలికి గాలివానలా మారి ప్రభుత్వానికి, పార్టీకి నష్టం కలిగించే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయం వినిపిస్తోంది.










