ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : విశాఖ వేదికగా ఈ నెల 28, 29, 30 తేదీలలో నిర్వహించనున్న జి-20 సదస్సుకు అవసరమైన ఏర్పాట్లు పక్కాగా చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున అధికారులను ఆదేశించారు. సదస్సుకు వచ్చే అతిథులకు కూడా ఏర్పాట్లు పక్కాగా ఉండాలన్నారు. విఎంఆర్‌డిఎ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వివిధ దేశాలకు చెందిన అతిథులు రాక సందర్భంగా విమానాశ్రయంలో స్వాగతం పలికేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. రోజు వారి కార్యక్రమాలు, వారి పర్యటనకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో అవసరమైన ఏర్పాట్లకు తగు చర్యలు చేపట్టాలన్నారు. వారు బస చేసే హోటల్ వద్ద 24/7 హెల్ప్‌డెస్క్ ఏర్పాటుచేయాలని, ఈ హెల్ప్ డెస్క్‌లో రెవెన్యూ, జివిఎంసి, మెడికల్, పర్యాటక శాఖలకు సంబంధించి సిబ్బంది 3 షిఫ్టులుగా పనిచేసేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. విమానాశ్రయంలోనూ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసేలా తగు చర్యలు చేపట్టాలన్నారు. జివిఎంసిలో కంట్రోల్ రూం నిరంతరం పనిచేయాలన్నారు. నగర సుందరీకరణ పనులుపై జివిఎంసి కమిషనర్‌ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక స్పెషల్ శానిటైజేషన్ డ్రైవ్ నిర్వహించాలని కమిషనర్‌కు సూచించారు. కేంద్ర మంత్రులు రాక సందర్భంగా వారికి బస, లైజన్ ఆఫీసర్లు, ఎస్కార్ట్, వాహనాలు, తదితర ఏర్పాట్లు చూడాలని డిఆర్‌ఒని ఆదేశించారు. ఈ సదస్సుకు వచ్చే రాష్ట్ర మంత్రులు, కార్యదర్శులు, ఇతర రాష్ట్ర స్థాయి అధికారులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ నెల 27వ తేదీన 80 మంది ఫారన్ డెలిగేట్స్ విశాఖ రానున్నట్లు తెలిపారు. 28వ తేదీ రాత్రికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రానున్నారని చెప్పారు. అధికారులందరూ వారికి కేటాయించిన విధులను బాధ్యతగా నిర్వహించి జి-20 సదస్సును విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ కెఎస్. విశ్వనాధన్, జివిఎంసి కమిషనర్ పి.రాజాబాబు, డిఆర్‌ఒ శ్రీనివాసమూర్తి, పలువురు అధికారులుపాల్గొన్నారు.
ఏర్పాట్లపై మేయర్ సమీక్ష
జి-20 సదస్సు ఏర్పాట్లపై మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అధికారులనడిగి తెలుసుకున్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఆమె చాంబర్లో మంగళవారం ప్రధాన ఇంజినీరు రవికృష్ణరాజు, చీఫ్ సిటీ ప్లానర్ సురేష్, అదనపు కమిషనర్లు వర్మ, డాక్టర్ బి సన్యాసిరావు, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ దామోదర్‌తో సమావేశమై జి - 20 ఏర్పాట్లపై ఆరాతీశారు. ఈ సదస్సుకు దేశ విదేశాల నుంచి సుమారు 200 మంది అతిథులు వస్తున్నందున వారికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.










