Nov 16,2023 21:19

బస్సుయాత్ర సభలో మాట్లాడుతున్న వైసిపి జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు

ప్రజాశక్తి-రాజాం :   సామాజిక, ఆర్థిక సాధికారత ముఖ్యమంత్రి జగన్‌తోనే సాధ్యమని స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. వైసిపి చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర గురువారం సాయంత్రం రాజాంలో ఎమ్మెల్యే కంభాల జోగులు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా స్పీకర్‌ తమ్మినేని సీతారాం, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలునాయుడు మాట్లాడారు. ఈ సందర్భంగా సీతారాం మాట్లాడుతూ అవినీతికి తావులేకుండా సంక్షేమ పథకాలు అందించామని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను జగన్‌ గుండెల్లో పెట్టుకున్నారని అన్నారు. అధికారం కోసం కాదు ప్రజల సంక్షేమ గురించి ఆలోచించే నాయకుడు జగన్‌ అని, వెనుకబడిన వర్గాలు ఇవాళ తలెత్తుకుని బతుకుతున్నారని ఉద్ఘాటించారు. నాడు- నేడుతో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని తెలిపారు. పథకాలను అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నామని, గత ప్రభుత్వంలో అన్నీ స్కాములేనని, ఓటు వేయని వారికీ పథకాలు అందించిన ఘనత సిఎం జగన్‌దేనని పేర్కొన్నారు. చంద్రబాబు ఏనాడూ ప్రజల గురించి ఆలోచించలేదని అన్నారు.
మంత్రి బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ గత నాలుగున్నర సంవత్సరాల్లో జగనన్న ప్రభుత్వం సాధించిన సాధికారతను చెప్పేందుకే, జగనన్న సువర్ణ పరిపాలన మళ్లీ రావాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు. వైసిపిజిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి వైసిపి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వెనుకబడినవర్గాలకు గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా జగనన్న ప్రభుత్వం 50శాతం రిజర్వేషన్‌ కల్పించారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలంతా పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.