Jul 28,2023 10:03

పూర్తయిన ఏర్పాట్లు

- కాశీబుగ్గలో నేడు 24 గంటల సత్యాగ్రహ దీక్ష
- గ్రామాల్లో విస్తృత ప్రచారం చేపట్టిన జీడిరైతు సంఘం
- సమాయత్తమవుతున్న రైతులు
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి: 
జీడిపిక్కల మద్దతు ధర కోసం రైతులు పట్టు వదలకుండా పోరాడుతున్నారు. 80 కేజీల జీడిపిక్కల బస్తాకు రూ.16 వేలు, ఆర్‌బికెల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్న డిమాండ్లతో మూడు నెలలుగా పలురూపాల్లో ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈనెల 18వ తేదీన కాశీబుగ్గలో మహాధర్నా నిర్వహించి ప్రభుత్వంలో కదలిక తెప్పించడంలో కొంత విజయం సాధించగలిగారు. రైతులు, వ్యాపారులతో మంత్రి సీదిరి అప్పలరాజు సమావేశం నిర్వహించినా, రైతులకు మేలు కలిగే అంశమేదీ లేకపోవడంతో వారంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉదాసీనం, వ్యాపారుల మోసం, మంత్రి అప్పలరాజు వంచనతో న్యాయం జరగని రైతులు కాశీబుగ్గ సంత మైదానంలో 24 గంటల సత్యాగ్రహ దీక్షకు సమాయత్తమవుతున్నారు.
జిల్లాలో జీడి రైతుల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో, ఇళ్లలోనే దాచుకుంటున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం పంట అమ్మితే తక్కువ ధరకే ఇచ్చేయాల్సి ఉంటోంది. అమ్మకుండా నిల్వ ఉంచితే వర్షాలకు పిక్కలు పోయే పరిస్థితి నెలకొంది. దీంతో ఏం చేయాలో రైతులకు దిక్కుతోచడం లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 70 వేల ఎకరాలకు పైగా జీడి సాగు ఉందని ఉద్యానశాఖ అధికారులు చెప్తున్నారు. సాధారణంగా ఎకరాకు ఐదు బస్తాల దిగుబడి వస్తుందని అధికారుల అంచనాగా ఉంది. ఉద్దానం ప్రాంతంలో ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి వ్యాపారులు జీడి పంట కొనుగోళ్లు ప్రారంభించారు. ఏప్రిల్‌ రెండో వారం వరకు 80 కేజీల బస్తాకు రూ.10,500 వరకు చెల్లించారు. పంట చేతికి రావడం, రైతుల వద్ద పుష్కలంగా పిక్కలు ఉండడంతో క్రమేణా ధర తగ్గిస్తూ రూ.8 వేలు వరకు ఇచ్చారు.
పప్పుకు రేటు... రైతులకు పోటు
పలాస జీడిపప్పుకు మంచి రేటు ఉన్నా, ముడి సరుకుకు ధర రాకపోవడంపై రైతులకు అంతుచిక్కడం లేదు. 80 కేజీల జీడి పిక్కలను ప్రాసెస్‌ చేయిస్తే 25 కేజీల పప్పు దిగుబడి వస్తుంది. ప్రస్తుతం మార్కెట్‌లో కేజీ పప్పు రూ.700 పలుకుతోంది. ఈలెక్కన 25 కేజీలకు రూ.17,500 వస్తుంది. దీంతోపాటు 65 కేజీల జీడి తొక్కు వస్తుంది. కేజీ రూ.15కు అమ్మినా రూ.975 వస్తుంది. మొత్తం కలిపి రూ.18,475 వరకు వస్తోంది. ప్రాసెసింగ్‌, కూలీల ఖర్చులు, విద్యుత్‌ ఛార్జీలు, వ్యాపార లాభం అన్నీ కలిపి రూ.రెండు వేలు మినహాయిస్తే రూ.16,475 మిగులుతోంది. రైతులు ప్రస్తుతం రూ.16 వేలు అడగడం సమంజసమే అన్న అభిప్రాయం అంతటా వినిపిస్తోంది.
మూడేళ్లుగా మోసమే
జీడిపిక్కల కొనుగోళ్లు, మద్దతు ధర విషయంలో మంత్రి అప్పలరాజు మూడేళ్లుగా రైతులను మోసం చేస్తూనే ఉన్నారు. 2020లో వ్యాపారులు, రైతులతో సమావేశం నిర్వహించి 80 కేజీల బస్తాకు రూ.10 వేలుగా ప్రకటించారు. అందులో ప్రభుత్వం తరుపున రూ.వెయ్యి చెల్లిస్తామని హామీనిచ్చారు. ఇప్పటివరకు ఆ డబ్బులు ఇవ్వలేదు. తర్వాత సంవత్సరం ప్రభుత్వమే పిక్కలను కొంటుందని, 80 కేజీల బస్తాకా?, క్వింటాకా ధర నిర్ణయంలో ఉందంటూ మంత్రి అప్పలరాజు ఆ ఏడాది ఊరించారు. ఇప్పటివరకు ఆ డబ్బులూ ఇవ్వలేదు. ఇప్పుడు మళ్లీ ఏమీ తెలియనట్లు ఈనెల 19న మరోసారి వ్యాపారులు, రైతులతో సమావేశం నిర్వహించిన మంత్రి అప్పలరాజు రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండానే బస్తాకు రూ.9 వేలు ఇచ్చేయండంటూ వ్యాపారులను ఆదేశించి సమావేశం ముగించారు. జీడిపిక్కలకు 80 కేజీల బస్తాకు రూ.9 వేలకు కొనాలంటూ వ్యాపారులకు ఉచిత సలహా ఇచ్చారు. జీడిపంట చేతికొస్తున్న మార్చిలోనే వ్యాపారులు రూ.10 వేల వరకు చెల్లించారు. బస్తాకు రూ.వెయ్యి తగ్గించి రూ.9 వేలకు కొనుగోలు చేయమనడంపై రైతులు మండిపడుతున్నారు. పైగా వ్యాపారులకు మేలు చేసేలా కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. ఇప్పటివరకు రైతుల నుంచి తూకం వేసి జీడిపిక్కలను కొనుగోలు చేస్తున్న వ్యాపారులకు ఇక ఆ శ్రమ అవసరం లేకుండా చేసేందుకు ప్రభుత్వమే వారికి రైతుభరోసా కేంద్రాల ద్వారా పిక్కలను కొని వ్యాపారులకు ఇస్తామని చెప్తున్నారు. రైతులకు మేలు చేయాల్సిన మంత్రి వ్యాపారులకు ప్రయోజనం చేకూరేలా వ్యవహరించడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సత్యాగ్రహ దీక్షను జయప్రదం చేయాలి
జీడిపిక్కలకు మద్దతు ధర, ఆర్‌బికెల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలనే డిమాండ్లతో కాశీబుగ్గ సంతమైదానంలో 24 గంటల సత్యాగ్రహ దీక్ష నిర్వహించనున్నామని ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.మోహనరావు, జీడి రైతుసంఘం కన్వీనర్‌ తెప్పల అజరు కుమార్‌ చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్‌ శర్మ ప్రారంభించనున్నారని తెలిపారు. అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు.