ప్రజాశక్తి-విశాఖపట్నం : విశాఖలో ఈ నెల 27, 28 తేదీల్లో జి-20 సదస్సుకు అన్ని ఏర్పాట్లు పూర్తిఅయ్యాయని జిల్లా కలక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున తెలిపారు. సోమవారం ఆయన జివిఎంసి కమిషనర్ పి రాజాబాబు, పోలీసు కమిషనర్ శ్రీకాంత్‌తో కలసి విశాఖ ఎయిర్ పోర్టు నుంచి ఎన్‌ఎడి, మురళీనగర్, 24ఞ7 తాగు నీరు ప్రాజెక్టు, తాటిచెట్లపాలెం, తెలుగుతల్లి ఫ్లై-ఓవర్, సిరిపురం, ఎయు బస్ స్టాప్, స్మార్ట్ సిటీ ఉడా పార్కు, సీతకొండ వ్యూ పాయింట్, గుడ్లవానిపాలెం, సాగర్ నగర్, ర్యాడిసన్ బ్లూ హోటల్ వరకు పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, నగరానికి విచ్చేయుచున్న దేశవిదేశీయుల ప్రతినిధులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, వచ్చిన అతిథులకు లైజనింగ్ అఫీసర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. వారు ప్రయాణించే మార్గంలో సుందరీకరణ పనులు, రోడ్లు, విద్యుత్‌ను జివిఎంసి కమిషనర్ ఏర్పాటుచేసినట్లు వెల్లడించారు. భద్రతా ఏర్పాట్లను పోలీసు కమిషనర్ పూర్తి స్థాయిలో సమీక్షిస్తునారని తెలిపారు.
జివిఎంసి కమిషనర్ మాట్లాడుతూ, అతిధులకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. పోలీసు కమిషనర్ మాట్లాడుతూ, నగరానికి వచ్చే అతిథులకు 2500 మంది పోలీసులతో భద్రత ఏర్పాటుచేశామని తెలిపారు.










