ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్ రాష్ట్రంలో వైఎస్.జగన్ నేతృత్వంలోని దుర్మార్గమైన వైసిపి పాలనను సాగనంపేందుకు ప్రజలను చైతన్యం కల్పించి సమిష్టిగా పని చేద్దామని టిడిపి, జనసేన పార్టీ సమన్వయ కమిటీ నాయకులు కాలవ శ్రీనివాసులు, చిల్లపల్లి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని కమ్మభవన్‌లో టిడిపి, జనసేన పార్టీల సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ జగన్ అరాచక పాలనను ఎండగట్టేందుకు ఐక్య పోరాటాలు చేస్తున్నట్లు తెలిపారు. అందుకోసమే టిడిపి, జనసేన పార్టీలు అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో నాయకులు, కార్యకర్తలు సమన్వయంగా పని చేసేలా తీర్మాణాలు చేశామన్నారు. నవంబర్ 1వ తేదీ నుంచి భవిష్యత్‌కు గ్యారంటీ పేరుతో టిడిపి, జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వంలో ప్రజలకు ఒనూగూరే మేళ్ల గురించి తెలియజేప్పేలా ఉమ్మడి కార్యచరణ ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యంగం వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. పంటలు ఎండినా ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకు స్పందన లేదన్నారు. రైతులను గాలికి ఒదిలేసిందన్నారు. అందుకోసం రైతులకు మద్దతుగా క్షేత్రస్థాయిలో రాష్ట్ర ప్రతినిధి బృందాలు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నట్లు తెలిపారు. నవంబర్ 4న గుంటూరు, 5న కర్నూలు, 6న అనంతపురం, 7న శ్రీసత్యసాయి జిల్లాలో పర్యటనలు చేయనున్నట్లు తెలిపారు. వీటిలో జనసేన, టిడిపి నాయకులు భాగస్వాములు కావాలని కోరారు. నిత్యావసర ధరలు, విద్యుత్ కోతలు, మద్య నిషేదం పేరుతో చేసిన మోసాలు, రాయలసీమకు ద్రోహం చేసే కృష్ణ జలాలు కేటాయింపులపై, వైసిపి దుర్మార్గపు పాలనపై పోరాటాలు చేయనున్నట్లు తెలిపారు. జనసేన నాయకులు చిల్లపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం టిడిపి, జనసేన పార్టీల కూటమి ఏర్పడిందన్నారు. ముఖ్యంగా టిడిపి కంచుకోటగా ఉమ్మడి అనంతపురం జిల్లా నిలిచిందన్నారు. రాబోవు ఎన్నికల్లో జనసేన, టిడిపి కూటమి జిల్లాగా ఎమ్మెల్యే, ఎంపీలను గెలిపించేలా ప్రజల మద్దతు కూడగడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి హిందూపురం పార్లమెంట్ అధ్యక్షులు బికె.పార్థసారథి, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, మాజీమంత్రి పరిటాల సునీత, మాజీ ఎమ్మెల్యేలు వైకుంఠం ఫ్రభాకర్‌చౌదరి, ఉన్నం హనుమంతరాయచౌదరి, జితేంద్రగౌడ్, ఈరన్న, టిడిపి యువనాయకులు పరిటాల శ్రీరామ్, ఉమా మహేశ్వరనాయుడు, టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీదర్ చౌదరి, టిడిపి జిల్లా ప్రచార కార్యదర్శి వెంకటరాముడు, సవితమ్మ, ద్విసభ్య కమిటి సభ్యులు ముంటి మడుగు కేశవరెడ్డి, ఆలం నరసానాయుడు, ఆదేన్న, ఆదికేశవ నాయుడు, జనసేన జిల్లా అధ్యక్షుడు టిసి.వరుణ్, జిల్లా ప్రధాన కార్యదర్శి చిలకం మధూసూదన్‌రెడ్డి, కార్యనిర్వాహణ కార్యదర్శి భవానీ రవికుమార్, రాయలసీమ మహిళా విభాగం నాయకురాలు పెండ్యాల శ్రీలత, జిల్లా ఉపాధ్యక్షుడు అంకే ఈశ్వరయ్య, నగర అధ్యక్షుడు పొదిలి బాబురావు, తదితరులు పాల్గొన్నారు.
టిడిపి, జనసేన పార్టీల సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న నాయకులు










