
* పంటలకు గిట్టుబాటు ధర కల్పనలో కేరళ ఆదర్శం
* సిపిఎం అఖిల భారత నాయకులు విజూ కృష్ణన్
* మందసలో ప్రజా రక్షణ భేరి బస్సు యాత్ర ప్రారంభం
* సమస్యలు వింటూ భరోసా కల్పిస్తూ సాగిన యాత్ర
* అడుగడుగునా ఘన స్వాగతం
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి, అర్బన్, పలాస, టెక్కలి రూరల్, కోటబొమ్మాళి: జిల్లాలో జీడి పంట పండిస్తున్న రైతులకు మద్దతు ధర ఎందుకు ఇవ్వరని సిపిఎం అఖిల భారత నాయకులు విజూ కృష్ణన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సిపిఎం చేపట్టిన ప్రజా రక్షణ భేరి బస్సు యాత్రను మందసలో గురువారం ఆయన ప్రారంభించారు. తొలి రోజు యాత్ర మందస, పలాస, టెక్కలి, కోటబొమ్మాళి మీదుగా శ్రీకాకుళం చేరుకుంది. ఈ సందర్భంగా మందస, శ్రీకాకుళం నగరంలో నిర్వహించిన బహిరంగ సభల్లో విజూ కృష్ణన్ ముఖ్య వక్తగా మాట్లాడారు. విశాఖలో కాఫీ రైతులకు, జిల్లాలో జీడి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదన్నారు. జీడి పంటకు మద్దతు ధర విషయంలో కేరళ రాష్ట్రంలోని వామపక్ష ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందన్నారు. జీడి పంట ఉత్పత్తి, గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వరికి క్వింటాకు రూ.2,850 చెల్లిస్తోందని చెప్పారు. కేరళలో 16 రకాల కూరగాయలకు బేసిక్ ధర నిర్ణయించిందని తెలిపారు.
బస్సు యాత్రకు మద్దతుగా నిలవాలి
జీడి రైతులను వ్యాపారులు దోపిడీ చేస్తున్నారు. జీడి, కొబ్బరి పంటల కోసం బోర్డు ఏర్పాటు చేయాలని చాలా కాలంగా రైతులు కోరుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. మహేంద్రతనయ నీళ్లు సముద్రంలో కలుస్తున్నా ప్రాజెక్టులు నిర్మించకపోవడంతో, వృథాగా సముద్రంలో కలుస్తున్నాయి. వంశధార ప్రాజెక్టుతో జిల్లాను సస్యశ్యామలం చేస్తున్నామంటూ వైసిపి, టిడిపి మాటలు చెప్తున్నాయి తప్ప పని జరగలేదు. అసమానతలు లేని అభివృద్ధి కోసం సిపిఎం చేపట్టిన బస్సు యాత్రకు అంతా మద్దతుగా నిలవాలి.
- కె.లోకనాథం, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు
పాలకుల వైఫల్యం వల్లే వలసలు
వైసిపి, టిడిపి ప్రభుత్వాలు జిల్లా అభివృద్ధినివిస్మరించాయి. దాని ఫలితంగా ఈ ప్రాంతం నుంచి గుజరాత్, ముంబయి ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. విశాఖ రైల్వే జోన్, ఈ ప్రాంతానికి గిరిజన యూనివర్సిటీ, వెనుకబడిన జిల్లాకు నిధులు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం మోసం చేసింది. ఈ ప్రాంతానికి ద్రోహం చేసిన బిజెపిని, ఆ పార్టీకి మద్దతు పలుకుతున్న వారిని ఓడించాలి. ప్రత్యామ్నాయ విధానాలు, రాజకీయ ప్రణాళికను ప్రజల ముందు ఉంచేందుకు విజయవాడలో ఈనెల 15న నిర్వహించే బహిరంగ సభకు ప్రజలు అధిక సంఖ్యలో రావాలి.
- మంతెన సీతారాం
సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు
అసమానతల్లేని అభివృద్ధి కావాలి
అసమానతల్లేని అభివృద్ధి కావాలి. రాష్ట్రంలో కరువు మండలాలు చాలా ఉండగా, 103 మండలాలను ప్రకటించి కాకిలెక్కలు చెప్తున్నారు. జిల్లాలో ఒక్క మండలాన్నీ కరువు మండలంగా ప్రకటించలేదు. రైస్‌మిల్లుల్లో, గ్రానైట్ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు రూ.25 వేలు కనీస వేతనం చెల్లించాలి. కరెంట్ ఛార్జీలు పెరగడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలే కారణం. వృద్ధాప్య, వికలాంగ, వితంతు పింఛన్లు రూ.ఐదు వేలు అందించాలి.
- ఎ.వి నాగేశ్వరరావు,
సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు
ప్రజావసరాలు తీర్చడంలో విఫలం
శ్రీకాకుళం నగర ప్రజల అవసరాలను తీర్చడంలో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు విఫలమయ్యారు. మున్సిపాలిటీని నగరపాలక సంస్థగా స్థాయి పెంచినా, మౌలిక వసతులు కల్పించడంలో మాత్రం ధర్మానకు చిత్తశుద్ధి లేదు. కార్పొరేషన్‌గా బోర్డు మార్చినంత మాత్రాన ప్రజల జీవన స్థితి మెరుగుపడదు. రోడ్లు, కాలువలు ఇతర మౌలిక సౌకర్యాలు కల్పించాలి. పౌర సేవా సంఘం ఆధ్వర్యాన ప్రజలతో కలసి ఈ సమస్యల పరిష్కారానికి ఉద్యమిస్తాం.
- బి.తులసీదాస్
సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు
సమస్యలు వింటూ.. భరోసానిస్తూ...
తమ సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలని బస్సు యాత్ర బృందానికి రైతులు, గిరిజనులు, వ్యాపారులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీలు వినతిపత్రాలు అందించారు. జీడి పిక్కలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కృషి చేయాలని జీడి రైతులు వినతిపత్రం ఇచ్చారు. తమ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని పలువురు గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎస్ రద్దు, పాఠశాలల విలీనం సమస్యలపై యుటిఎఫ్ ఆధ్వర్యాన ఉపాధ్యాయులు, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్యర్యాన అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు వినతిపత్రం అందించారు. సమస్యల పరిష్కారానికి తమవంతు కృషి చేస్తామని సిపిఎం నాయకులు హామీనిచ్చారు.
అడుగడుగునా ఘన స్వాగతం
బస్సు యాత్ర బృందానికి అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. తొలుత మందస ప్రాంతానికి చేరుకున్న బృందం వీరగున్నమ్మ స్థూపానికి నివాళ్లుఅర్పించారు. మందస హైస్కూల్ నుంచి భారీ ప్రదర్శన చేపట్టారు. డప్పు కళాకారుల వాయిద్యాలతో స్వాగతం పలికారు. తప్పెట్లగుళ్లు ప్రదర్శించారు. శ్రీకాకుళం మండలం పెద్దపాడు జాతీయ రహదారి కూడలికి చేరుకున్న బస్సు యాత్ర బృందానికి పెద్దసంఖ్యలో ప్రజాసంఘాల నాయకులు ఎదురెళ్లి నగరంలోకి స్వాగతించారు. అనంతరం అక్కడ నుంచి బైక్ ర్యాలీగా బయలుదేరి నగరంలోని ఏడు రోడ్ల కూడలి వద్దకు చేరుకున్నారు.
తొలి రోజు 210 కి.మీ మేర సాగిన యాత్ర
మందసలో ప్రారంభమైన తొలి రోజు బస్సు యాత్ర పలాస, టెక్కలి, కోటబొమ్మాళి మీదుగా శ్రీకాకుళం చేరుకుంది. ఏడు రోడ్ల కూడలి వద్ద సభ నిర్వహించి తొలి రోజు యాత్ర ముగించారు. సుమారు 210 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది.
చిలకపాలెంలో నేడు బహిరంగ సభ
బస్సు యాత్ర రెండో రోజు ఎచ్చెర మండలం చిలకపాలెంలో ఉదయం ఏడు గంటలకు ప్రారంభం కానుంది. చిలకపాలెం కూడలిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. అనంతరం బస్సు యాత్ర విజయనగరం బయలుదేరుతుంది.
కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కె.ధనలక్ష్మి, జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.మోహనరావు, భవిరి కృష్ణమూర్తి, గంగరాపు సింహాచలం, నాయకులు కె.నాగమణి, కె.శ్రీనివాసు, వి.జి.కె మూర్తి, పి.తేజేశ్వరరావు, ఎన్.షణ్ముఖరావు, ఎన్.గణపతి, తెప్పల అజరుకుమార్, పాతిన క్రిష్ణమూర్తి, ఆర్.దిలీప్‌కుమర్, గోపి, ఎం.ధర్మారావు, కొల్లి ఎల్లయ్య, హనుమంతు ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.