Aug 27,2023 23:06

జీడి 'మద్దతు'కు మరో పోరు

* నేడు మోటారు బైక్‌ ర్యాలీ
* గ్రామాల్లో విస్తృత ప్రచారం
ప్రజాశక్తి - శ్రీకాకుళం, పలాస: 
జీడిపిక్కల మద్దతు ధర కోసం రైతులు పోరాటాన్ని ఉధృతం చేస్తున్నారు. 80 కేజీల జీడిపిక్కల బస్తాకు రూ.16 వేలు, రైతుభరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్న డిమాండ్లతో నాలుగు నెలలుగా పలురూపాల్లో ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికే జీపుజాతా, మహాధర్నా, గ్రామసభలు, సదస్సులు, 24 గంటల జీడి సత్యాగ్రహ దీక్ష, లక్ష సంతకాల సేకరణ చేపట్టగా... పోరుబాటలో మరో అడుగు వేస్తున్నారు. మోటారు బైక్‌ ర్యాలీని ఈనెల 28న చేపడుతున్నారు. కంచిలి నుంచి ప్రారంభమయ్యే ర్యాలీ పలాస వరకు సాగుతుంది. ఉద్దానం గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి రైతులను చైతన్యపరచనున్నారు.
జిల్లాలో మూడేళ్లుగా జీడి రైతులు దగా పడుతూనే ఉన్నారు. 2020 ఆగస్టులో జీడిపిక్కలకు గిట్టుబాటు ధర కల్పించాలని, ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటూ పలురూపాల్లో ఆందోళనలు చేపట్టాక రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు జోక్యం చేసుకుని అధికారులు, వ్యాపారులు, రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 80 కేజీల బస్తాను వ్యాపారులు రూ.తొమ్మిది వేలకు కొనుగోలు చేయాలని, ప్రభుత్వం రైతులకు అదనంగా రూ.వెయ్యి ఇస్తుందని వ్యాపారులను ఒప్పించారు. రైతుభరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామంటూ హామీనిచ్చారు. జీడి రైతులకు డబ్బులూ ఇవ్వలేదు. ఆర్‌బికెల నుంచి పంటా కొనలేదు. ఆ తర్వాత సంవత్సరమూ ఇదే తంతు. గ్రామాల్లో ఎంతమేర జీడి బస్తాల నిల్వలు ఉన్నాయో సర్వే కూడా చేశారు. ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని రైతులకు మరోసారి మాట ఇచ్చారు. ప్రభుత్వం త్వరలో మద్దతు ధర ప్రకటిస్తుందని, అది క్వింటాకా, 80 కేజీల బస్తాకా అని ఆలోచిస్తోందంటూ రైతులను మభ్యపెట్టే ప్రకటనలు చేశారు. రెండేళ్లు గడిచినా దానిపై నోరు మెదపడం లేదు. మద్దతు ధరపై రైతులు ఈ ఏడాదీ ఆందోళనలకు దిగడంతో వ్యాపారులు, రైతులతో మొక్కుబడిగా ఒక సమావేశం నిర్వహించి ఆ తర్వాత ఆ అంశంపై మాట్లాడడమే మానేశారు. మూడేళ్లుగా ఇదే తంతు కొనసాగడంతో వ్యాపారులు తమ పని తాము కానిచ్చేస్తున్నారు. తక్కువ ధరకే పిక్కలను కొని దోపిడీ సాగించారు. 2018-19 సంవత్సరంలో 80 కేజీల బస్తా రూ.14 వేలు నుంచి రూ.15 వేలు మధ్య ధర పలకగా క్రమేణా క్షీణిస్తూ ప్రస్తుతం రూ.7,500 నుంచి రూ.ఎనిమిది వేలకు దిగజారిపోయింది.
జీడి రైతుల్లో ఆగ్రహం
వ్యాపారులు, పాలకుల మోసానికి గురవుతున్న రైతుల్లో తీవ్ర ఆగ్రహం నెలకొంది. మద్దతు ధర కోసం నాలుగు నెలలుగా పట్టుసడలకుండా పోరాడుతూనే ఉన్నారు. గ్రామసభలు, సదస్సులు, జీపుజాతా, మహాధర్నా, 24 గంటల జీడి సత్యాగ్రహ దీక్ష, లక్ష సంతకాల సేకరణ కార్యక్రమాలను చేపట్టారు. ఈ ఆందోళనా కార్యక్రమాలకు గ్రామాల్లో రైతులు, జీడి రైతుల నుంచి విశేష స్పందన లభించింది. లక్ష సంతకాల సేకరణ నేటికీ కొనసాగుతోంది. దీనికి మద్దతుగా పోరాటంలో మరో అడుగు ముందుకు వేసి బైక్‌ ర్యాలీని ఈనెల 28వ తేదీన చేపట్టనున్నారు. ఈ ర్యాలీ కంచిలిలో సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుంది. కవిటి, సోంపేట, మందస, పలాస వరకు ర్యాలీ నిర్వహించనున్నారు.
ప్రధాన డిమాండ్లు
80 కేజీల జీడిపిక్కల బస్తాకు రూ.16 వేలు మద్ధతు ధర ప్రకటించాలి. ఆర్‌బికెల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి.
రాష్ట్రంలో జీడి కార్పొరేషన్‌, జీడి బోర్డు ఏర్పాటు చేయాలి.
స్థానిక పిక్కలు కొనుగోలు చేసిన తర్వాతనే విదేశీ పిక్కల దిగుమతికి అనుమతి ఇవ్వాలి.
జీడితోటల్లో అంతర కృషి పరికరాలు రైతులకు ఉచితంగా అందించాలి.
జీడి పరిశోధనా కేంద్రాలు ప్రాంతాల వారీగా ఏర్పాటు చేసి, అభివృద్ధి చేసిన నాణ్యమైన మొక్కలు రైతులకు అందించాలి.
జీడి పంటకు స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వాలి.
జీడి పంట ప్రాంతంలో పిక్కలు, జీడిపళ్ల ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయాలి.
ఉపాధి హామీ ద్వారా జీడి తోట అభివృద్ధికి ఎకరాకు రూ.94 వేలు రైతులకు అందించాలి.
జీడిపిక్కలు ఆరబెట్టుకునేందుకు టార్ఫాలిన్లను ఉచితంగా అందించాలి.
బైక్‌ ర్యాలీని జయప్రదం చేయాలి
జీడిపిక్కలకు మద్దతు ధర, ఆర్‌బికెల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలనే డిమాండ్లతో మోటారు బైక్‌ ర్యాలీని నిర్వహించనున్నామని ఎపి రైతుసంఘం జిల్లా కార్యదర్శి కె.మోహనరావు, జీడి రైతుసంఘం కన్వీనర్‌ తెప్పల అజరు కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కంచిలి నుంచి పలాస వరకు నిర్వహించే ర్యాలీలో ప్రతి గ్రామం నుంచి రైతులు, జీడి రైతులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.