Jun 01,2022 06:45

ఇప్పుడు జిఎస్‌టి లో వివిధ రేట్లు ఉన్నాయి. అన్నింటినీ కలిపేసి ఒకే ఒక రేటు జిఎస్‌టి అమలు చేయాలని కార్పొరేట్లు తెగ గోల చేస్తున్నాయి. ఇదే జరిగితే, జిఎస్‌టి వసూళ్ళు మరింత తగ్గుతాయి. కొన్ని రకాల వస్తువులపై ఇప్పుడు అధిక రేటు వసూలు చేస్తున్నారు. సంపన్నులు ఎక్కువగా ఉపయోగించే వస్తువులపై ఆ విధంగా వసూలు చేయడం కొంతవరకైనా నయమే. కాని ఏకంగా ఒకే ఒక రేటు విధిస్తే, ఆ పాటి తేడా కూడా లేకుండా పోతుంది. ఇప్పటికే పేదవారికి భారంగా ఉన్న ఈ పరోక్ష పన్నుల విధానం మరింత తిరోగమన స్వభావాన్ని సంతరించుకుంటుంది. 18 శాతానికి మించి పన్ను ఉండరాదన్న డిమాండ్‌ గనుక అమలు జరిగితే, సాధారణ వినియోగదారులు ఎక్కువగా ఉపయోగించే వస్తువుల మీద జిఎస్‌టి కాస్తా 18 శాతానికి చేరి ధరల పెరుగుదలకు దారితీస్తుంది.

జిఎస్‌టి విధానంతో మనం గత ఐదేళ్ళుగా పొందిన అనుభవం చాలా అసంతృప్తినే మిగిల్చింది (కాస్త మర్యాదగా చెప్పాలంటే). జిఎస్‌టి కి వెన్నెముకగా పని చేసే ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించడం నాలుగేళ్ళ పాటు జరగనేలేదు. పన్ను రాబడిలో పెరుగుదల ఆశించిన స్థాయిలో లేదు. కోవిడ్‌ సాకుని చూపించి పన్ను ఆదాయం పడిపోడాన్ని సమర్ధించుకుంది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రాలకు చెల్లించవలసిన నష్ట పరిహారం చాలా ఆలస్యంగా జరుగుతోంది. పైగా అది కూడా బకాయి పడింది కేంద్రం. ఇప్పుడు ఆ నష్ట పరిహారం చెల్లించే గ్యారంటీ కాలం ముగియవస్తోంది. దాని ఫలితంగా చాలా రాష్ట్రాలు ఉన్నట్టుండి తమ పన్ను రాబడిలో తీవ్రమైన తగ్గుదలను ఎదుర్కొనవలసిన పరిస్థితి ఏర్పడబోతోంది. దాని పర్యవసానంగా అవి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఈ సమస్యల గురించి ఎటువంటి చర్చా కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య జరగడం లేదు. 2020-21లో జిఎస్‌టి కౌన్సిల్‌ ఏకంగా ఆరు నెలలపాటు సమావేశమే కాలేదు. ఆ తర్వాత జరిగిన సమావేశంలో కొందరు అనుభవజ్ఞులు జిఎస్‌టి కౌన్సిల్‌ సమావేశాలు జరుగుతున్న తీరు అప్రజాస్వామికంగా ఉందని బాహాటంగానే తమ అభ్యంతరాలను ప్రకటించారు. ఆ చర్చ కాస్తా పార్టీల నడుమ చర్చ మాదిరిగా సాగింది. జిఎస్‌టి విధానానికి మొదటినుంచీ సానుకూలంగా ఉంటున్న ఒక మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి సైతం త్వరలోనే జిఎస్‌టి వ్యవస్థకు మరణశాసనం రాయవలసివస్తుందేమోనని ఆవేదన వ్యక్తం చేశారు.
      భారత ఫెడరల్‌ విధానంలో కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య ద్రవ్య వ్యవస్థలో ఉండవలసిన సమతూకం రానురానూ దెబ్బ తింటున్న నేపథ్యంలో జిఎస్‌టి విధానాన్ని ఫెడరల్‌ సూత్రాల కోణం నుండి సమీక్షించవలసిన అవసరం ముందుకొచ్చింది. బడా కార్పొరేట్లకు అనుకూలంగా ఉన్న ప్రస్తుత విధానాన్ని కేంద్ర ప్రభుత్వం మొదటినుంచీ సమర్ధిస్తూనే వుంది. ఆ క్రమంలో రాష్ట్రాల ప్రయోజనాలను నిర్లక్ష్యం చేస్తోంది. ఇది చాలదన్నట్టు ఇంకా పన్ను రేట్లును హేతుబద్ధం చేయాలన్న (అంటే ఆ యా రాష్ట్రాల ప్రత్యేకతలతో సంబంధం లేకుండా చేయడం అన్నమాట) వాదనను ముందుకు తెస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యంగా రాష్ట్రాలకు మరింత ఎక్కువ వెసులుబాటు ఉండేలా జిఎస్‌టి విధానంలో మార్పులు చేయాలని వాదించేవారికి ఈ తీర్పు బలం చేకూరుస్తుంది.
 

                                                              సుప్రీం కోర్టు తీర్పు

సుప్రీం కోర్టు తీర్పు నేరుగా ద్రవ్య వ్యవస్థలోని ఫెడరల్‌ సంబంధాల గురించి ఏమీ చెప్పలేదు. గుజరాత్‌ హైకోర్టు ఇచ్చిన ఒకానొక తీర్పును అది సమీక్షించింది. అంతే. కొన్ని రకాల వస్తువుల దిగుమతుల నుండి వసూలు చేసిన రవాణా చార్జీల మీద గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వం జిఎస్‌టి విధించింది. ఆ విధింపు చెల్లదని గుజరాత్‌ హైకోర్టు తీర్పునిచ్చింది. కింది కోర్టు తీర్పు సరైనదేనని సుప్రీం కోర్టు నిర్ధారించింది. ఆ సందర్భంగా కొన్ని కీలక నిర్ధారణలను ప్రకటించింది.

1. రాజ్యాంగం లోని 279-ఎ అధికరణం ప్రకారం, జిఎస్‌టి కౌన్సిల్‌ అనేది సిఫార్సు చేసే మండలి మాత్రమే. జిఎస్‌టి కౌన్సిల్‌ కూడా రాజ్యాంగబద్ధంగా ఏర్పడినదే అయినప్పటికీ, అది చేసిన సిఫార్సులు తప్పనిసరిగా అమలు కావాలంటే అందుకోసం పార్లమెంటు కాని, అసెంబ్లీలు కాని మళ్ళీ చట్టాలు చేయాల్సిందే. చట్ట సభల అధికారాలను జిఎస్‌టి కౌన్సిల్‌ హరించజాలదు.
2. జిఎస్‌టి మీద చట్టాలు చేయడానికి పార్లమెంటుకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఉమ్మడి అధికారాలు ఉన్నాయి. జిఎస్‌టి పై చేసిన రాజ్యాంగ సవరణలో ఈ అధికారాల గురించి ఎటువంటి ప్రత్యేక ప్రస్తావనా లేదు. కనుక ఏక కాలంలో, అటు కేంద్రానికి, ఇటు రాష్ట్రాలకు జిఎస్‌టి విషయంలో చట్టాలు చేసే అధికారాలు ఉన్నాయి.
3. భారతదేశ ఫెడరల్‌ వ్యవస్థలో కేంద్రానికి రాష్ట్రాలకు నడుమ సహకారం అన్నది నిరంతరం కొనసాగే సంప్రదింపుల ప్రక్రియ. అటువంటి సహకారం కొరవడిందని రాష్ట్రాలు భావించినప్పుడు కేంద్రాన్ని రాష్ట్రాలు వివిధ రూపాలలో సవాలు చేయవచ్చు.
ఈ తీర్పును ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలు స్వాగతించాయి. అయితే, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నట్టుగా సుప్రీం కోర్టు తీర్పులో ఏమీ లేదని, కేంద్ర ప్రభుత్వ విధానాన్నే సుప్రీంకోర్టు సమర్ధించిందని, జిఎస్‌టి కౌన్సిల్‌ పని యథాతథంగా చేసుకుపోతుందని కేంద్ర ప్రభుత్వం సమర్ధించుకుంది.
 

                                                    ఎస్‌జిఎస్‌టి రేట్లు - రాష్ట్రాల హక్కులు

అయితే, సుప్రీం కోర్టు తీర్పుతో ఇంతకాలమూ ముగిసిపోయాయనుకున్న అనేక అంశాలు తిరిగి జీవం పోసుకున్నాయి. జిఎస్‌టి విషయమై జరిగిన రాజ్యాంగ సవరణ దేశంలో ఒక జిఎస్‌టి విధానాన్ని ప్రవేశపెట్టడానికి కావలసిన స్థూలమైన చట్రాన్ని మాత్రమే రూపొందించింది. ఆ చట్రం పరిధి లోపల రాష్ట్రాలకు, ప్రజలకు అనుకూలంగా ఉండే ఒక జిఎస్‌టి విధానాన్ని రూపొందిచడం సాధ్యమా, కాదా అన్నది ఇప్పటికీ ఒక చర్చనీయాంశంగానే ఉంది.
     ప్రస్తుతం ముఖ్యంగా పరిగణించాల్సిన అంశం ఏమంటే రాష్ట్రాలు ఎస్‌జిఎస్‌టి రేట్లను తగు విధంగా మార్చుకోవచ్చునా, లేదా అన్న విషయం. గతంలో రూపొందించిన వ్యాట్‌ యొక్క సూత్రాన్ని జాతీయ స్థాయిలో వర్తింపజేస్తే జిఎస్‌టి విధానం వచ్చిందని అనుకోవచ్చు. అందులో రాష్ట్రాలు విధించే ఇతర పరోక్ష పన్నులు, కేంద్రం విధించే సర్వీసు టాక్స్‌, ఎక్సైజ్‌ టాక్స్‌ వంటివి విలీనం అయిపోయాయి. దేశ వ్యాప్తంగా ఒకే రూపంలో ఉండేలా పన్ను రేట్లను వ్యాట్‌ ప్రవేశపెట్టింది. కాని, ఆచరణలో ఆ యా రాష్ట్రాల నడుమ చిన్నపాటి తేడాలు వచ్చాయి. జిఎస్‌టి విధానాన్ని రూపొందించే సమయంలో ఏర్పాటు చేసిన రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సాధికార కమిటీలో కూడా, రాష్ట్రాల నడుమ తేడాలు కొనసాగేలా జిఎస్‌టి విధానంలో వెసులుబాట్లు ఉండాలన్న ఉమ్మడి అవగాహన వచ్చింది.
     అయితే, పార్లమెంటులో జిఎస్‌టి పై చట్టం చేసేటప్పుడు మాత్రం, ప్రకృతి వైపరీత్యాలు వంటి అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే, అదికూడా ఒక నిర్దిష్ట పరిమిత కాలానికి మాత్రమే రాష్ట్రాలు అదనపు పన్ను విధించవచ్చునని ఒక చిన్న వెసులుబాటును మాత్రం కల్పించారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, రాజ్యాంగ సవరణలో రాష్ట్రాల హక్కులను కుదించే అంశం ఏదీ లేనందువలన, రాష్ట్రాలు తమ తమ ప్రత్యేక పరిస్థితులకు అనుగుణంగా పన్ను రేట్లను (ఎస్‌జిఎస్‌టి రేట్లను) మార్చుకోవచ్చును. అయితే సుప్రీం కోర్టు తీర్పు తర్వాత కేంద్రంలో అప్పుడే, రాష్ట్రాలకున్న ఈ హక్కును రద్దు చేసే విధంగా ఎటువంటి చట్ట సవరణలు తీసుకురావాలన్న చర్చ మొదలైంది.
    రాష్ట్రాలకు ఎస్‌జిఎస్‌టి విషయంలో వెసులుబాటు కల్పించడం అంటే జాతీయ స్థాయిలో జిఎస్‌టి విధానం అమలుకు అది ఏ విధంగానూ ఆటంకం కాబోదు. అంటే, కేంద్ర జిఎస్‌టి, అంతర్రాష్ట్ర జిఎస్‌టి లలో ఏ మార్పూ ఉండదు. విలువ-ఆధారిత పన్ను గణనకు ఏ ఇబ్బందీ కలగదు.
     ఇందుకు సంబంధించి కేరళలో ఒక నిర్దిష్ట అనుభవం ఉంది. 2018 వరదల అనంతరం, రాష్ట్రంలో ఒక శాతం ఎస్‌జిఎస్‌టి పన్నును అదనంగా విధించడానికి అనుమతి నిచ్చారు. రెండేళ్ళపాటు ఆ అదనపు పన్ను ఎటువంటి ఇబ్బందీ లేకుండా అమలు జరిగింది. ఆ తర్వాత ఆ పన్ను ఉపసంహరించాము. సుప్రీం కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు నేపథ్యంలో అటువంటి అదనపు పన్ను    వసూలు చేసుకోడానికి రాష్ట్రాలకు అవకాశం ఎందుకు ఇవ్వకూడదు ?

                                                          పన్ను రేట్ల హేతుబద్ధీకరణ

ఇప్పుడు జిఎస్‌టి లో వివిధ రేట్లు ఉన్నాయి. అన్నింటినీ కలిపేసి ఒకే ఒక రేటు జిఎస్‌టి అమలు చేయాలని కార్పొరేట్లు తెగ గోల చేస్తున్నాయి. ఇదే జరిగితే, జిఎస్‌టి వసూళ్ళు మరింత తగ్గుతాయి. కొన్ని రకాల వస్తువులపై ఇప్పుడు అధిక రేటు వసూలు చేస్తున్నారు. సంపన్నులు ఎక్కువగా ఉపయోగించే వస్తువులపై ఆ విధంగా వసూలు చేయడం కొంతవరకైనా నయమే. కాని ఏకంగా ఒకే ఒక రేటు విధిస్తే, ఆ పాటి తేడా కూడా లేకుండా పోతుంది. ఇప్పటికే పేదవారికి భారంగా ఉన్న ఈ పరోక్ష పన్నుల విధానం మరింత తిరోగమన స్వభావాన్ని సంతరించుకుంటుంది. 18 శాతానికి మించి పన్ను ఉండరాదన్న డిమాండ్‌ గనుక అమలు జరిగితే, సాధారణ వినియోగదారులు ఎక్కువగా ఉపయోగించే వస్తువుల మీద జిఎస్‌టి కాస్తా 18 శాతానికి చేరి ధరల పెరుగుదలకు దారితీస్తుంది. అందుచేత సామాన్య ప్రజలు ఉపయోగించే వస్తువుల మీద తక్కువ రేటు, విలాస వస్తువులపై ఎక్కువ రేటు విధించే విధానం ఉండాల్సిందే.
      వివిధ రకాల రేట్లు ఉండడం అనేదానిని అనవసరంగా ఒక పెద్ద సమస్యగా చిత్రీకరిస్తున్నారు. నిజానికి జిఎస్‌టి విధానం కన్నా ముందు దేశంలో ఉండిన పన్ను విధానంతో పోల్చుకుంటేనే జిఎస్‌టి ఏ మేరకు పన్ను విధానాన్ని సరళీకరించగలిగింది అనేది అంచనా వేయవచ్చు. దేశంలో ఉన్న పేదరికపు విస్తృతిని, ఆదాయాల అసమానతలను దృష్టిలో ఉంచుకున్నప్పుడు సామాన్యుడు వాడే గోధుమ పిండికి, సంపన్నులు వాడే విలాసవంతమైన కార్లకు ఒకే రేటు పన్ను విధించడం ఎంత అన్యాయమో బోధపడుతుంది. ''ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌'' ఎంత ముఖ్యమో సమానత్వ సాధన కనీసం అంతే ముఖ్యమని గుర్తించాలి. సరళీకరణ పేరుతో న్యాయాన్ని బలి చేయకూడదు.
 

                                                              కౌన్సిల్‌ పని తీరు

చివరి అంశం: జిఎస్‌టి కౌన్సిల్‌ పని చేస్తున్న తీరును పునస్సమీక్షించాలి. వ్యాట్‌ విధానం అమలవుతున్న కాలంలో కూడా ఆర్థిక మంత్రుల సాధికార కమిటీ పనిచేస్తూ వుండేది. కాని జిఎస్‌టి విధానం అమలులోకి వచ్చాక ఒక కీలకమైన తేడా వచ్చింది. కౌన్సిల్‌ లో వోటింగ్‌ హక్కులు నిర్ణయించిన తీరు ఏ విధంగా ఉన్నదంటే, కేంద్రం అంగీకరించనిదే ఏ నిర్ణయమూ చేయడం కుదరదు. చివరికి అన్ని రాష్ట్రాలూ ఏకగ్రీవంగా ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినా కూడా అదే పరిస్థితి. కౌన్సిల్‌లో ఏ నిర్ణయం జరగాలన్నా నాలుగింట మూడొంతుల మెజారిటీతో జరగాలి. కేంద్ర ప్రభుత్వానికి మూడోవంతు వోట్లు ఉన్నాయి. ఇటీవలి పరిణామాల అనుభవం రీత్యా కౌన్సిల్‌ ను ఏ విధంగా నిర్వహించాలన్నది తిరిగి పరిశీలించి తగు మార్పులు చేయాలి.
     ఇటువంటి విషయాలపై చర్చించి నిర్ణయాలు చేయడానికి సుప్రీం కోర్టు తన తీర్పు ద్వారా అనువైన వాతావరణం కల్పించింది. సహకార ఫెడరల్‌ స్ఫూర్తితో వ్యవహరించవలసిన తరుణం ఇది. కనీసం రాష్ట్రాలకు నష్ట పరిహారాన్ని చెల్లించే గడువునైనా పొడిగించాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఆ రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు చితికిపోకుండా నివారించగలుగుతాం. ఈ నష్ట పరిహారాన్ని కేంద్ర బడ్జెట్‌ నుండి చెల్లించడం లేదు. అక్రమ రవాణాలో దొరికిపోయిన వస్తువులపై వేసిన అపరాధ రుసుముతో, విలాస వస్తువులపై విధించిన పన్నుతో ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. దాని నుండి నష్టపరిహారాన్ని రాష్ట్రాలకు చెల్లిస్తున్నారు. కనుక గడువును పొడిగించినందువలన కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి నష్టమూ ఉండబోదు. ప్రతిపక్ష పార్టీలు, వాటి ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వాలు జిఎస్‌టిని ఒక నిజమైన ఫెడరల్‌ స్వభావం గల పన్ను వ్యవస్థగా మార్చడానికి పోరాడాల్సిన తరుణం వచ్చింది.

( స్వేచ్ఛానుసరణ )
టి.ఎం. థామస్‌ ఐజాక్‌

11