May 19,2023 22:59

సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి తోట నరసింహం



-మాజీ మంత్రి తోట నరసింహం
ప్రజాశక్తి - గండేపల్లి
మాజీ ముఖ్యమంత్రి కీ.శే. వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి తనయుడు యువ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆశీర్వదిస్తే జగ్గంపేట నుండే పోటీ చేసేందుకు తాను సిద్ధమని మాజీ మంత్రి తోట నరసింహం స్పష్టం చేశారు. శుక్రవారం గండేపల్లి మండలం ఉప్పలపాడులో రామకుర్తి మూర్తి స్వగృహంలో నరసింహం తనయుడు రాంజీ ఈ నెల 26వ తేదీ వివాహ వేడుకకు ఆహ్వానించేందుకు ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నరసింహ మాట్లా డుతూ జగ్గంపేట నియోజకవర్గంలో ఎంఎల్‌ఎగా మంత్రిగా, ఎంపిగా కోట్లతో అభివృద్ధి చేశామని, నియోజకవర్గ ప్రజలు తనపై ఎన్నడూ ఆదరాభిమానాలు చూపిస్తూనే ఉన్నారన్నారు. తాను అనారోగ్యం కారణంగా కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నా తనను స్వయంగా కలిసి నియోజకవర్గ విషయాలు ఎప్పటికప్పుడు ప్రస్తావించేవారని తెలిపారు. తాను ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని త్వరలోనే నియోజకవర్గ ప్రజలందరినీ గ్రామ గ్రామాన కలుస్తానని తెలిపారు. తన తనయుడు వివాహానికి ప్రతి ఒక్కరూ హాజరై ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో ఓబిణ్ణి సత్యనారాయణ పరిమి వెంకటేశ్వర రావు, తోట అయ్యన్న, తొండాపు రమణారెడ్డి, రఘురామ్‌ రెడ్డి, తారకం ,జగాలు, శ్రీను, మండలంలోని నరసింహ అభిమానులు పాల్గొన్నారు.