గత వారాంతంలో రోమ్‌లో రెండు రోజుల పాటు జరిగిన జిా20 సదస్సు ప్రహసనంగా మారింది. జి-7 కూటమికి కొనసాగింపులా ఉంది తప్ప ఇందులో కొత్తదనమేమీ కనిపించడంలేదు. అగ్రరాజ్యం బలహీనపడుతోందన్న సంకేతాలు వెలువడుతున్న తరుణంలో 'అమెరికా మళ్లీ వస్తోంది' అని చాటుకోవడంపైనే బైడెన్ ఎక్కువ దృష్టి పెట్టారు. నాలుగు మాసాల క్రితం జి-7, బ్రిటన్, ఇ.యు, రష్యా నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తూ హడావుడి చేసిన అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు రోమ్ లోను అటువంటి పటాటోపాన్నే ప్రదర్శించారు. కానీ, జి-20లో అమెరికా స్థానమేమిటో గ్రూప్ ఫోటోలో కుడివైపు ఒక మూలకు బైడెన్ నిలబడి ఉన్న చిత్రమే చెబుతోంది. కోవిడ్ మహమ్మారి నుంచి మానవాళిని కాపాడేందుకు వ్యాక్సిన్ల పంపిణీలో అసమానతల తొలగింపు, వాతావరణ మార్పులకు కారణమైన కర్బన ఉద్గారాల తగ్గింపు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి, సుస్థిరతకు సంబంధించి జి-20 దేశాల తుది ప్రకటన నిస్సారంగా ఉంది. కోవిడ్ వ్యాక్సిన్లపై పేటెంట్ ఎత్తివేయాలన్న డిమాండ్‌ను రోమ్‌లో పలు దేశాలు లేవనెత్తగా బ్రిటన్, జర్మనీ దానిని అడ్డుకున్నాయి. కోవిడ్ మహమ్మారి ఇప్పటికే 50 లక్షల మందిని బలిగొంది. వేలాది మంది పిల్లలను అనాథలుగా మార్చింది. ఉపాధి కరువై కోట్లాది మంది వలసబాట పట్టారు.ఈ స్థితిలో వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి తేవడానికి ప్రయత్నించాల్సిన జిా20 ఆ బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమైంది. ప్రపంచ జనాభాలో 62 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న జి-20 దేశాలు ప్రపంచంలో ఉత్పత్తి అయిన మొత్తం వ్యాక్సిన్లలో 82 శాతం తమ వద్దే అట్టిపెట్టుకున్నాయి. ఫలితంగా అల్పాదాయ దేశాల్లో 3.1 శాతం మంది ప్రజానీకానికి ఒక డోసు టీకా దొరకడమే గగనంగా మారింది. వ్యాక్సిన్ల పంపిణీలో అసమానతలకు స్వస్తి పలకాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) చేసిన విజ్ఞప్తిని సైతం అవి బేఖాతరు చేశాయి. వ్యాక్సిన్లపై గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టేందుకు పేటెంట్లను రద్దు చేయాలని ప్రపంచ వ్యాపితంగా వచ్చిన డిమాండ్‌ను కూడా పక్కన పెట్టాయి. వ్యాక్సిన్లపై పేటెంట్‌ను అడ్డుకోవడమంటే ప్రపంచ మానవాళి పట్ల తీవ్ర నేరానికి ఒడిగట్టడమే. కోవిడ్-19 లాక్‌డౌన్లు, ఆంక్షలతో మరింతగా కుదేలైన ఆర్థిక వ్యవస్థకు తిరిగి జవసత్వాలు కల్పించే నిర్దిష్ట ప్రణాళికను వెల్లడించడంలో విఫలమైంది. అంతర్జాతీయ పన్నుల వ్యవస్థ సంస్కరణలో భాగంగా కార్పొరేట్ సంస్థలపై 15 శాతం కనీస పన్ను విధించాలన్న జి-7 దేశాల ప్రతిపాదననే ఇది కూడా ఆమోదించింది. ప్రపంచ సంక్షోభాన్ని ఈ కనీస పన్ను ఏ విధంగానూ పరిష్కరించజాలదు.
వాతావరణ మార్పుల విషయంలో సంపన్న దేశాల వైఖరిలో ఇసుమంత కూడా మార్పు లేదని రోమ్‌లో తేలిపోయింది. పాత హామీలను పునరుద్ఘాటించడమే తప్ప పారిస్ ఒప్పందం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేందుకు ఎలాంటి మార్గాన్ని చూపలేకపోయింది. గ్రీన్ టెక్నాలజీ సమకూర్చుకునేందుకు, అడవులు పెంచేందుకు వర్థమాన దేశాలకు వచ్చే అయిదేళ్లలో వెయ్యి కోట్ల డాలర్ల సాయం అందిస్తామన్న వాగ్దానం ఏమేరకు అమలు జరుగుతుందన్నది సందేహమే. ఈ శతాబ్దం మధ్య నాటికి కర్బన ఉద్గారాలను జీరో స్థాయికి తేవాలని పారిస్ ఒప్పందం చెబుతోంది. ఆ ప్రకారం కర్బన ఉద్గారాలను తగ్గించుకోవడంలో పారిశ్రామిక దేశాలు మొదట బాధ్యత తీసుకోవాలి. ఆ బాధ్యత తీసుకోకుండా ఇతర దేశాలను తగ్గించుకోమని చెప్పే నైతిక అధికారం వీటికి ఎక్కడిది? ప్రపంచంలో అతి పెద్ద కాలుష్యకారి అమెరికా. కర్బన ఉద్గారాల విడుదల అమెరికాలో తలసరి 15.2 టన్నులు కాగా, చైనాలో ఇది 7.3 టన్నులు. అంటే చైనా కంటే అమెరికా విడుదలజేసే కాలుష్యం రెట్టింపన్నమాట. ఎక్కువ కాలుష్యాన్ని వెదజల్లే దేశం ఎక్కువ బాధ్యత తీసుకోవాలని పారిస్ ఒప్పందం చెబుతోంది. దీనికి అమెరికా ఎప్పుడూ నికరంగా కట్టుబడి లేదు.
గతంలో ట్రంప్ ప్రభుత్వం పారిస్ ఒప్పందం అమలుకు తిరస్కరించారు. బైడెన్ అధికారంలోకి రాగానే తిరిగి ఇందులో చేరుతున్నట్లు ప్రకటించారు. కానీ, ఒప్పందాన్ని నిజాయితీగా అమలు చేయడానికి ఇప్పటికీ అమెరికా సిద్ధంగా లేదు. బైడెన్ ఇచ్చిన కంటి తుడుపు హామీలు రేపు రిపబ్లికన్లు అధికారంలోకి వస్తే అమలు జరుపుతారన్న గ్యారంటీ లేదు. అందుకే అమెరికా నాయకత్వాన్ని ప్రపంచం అనుమానిస్తున్నది. బ్రిటన్, ఆస్ట్రేలియా తప్ప ఎవరూ అమెరికా నాయకత్వాన్ని అంగీకరించే స్థితి లేదు. కర్బన ఉద్గారాలు తగ్గించుకుని సౌర విద్యుత్, పవన విద్యుత్ వంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరులవైపు మళ్లేందుకు వర్థమాన దేశాలకు అవసరమైన గ్రీన్ టెక్నాలజీని, ఆర్థిక సహకారాన్ని అందించాల్సిన బాధ్యత సంపన్న దేశాలు తీసుకోవాల్సిందేనని బ్రెజిల్, సౌతాఫ్రికా, ఇండియా, చైనా (బేసిక్) తరపున గ్లాస్గో సదస్సు తొలి రోజున భారత పర్యావరణ మంత్రి చేసిన సూచన సముచితమైనది. ఈ డిమాండ్‌ను సిఓపి-26 తుది ప్రకటనలో ఏమేరకు ప్రతిబింబిస్తుందన్నది వేచి చూడాలి..










