Oct 26,2023 23:58

ప్రజాశక్తి - పంగులూరు
ప్రజలకు ఆదర్శ వంతమైన పాలన అందిస్తానని అధికారం చేపట్టిన జగన్మోహన్‌రెడ్డి మొదటి రోజు నుండి రివర్స్ పాలన చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఎంఎల్‌ఎ గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా గురువారం ఆయన చేపట్టిన సైకిల్ యాత్ర మండలంలోని కస్యాపురం నుండి ప్రారంభమై రేణింగవరం, కొండమూరు మీదుగా జనకవరం చేరింది. 10కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేశారు. జనకవరంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ గత నాలుగున్నర సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజలు సైకో పాలనను అనుభవిస్తున్నారని అన్నారు. మరి కొద్ది రోజుల్లో సైకో పాలనను అంతమొందించి టిడిపి ఆధ్వర్యంలో ప్రజా పరిపాలనను తీసుకొచ్చేందుకు ప్రజలంతా ఐక్యం కావాలని కోరారు. గత 48రోజులుగా అక్రమంగా అరెస్టు కాబడి చంద్రబాబు జైల్లో ఉన్నాడని అన్నారు. చంద్రబాబు జైల్లో ఉన్నాడని కార్యకర్తలు దిగులు పడకుండా శాడిస్టుపాలనకు బుద్ది చెప్పేందుకు ముందుకు సాగాలని కోరారు. రోడ్డు లేని చోట రింగ్ రోడ్డు ఉన్నట్లు, అందులో అవినీతి జరిగినట్లు కేసు పెట్టారని అన్నారు. ఫైబర్ గ్రిడ్డు విషయంలో కూడా కేసు పెట్టారని విమర్శించారు. ప్రజల వ్యతిరేకతను తట్టుకోలేక ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు బనాయించి నాయకులను భయపెట్టాలని జగన్మోహన్‌రెడ్డి ప్రయత్నిస్తున్నాడని అన్నారు. చంద్రబాబుపై పెట్టిన కేసులో మొదట రూ.3వేల కోట్లు అవినీతి జరిగిందని, తరువాత రూ.300కోట్లు జరిగిందని, ఇప్పుడు రూ.27కోట్లు జరిగిందని దానికి కూడా ఎలాంటి ఆధారాలు చూపలేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. 2024ఎన్నికలలో గెలవలేమని నిర్ధారణకు వచ్చిన వైసీపీ నాయకులు దొంగ ఓట్లు ద్వారా గెలవాలని ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. పర్చూరు నియోజకవర్గంలో వైసిపి దొంగ ఓట్లను చేర్పించిన కేసులో నలుగురు పోలీసు అధికారులు బలయ్యారని అన్నారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా దొంగ ఓట్లు చేర్పించే వైసిపి నాయకులకు చంప పెట్టు లాంటిదని అన్నారు. ఒకవైపు అరాచకాలు, అన్యాయాలు చేస్తూ సిగ్గు లేకుండా వైసిపి బస్సుయాత్ర చేపట్టిందని అన్నారు. రాష్ట్రంలో ఏమి చేశారని బస్సు యాత్ర చేస్తున్నారని ప్రశ్నించారు. 98శాతం హామీలు నెరవేర్చామని చెప్పుకునే జగన్మోహన్‌రెడ్డి రూ.3వేలు పింఛన్ ఇస్తానని ఎన్నికల హామీ ఇచ్చి ఏడాదికి కేవలం రూ.250పెంచాడని అన్నారు. ఎస్సీ, ఎస్టీ మహిళలకు పింఛన్ ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హామీని మరిచిపోయాడని అన్నారు. విదేశీ విద్య పథకానికి తూట్లు పొడిచారని అన్నారు. దళితులకు ఉన్న పథకాల పేర్లలో అంబేద్కర్ పేరు తొలగించి తన పేరును పెట్టుకుంటున్న జగన్‌మోహన్‌రెడ్డి దళితులకు మొండి చేయి చూపిస్తున్నాడని అన్నారు. నిరుద్యోగ యువకులకు ఉపాధి చూపించడంలో జగన్‌రెడ్డి విఫలమయ్యాడని ఆరోపించారు. డిగ్రీలు చదివిన పిల్లలు బార్ షాపుల్లో పనిచేసే దౌర్భాగ్యం ఏర్పడిందని అన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు చదువు చెప్పే టీచర్లను బార్ల దగ్గర నిలబడి కాపలా కాసే పరిస్థితి జగన్‌రెడ్డి తీసుకొచ్చాడని విమర్శించారు. ఇలాంటి ప్రభుత్వాలు వస్తే మనం పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిందేనని అన్నారు. అలాంటి ప్రభుత్వాలను రాకుండా ప్రజలంతా మేల్కొనాలని కోరారు. కృష్టా డెల్టా క్రింద ఫైర్లు నీటితడి కోసం ఎదురుచూస్తున్నాయని అన్నారు. నీరు లేక ఎండిపోయే పరిస్థితికి శాడిస్ట్ ప్రభుత్వం తీసుకువచ్చిందని అన్నారు. పోలవరం పూర్తి చేయకపోవడం వలన రాష్ట్రంలో కరెంటు దొంగతనంగా తీసుకోవాల్సి వస్తుందని అన్నారు. మొదట కస్యాపురంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన తర్వాత సైకిల్ ర్యాలీ ప్రారంభించారు. తరువాత కస్యాపురం ఎస్సీ కాలనీ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేశారు. రేణింగవరంలో అంబేద్కర్, జగజీవన్‌రామ్‌ విగ్రహాలకు, కొండమూరు, జనకవరంలో ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలువేశారు. దారి పొడుగునా సైకో పోవాలి - సైకిల్ రావాలి, సీఎం డౌన్ డౌన్, తెలుగుదేశం జిందాబాద్, గొట్టిపాటి నాయకత్వం వర్ధిల్లాలి, జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు రావూరి రమేష్, మాజీ జడ్పిటిసి కరి వెంకట సుబ్బారావు, మాజీ డైరీ చైర్మన్ బాలిన రామ సుబ్బారావు, టిడిపి మాజీ అధ్యక్షులు కుక్కపల్లి ఏడుకొండలు, గుర్రం ఆదిశేకర్, కస్యాపురం అధ్యక్షులు దూళిపాళ్ల రాజేష్, కోటేశ్వరరావు, ప్రసన్నాంజనేయులు, కూకట్ల రామంజి, దూళిపాళ్ల వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచులు అమర్తపూడి ఏసోబు, ఉన్నం రవి, గరిమిడి జగన్మోహన్రావు, బొప్పూడి నాగేశ్వరరావు, వలపర్ల సుబ్బారావు, తెలగతోటి రాధాకృష్ణమూర్తి, ఆదిరెడ్డి, పచ్చవ శ్రీనివాసరావు, శివరాజు, కాటా అంజయ్య, రామకూరు ఉపసర్పంచ్ పెడవల్లి అశోక్, మానం రమేష్ పాల్గొన్నారు.