ప్రజాశక్తి - ఏలూరు టౌన్
సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రిగా వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు తెలిపారు. మాజీ డిప్యూటీ సిఎం ఏలూరు ఎంఎల్‌ఎ ఆళ్ల నాని ఆదేశాల మేరకు సోమవారం స్థానిక గోకుల్ కళ్యాణ మండపంలో ఏలూరు నియోజకవర్గంలోని 50 డివిజన్ల కార్పొరేటర్లు, సచివాలయ కన్వీనర్లతో ముఖ్య సమావేశం ఏర్పాటు చేశారు. 2014లో జరిగిన రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ ఎంతో కష్టాల్లో కూరుకు పోయిందన్నారు. టిడిపి హాయాంలో రాష్ట్రం అభివృద్ధి చెందకపోగా, మరింత దిగజారి పోయిందని విమర్శించారు. జగన్ ప్రభుత్వంలో విద్య, ఆరోగ్యం, సంక్షేమంపై అవసరమైన వ్యయం చేశారన్నారు. గ్రామ, వార్డు, సచివాలయ వ్యవస్థ ద్వారా సమాజంలో చివరి వ్యక్తి వరకు సేవలు, సంక్షేమ ఫలాలు అందిస్తున్నారన్నారు. అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, సున్నా వడ్డీ, చేయూత మొదలగు సంక్షేమ పథకాల నగదు మొత్తాన్ని మహిళల ఖాతాల్లో జమ చేస్తూ 75 శాతం మహిళా సాధికారతను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాటించారన్నారు. ఇచ్చిన హామీలు 98 శాతం నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి దక్కిందన్నారు. అందుకే మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలకు తెలియజేస్తున్నామన్నారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న అవాస్తవాలను తిప్పికొడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సేవలను, జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ, పార్టీపై తప్పుడు ప్రచారం చేసే వారిని ప్రజలే నిలదీసే విధంగా ప్రజలను చైతన్యవంతులు చేయాలని కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, సచివాలయ కన్వీనర్లకు మేయర్ నూర్జహాన్ పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి వైసిపి పట్టణ అధ్యక్షులు బొద్దాని శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా వైసిపి నాయకులు ఎస్‌ఎంఆర్ పెదబాబు, ఎంఆర్ డి.బలరాం, డిప్యూటీ మేయర్లు గుడిదేశీ శ్రీనివాసరావు, నూక పేయి సుధీర్ బాబు, రాష్ట్ర సాహిత్య అకాడమీ ఛైర్మన్ పిల్లంగోళ్లా శ్రీలక్ష్మి, ఎఎంసి మాజీ ఛైర్మన్ మంచే మహిబాబు, సచివాలయంలో జోన్ కన్వీనర్లు మొటమర్రి సదానందం, కార్పొరేటర్లు యార్రంశెట్టి సుమన్, తుమరాడ స్రవంతి, ఎఎంసి వైస్ ఛైర్మన్ కంచన రామకృష్ణ తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో 50 డివిజన్ల కార్పొరేటర్లు, ఇంఛార్జీలు, 79 సచివాలయాల కన్వీనర్లు హాజరయ్యారు.










