
- రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టేందుకు మంత్రి యత్నం - తీవ్రంగా వ్యతిరేకించిన వామపక్షాలు
-సభ గురువారానికి వాయిదా - దేశవ్యాప్త సమ్మె విజయవంతం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : జనరల్ ఇన్సూరెన్స్‌ను ప్రైవేటీకరించేందుకు ఉద్దేశించిన జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ (జాతీయీకరణ) సవరణ బిల్లును సిపిఎం, ఇతర ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. రాజ్యసభలో బుధవారం ఈ బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. సిపిఎం పక్షనేత ఎలమరం కరీం లేచి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. అయితే దీనికి సభాధిపతి అనుమతించలేదు. ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి వీల్లేదని, విస్తృత పరిశీలన కోసం సెలెక్టు కమిటీకి నివేదించాలని కరీం డిమాండ్ చేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. బిల్లు ప్రవేశపెట్టకుండానే సభ గురువారానికి వాయిదా పడింది.
దేశవ్యాప్త సమ్మె జయప్రదం
ప్రభుత్వ రంగంలోని జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలను ప్రైవేటీకరించేందుకు తీసుకొచ్చిన జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ (జాతీయీకరణ)సవరణ బిల్లు- 2021ను వ్యతిరేకిస్తూ సాధారణ బీమా (జనరల్ ఇన్సూరెన్స్) ఉద్యోగులు బుధవారం చేపట్టిన దేశవ్యాప్త సమ్మె విజయవంతమైంది. ఎలాంటి చర్చ లేకుండా లోక్‌సభలో ఈ బిల్లును మంగళవారం ఆమోదించారు. దాంతో బుధవారం పిజిఎస్‌ఐ కంపెనీల్లో జాయింట్ ఫోరమ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ నేతృత్వంలో నాలుగు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు సమ్మెలో పాల్గొన్నాయి. 66వేల మంది ఉద్యోగులు, అధికారులు సమ్మెలో పాల్గొన్నారు.
జిఐసి ఉద్యోగులకు సిఐటియు అభినందనలు
దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేసిన ఉద్యోగులకు అభినందనలు తెలియజేస్తూ సిఐటియు ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఎవరెంత చెప్పినా వినకుండా మోడీ ప్రభుత్వం మొండి పట్టుదలతో తన ఎజెండాతో ముందుకెళ్లడాన్ని సిఐటియు ఖండించింది. బీమా, బ్యాంకింగ్, రక్షణ, రైల్వేస్, గనులు వంటి వ్యూహాత్మక రంగాలతో సహా మొత్తంగా ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరించి తమ ఆశ్రితులైన కార్పొరేట్లకు కట్టబెట్టడానికి చూస్తోందని సిఐటియు విమర్శించింది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాధారణ బీమా కంపెనీల ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి తమ పూర్తి మద్దతు, సంఘాభావం వుంటుందని సిఐటియు హామీ ఇచ్చింది. బుధవారం నాటి సమ్మెకు మద్దతిచ్చిన వివిధ రంగాల ఉద్యోగులు, కార్మికులను అభినందించింది. దేశ వనరులను కొల్లగొట్టడానికి, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటాన్ని మరింత బలోపేతం చేయాలని సిఐటియు కార్మిక లోకానికి పిలుపునిచ్చింది. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధ్వంసకర విధానాల నుంచి దేశాన్ని కాపాడాలని ఆ ప్రకటనలో తపన్ సేన్ కోరారు.