ప్రజాశక్తి- నక్కపల్లి:వాతావరణం అనుకూలించక తీవ్రంగా నష్టపోయిన జీడి, మామిడి రైతులను, తోటలు కౌలుకు తీసుకున్న కౌలు రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.అప్పలరాజు కోరారు. మండలంలోని ఉపమాకలో ఆదివారం జీడి, మామిడి తోటలను రైతులు, కౌలు రైతులతో కలిసి పరిశీలించారు. అప్పులు చేసి ఎరువులు, పురుగు మందులతో తోటలకు పెట్టుబడులు పెట్టినా ఫలితం లేకుండా పోయిందని, వాతావరణం అనుకూలించక పోవడంతో పూత నల్లగా మాడిపోయి రాలి పోతోందని దీంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు, కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అప్పలరాజు మాట్లాడుతూ, గత రెండు సంవత్సరాలుగా మామిడి దిగుబడి ఉన్నప్పటికీ ఎగుమతి చేయడానికి కరోనా కారణంగా రవాణా సౌకర్యం లేక పోవడంతో రైతులు, కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఈ సంవత్సరం వాతావరణం అనుకూలించక పోవడంతో నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది రూపాయల అప్పులు తీర్చే దారిలేక, వడ్డీలు చెల్లించే పరిస్థితి లేక పోవడంతో వీరు ఆందోళన చెందుతు న్నారన్నారు. జిల్లా కలెక్టర్, ఉద్యానవన అధికారులు తోటలు పరిశీలించి నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బంగారు రాజు, తంగేడు రాజు, బంగారు లోవరాజు, ఎర్రంశెట్టి పండు పాల్గొన్నారు.










