Sep 04,2023 23:18

మాట్లాడుతున్న మాధవరావు

ప్రజాశక్తి- పలాస: పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ లేబరు కాలనీలోని సాయిబాలాజీ జీడి పరిశ్రమ యజమాని పొట్నూరు బాలరాజు జీడి కార్మికులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, వాటిని ఖండించాలని సీపీఐ ఎం.ఎల్‌ న్యూడెమాక్రసీ జిల్లా కార్యదర్శి వంకల మాధవరావు, ఐఎఫ్‌ టియు నాయకులు జుత్తు వీరాస్వామిలు అన్నారు. సోమవారం విలేకరులతో వారు మాట్లాడుతూ జీడి పరిశ్రమలో పని చేస్తున్న 16 మంది కార్మికులు గత 18 నెలలుగా జీడిపప్పు దొంగతనం చేస్తున్నట్లు 10 లక్షల రూపాయల విలువైన జీడిపప్పు పోయిందని, జీడిపప్పు ఉత్పత్తిదారుల సంఘానికి ఫిర్యాదు చేయడం, ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.. సిసి కెమెరాలున్నాయి కదా దొంగ తనం జరిగే సంఘటనలను రికార్డు చేస్తాయని, వాటిని చూడాలని యజమానిని కోరితే అవి పాడైపోయాయని సమాధానం ఇచ్చారని అన్నారు. జీడి యజమాని, జీడి కార్మికుల మధ్య విచారణ కమిటీ వేయకుండా మొత్తం జీడిపరిశ్రమలను బంద్‌ చేయడం సరైన పద్దతి కాదని అన్నారు. ఆధారాలుంటే నిరూపించాలని, లేకుంటే యజమాని క్షమాపణ చెప్పాలని అన్నారు. కార్మికులపై వచ్చిన ఆరోపణలను విచారణ జరపాలని, కార్మిక శాఖాధికారులు జోక్యం చేసుకోవాలని, యాజమాన్యాలు సహనంతో వ్యవహరించాలే తప్ప సమస్యను జఠిలం చేయడం సరికాదని అన్నారు. సమావేశంలో పివోడబ్ల్యు అధ్యక్షురాలు బతకల ఈశ్వరమ్మ. అరుణోదయ జిల్లా కార్యదర్శి కె. సోమేశ్వరరావు, ఎఐకెఎంఎస్‌ జిల్లా నాయకులు బైరి కూర్మారావు, రట్టి భీమన్న, జీడి కార్మికులు రాజేశ్వరి, రమ్య, రమణలు పాల్గొన్నారు.