Jun 22,2021 06:56

   వ్యాక్సిన్‌ ల తయారీపై పేటెంటు నిబంధనల సడలింపుకు అనుమతిస్తే మొత్తం పేద, మధ్య తరహా దేశాలలోని ప్రజలందరికీ వ్యాక్సిన్‌ అందించడానికి 650 కోట్ల డాలర్లు సరిపోతాయని, అదే నిబంధనలను సడలించకపోతే 8000 కోట్ల డాలర్లు అవసరం అవుతాయని ఆక్స్‌ఫామ్‌ లెక్క వేసింది. అంటే పేటెంటు నిబంధనలను అడ్డం పెట్టుకుని కార్పొరేట్‌ సంస్థలు ఏకంగా 7400 కోట్ల డాలర్ల దోపిడీ చేస్తాయన్నమాట! ఇంకో విధంగా చెప్పాలంటే ప్రజానీకానికి వ్యాక్సిన్‌ అందించడానికి అయ్యే ఖర్చులో 90 శాతం పేటెంటు హక్కులున్న కార్పొరేట్‌ కంపెనీలకే సమర్పించుకోవాలి.
   ఇటీవలే ముగిసిన శిఖరాగ్ర సమావేశాలలో 'అభివృద్ధి చెందుతున్న' దేశాల ప్రజల కోసం 100 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్‌ లను విరాళంగా ఇవ్వనున్నట్లు జి-7 దేశాలు ప్రకటించాయి. అమెరికా 50 కోట్లు, బ్రిటన్‌ 10 కోట్లు, తక్కిన దేశాలు- ఇటలీ, జపాన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, కెనడా-తక్కిన 40 కోట్ల డోసులు ఇస్తాయి.
    100 కోట్ల డోసులు అంటే వినడానికి చాలా ఎక్కువగా అనిపిస్తుంది కాని...ప్రపంచం ముందున్న అవసరంతో పోల్చితే ఇది చాలా తక్కువ. ఈ 7 సంపన్న దేశాలూ తమ దేశాల ప్రజలకు రెండేసి డోసులు ఇచ్చాక ఆపైన అదనంగా తమ వద్ద పోగేసుకున్న వ్యాక్సిన్‌ నిల్వలతో పోల్చినా తక్కువే. అందుకే అంతర్జాతీయంగా అనేక పౌర సంస్థలు జి-7 దేశాల ప్రకటనను ఒక పబ్లిసిటీ స్టంటుగా అభివర్ణించాయి.
   ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద వ్యాక్సిన్‌ లు అందకుండా ఉన్న జనాభా 680 కోట్లు. వీరందరికీ 1360 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ లు అవసరం. అందులో జి-7 దేశాలు ఇస్తామని ప్రకటించింది 100 కోట్లు. ఇది కేవలం 7.4 శాతం మాత్రమే. మొత్తం ప్రపంచ అవసరంలో అభివృద్ధి చెందుతున్న దేశాల అవసరం మాత్రమే లెక్క వేసినా అది 1000 కోట్ల డోసులు ఉంటుంది. అందులో జి-7 ఇస్తున్నది 10 శాతమే అవుతుంది.
ఈ సంపన్న దేశాలు గణనీయమైన మోతాదులో వ్యాక్సిన్‌ స్టాకులను కొని తమ వద్ద నిల్వ చేసుకున్నాయి. ఉదాహరణకు బ్రిటన్‌ ను తీసుకోండి. ఆ దేశ జనాభా 6 కోట్ల 80 లక్షలు. కాని ఆ దేశం 50 కోట్ల డోసులను కొని నిల్వ చేసుకుంది. అక్కడి ప్రజలందరికీ కావలసినది 13 కోట్ల 60 లక్షల డోసులు మాత్రమే. తక్కిన 36 కోట్ల 40 లక్షల డోసులు అదనంగా నిల్వ చేసుకుంది. అందులోంచి ఇప్పుడు విరాళంగా ప్రకటించినది కేవలం 10 కోట్ల డోసులు. తమ నిల్వల్లో అది కేవలం 27 శాతం అవుతుంది. ఇంకా 73 శాతం నిలవ ఉంచుకుంటున్నది దేనికోసమో అర్ధం కావడంలేదు. పోనీ, ఈ కరోనా మహమ్మారి ఇంకా మళ్ళీ, మళ్ళీ వస్తుందని అనుకుంటున్నాం కాబట్టి (ఇవే వ్యాక్సిన్‌ లు తరువాయి విడతలలో కూడా ఇదే సామర్ధ్యంతో వ్యాధి నిరోధానికి తోడ్పడతాయని అనుకున్నా), మళ్ళీ ఆ దేశ జనాభా అంతటికీ మరో రెండేసి డోసులు వ్యాక్సిన్‌ లు వేయడానికి ఇంకో 13 కోట్ల 60 లక్షల డోసులు నిల్వ ఉంచుకుంటే చాలు. కాని ఆ దేశం దగ్గర తమ జనాభాకి మరో మూడు సార్లు వ్యాక్సిన్‌ వేయడానికి సరిపడా నిల్వలు ఉన్నాయి. అమెరికా, ఇతర జి-7 దేశాలలో పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది.
   ఇప్పుడు విరాళంగా ప్రకటించిన వ్యాక్సిన్‌లు ఒకే విడతలో ఇవ్వబోవడం లేదు. వచ్చే ఏడాది జూన్‌-జూలై వరకూ తడవ తడవలుగా ఇవ్వనున్నారు. ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాల ప్రజలు ఇప్పుడు చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఈ రెండో విడత కోవిడ్‌ తాకిడిని ఎదుర్కొంటున్నారు. వీరికి జి-7 దేశాలిచ్చే వ్యాక్సిన్‌ లు ఒక్కసారే అన్నీ వచ్చి ఆదుకునే సరిస్థితి లేదు. ఆ వ్యాక్సిన్‌ లు అన్నీ వచ్చేలోపు మరెన్నో పదుల లక్షల ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.
   మొత్తం ప్రపంచ అవసరాలతో పోల్చితే జి-7 దేశాలు ఇచ్చే వ్యాక్సిన్‌ విరాళం తక్కువే కావొచ్చు కాని, వాటి విలువ డబ్బు రూపంలో లెక్క వేస్తే చాలా ఎక్కువ ఉంటుంది అనేవారున్నారు. అదీ చూద్దాం. వ్యాక్సిన్‌ ల ధరలలో చాలా హెచ్చు, తగ్గులున్నాయి. ఏయే వ్యాక్సిన్‌ లను జి-7 దేశాలు ఇవ్వనున్నాయో ఇంకా వివరాలు తెలియవు. కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను ఒక డోసు 3 డాలర్ల చొప్పున యూరోపియన్‌ యూనియన్‌ కొంటున్నది. అమెరికా ఇవ్వనున్న ఫైజర్‌ వ్యాక్సిన్‌ ఖరీదు ఎక్కువ. ఒక డోసుకు 20 డాలర్ల రేటు అనుకుంటే అప్పుడు అమెరికా చేసే సహాయం ధన రూపంలో 1000 కోట్ల డాలర్లు అవుతుంది. ఇది అమెరికా జిడిపి లో కేవలం 0.05 శాతం మాత్రమే. అందుచేత ధన రూపంలో లెక్క వేసినా జి-7 దేశాలు హీనమైన ముష్టి వేశాయనే అనుకోవాలి.
    ఈ సమావేశాల్లో జి-7 దేశాలు వ్యాక్సిన్‌ పేటెంట్లపై ఉన్న నిబంధనలను తాత్కాలికంగా తొలగించాలన్న డిమాండుపై చర్చ జరపలేదన్న విషయం మరుగున పడింది. వారందించనున్న సహాయం విషయంలో ఆ దేశాలపై కురుస్తున్న ప్రశంసల జల్లు ఈ వాస్తవాన్ని వెలుగు లోకి రానివ్వకుండా అడ్డుపడుతోంది. పేటెంటు నిబంధనలను సడలించేందుకు ఆ సమావేశాలలో నిర్ణయించి వుంటే దాని వలన జరిగే ఉపకారం ఈ 100 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ విరాళం కన్నా ఎంతో ఎక్కువగా ఉండేది.
   తక్కిన దేశాలను పక్కన పెట్టినా, ఈ సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిన బ్రిటన్‌ దేశమైనా పేటెంటు నిబంధనల సడలింపుకు అంగీకరించలేదు. సార్వత్రిక వ్యాక్సినేషన్‌ గురించి అందరికన్నా ఎక్కువ గట్టిగా మాట్లాడుతున్నది ఆ దేశ ప్రధానే. కాని పేటెంటు నిబంధనలను సడలించేందుకు మాత్రం వ్యతిరేకంగా వున్నారంటే ఆ ప్రభుత్వం బూర్జువా వర్గ ప్రయోజనాల కోసం ఎంత తాపత్రయ పడుతోందో అర్ధం అవుతున్నది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ ల కొరత ఎంత ఎక్కువ కాలంపాటు కొనసాగితే అంత ఎక్కువ లాభాలు పెట్టుబడిదారులకు చేకూరుతాయి.
ఉదాహరణకు మోడర్నా వ్యవహారమే చూడండి. కోవిడ్‌ వ్యాక్సిన్‌ ను పరిశోధించి ఉత్పత్తి విధానం కనుగొనడానికి అమెరికన్‌ ప్రభుత్వం ఆ సంస్థకు 600 కోట్ల డాలర్లు చెల్లించింది. ప్రతిఫలంగా మోడర్నా అమెరికన్‌ ప్రభుత్వానికి ఒక్కో డోసునూ 15 డాలర్లకు అమ్మింది (ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ కేవలం 3 నుండి 4 డాలర్లకే వస్తుంది. అదే ఫైజర్‌ అయితే 19.5 డాలర్లు). నామమాత్రపు లాభం కలుపుకుని ఒక్కో డోసుకూ మోడర్నా 15 డాలర్లు నిర్ణయించిందని వాదన కోసం ఒప్పుకుందాం. ఇప్పుడు మోడర్నా సంస్థ సిఇవో స్టీఫాన్‌ బాన్సెల్‌ ఇతర దేశాలకు తన వ్యాక్సిన్‌ అమ్మాలంటే 'న్యాయమైన ధర' 25 నుండి 37 డాలర్ల మధ్య ఇవ్వాల్సిందే అంటున్నాడు. అమెరికన్‌ ప్రభుత్వానికి ఇచ్చినట్టే 15 డాలర్ల రేటుకి ఇవ్వడానికి సిద్ధంగా లేడు. వ్యాక్సిన్‌ పరిశోధనకు అమెరికన్‌ ప్రభుత్వం పెట్టుబడి పెట్టినప్పుడు దానిని కూడా మోడర్నా సంస్థ తన ఖర్చులో భాగంగా చూపించి లాభాలు పిండుకోవాలనుకోవడం ఎంతవరకూ సమర్ధనీయం?
   ఇటువంటి లాభాల వేటలో కార్పొరేట్‌ సంస్థలు ఉన్నాయి గనుకనే మోడర్నా సంస్థ షేరు విలువ గత ఏడాది మార్చి నుండి ఈ ఏడాది ఏప్రిల్‌ మధ్యలో అమాంతం 6 రెట్లు పెరిగిపోయింది. ఆ సంస్థ సిఇవో ఆస్థులు 550 కోట్ల డాలర్ల మేరకు పెరిగాయి. ఒక్క మోడర్నా యే కాదు, వ్యాక్సిన్‌ తయారీలో ఉన్న ఇతర కార్పొరేట్లూ ఇదే విధంగా లాభాలు పిండుతున్నాయి. వ్యాక్సిన్‌ ల కొరత ఉన్నంత వరకే వాటికి ఆ లాభాలు వస్తాయి.
వ్యాక్సిన్‌ ల తయారీపై పేటెంటు నిబంధనల సడలింపుకు అనుమతిస్తే మొత్తం పేద, మధ్య తరహా దేశాలలోని ప్రజలందరికీ వ్యాక్సిన్‌ అందించడానికి 650 కోట్ల డాలర్లు సరిపోతాయని, అదే నిబంధనలను సడలించకపోతే 8000 కోట్ల డాలర్లు అవసరం అవుతాయని ఆక్స్‌ఫామ్‌ లెక్క వేసింది. అంటే పేటెంటు నిబంధనలను అడ్డం పెట్టుకుని కార్పొరేట్‌ సంస్థలు ఏకంగా 7400 కోట్ల డాలర్ల దోపిడీ చేస్తాయన్నమాట! ఇంకో విధంగా చెప్పాలంటే ప్రజానీకానికి వ్యాక్సిన్‌ అందించడానికి అయ్యే ఖర్చులో 90 శాతం పేటెంటు హక్కులున్న కార్పొరేట్‌ కంపెనీలకే సమర్పించుకోవాలి.
    అటువంటి దోపిడీ హక్కును పరిరక్షించడానికే బూర్జువా ప్రభుత్వాలన్నీ కంకణం కట్టుకున్నాయి. కొన్ని ప్రభుత్వాలు డబ్ల్యుటివో లో వ్యాక్సిన్‌ లపై ఒప్పందం కుదిరేదాకా పేటెంటు నిబంధనలను సడలించవచ్చునని అంటున్నాయి. మరికొన్ని ప్రభుత్వాలు అసలు ఏ సడలింపునైనా సరే కూడదని వ్యతిరేకిస్తున్నాయి. ఈ రెండు వైఖరులలో ఏదో ఒకటి నిర్ణయించడానికి జి-7 దేశాల సమావేశం ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు. తాత్కాలిక సడలింపు ఉండాలంటున్న అమెరికా, ఫ్రాన్స్‌ దేశాలు కూడా ఈ విషయంలో మొండిగా ఉన్న తక్కిన జి-7 దేశాల మిత్రులను ఒప్పించే ప్రయత్నం ఏదీ చేయలేదు.
    పేటెంటు నిబంధనలను సడలించాల్సింది కేవలం వ్యాక్సిన్‌ ల ధరలను తగ్గించడం కోసం మాత్రమే కాదు. వ్యాక్సిన్‌ ల ఉత్పత్తిని పెంచడం కోసం కూడా. కాని ఆ దిశగా ఎటువంటి ప్రయత్నాలూ సాగడం లేదు. ''ఒక ఒప్పందం కుదుర్చుకునే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టడానికి'', ''ఈ విషయాన్ని అత్యవసరంగా చర్చించడానికి'' మాత్రమే జూన్‌ 9న జరిగిన డబ్ల్యుటివో సమావేశంలో అంగీకారం కుదిరింది.
 

(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్‌ పట్నాయక్‌

ప్రభాత్‌ పట్నాయక్‌