Aug 02,2023 23:04

మాట్లాడుతున్న మోహనరావు

- రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.మోహనరావు
ప్రజాశక్తి - పలాస : 
జీడిపిక్కల ధరలు రోజురోజుకూ పడిపోవడంతో, పెట్టిన పెట్టుబడులు రాక ఏం చేయాలో తోచక జీడి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఎపి రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.మోహనరావు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలుగానే భావిస్తున్నామన్నారు. మండలంలోని మాకన్నపల్లిలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న జీడి రైతు సైని సింహాచలం సంతాప సభను బుధవారం నిర్వహించారు. సింహాచలం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జీడిరైతు సంఘం జిల్లా కన్వీనర్‌ తెప్పల అజరు కుమార్‌ అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ జీడి రైతులను ప్రభుత్వం విస్మరిస్తోందన్నారు. నాలుగేళ్లుగా జీడిపిక్కల ధర తగ్గిపోవడం, జీడి తోటలపై తెచ్చిన రుణం తీర్చలేక జీడిరైతులు ఆత్మహత్యల బాట పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని ప్రభుత్వ హత్యలుగానే భావించి, మృతుని కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. 80 కేజీల జీడిపిక్కల బస్తాకు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించి, రైతుభరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. స్థానికంగా పండిన పిక్కలకు ప్రాధాన్యత ఇచ్చి ముందుగా కొనుగోలు చేయాలని, జీడి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని, జీడి బోర్డు ద్వారా పంట అభివద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. సభలో సర్పంచ్‌ సైని దేశయ్య, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్‌.గణపతి, ప్రగతిశీల మహిళా సంఘం నాయకులు కె.హేమావతి, సాతుపల్లి కృష్ణారావు, కె.ధర్మారావు, కె.వినోద్‌ కుమార్‌, బి.లకీëనారాయణ తదితరులు పాల్గొన్నారు.