- రేచర్లపేటలో జగనన్న ఆరోగ్య సురక్ష
- పాల్గొన్న ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కమిషనర్ నాగ నరసింహారావు తదితరులు
ప్రజాశక్తి-కాకినాడ : ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక రేచర్లపేట లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో శుక్రవారం జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు డివిజన్లకు సంబంధించి సుమారు 25 వేల కుటుంబాలను ఏఎన్ఎంలు,ఇతర ఆరోగ్య సిబ్బంది స్వయంగా కలిసి ఆరోగ్య సమస్యలపై సర్వే చేశారన్నారు. బిపి, షుగర్, మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధి లక్షణాలపై గుర్తించి ఆరోగ్య సురక్ష శిబిరంలో వైద్య సేవలు అందించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందిస్తున్నామన్నారు. కంటి వైద్య పరీక్షలు కూడా నిర్వహించి ఉచితంగా కళ్ళజోళ్ళు ఇస్తున్నట్లు చెప్పారు. పేద ప్రజలకు ఆరోగ్య సమస్య ఎదురైనప్పుడు వైద్యం కోసం ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చారన్నారు. వైద్యరంగంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన పాలనా సంస్కరణలు వైద్యాన్ని ప్రజలకు మరింత చేరువచేశాయన్నారు. ఆరోగ్యశ్రీని పటిష్టవంతం చేయడం, కొత్త మెడికల్ కళాశాల ఏర్పాటు, పోస్టుల భర్తీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధి వంటి చర్యలే ఇందుకు నిదర్శనమన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు మాట్లాడుతూ కాకినాడ కార్పొరేషన్ పరిధిలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహిస్తామన్నారు. ఇళ్లకు వచ్చే వైద్య సిబ్బందికి ప్రజలు సహకరించి, ఆరోగ్య సమస్యలు ఉంటే తెలియజేయాలని సూచించారు. గుర్తించిన సమస్యలకు నిపుణులైన వైద్య సిబ్బందితో చికిత్సలు అందిస్తామన్నారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు కూడా అందిస్తున్నామని కమిషనర్ చెప్పారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కౌడా మాజీ చైర్ పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, ఏఎంసీ చైర్ పర్సన్ పసుపులేటి వెంకటలక్ష్మి, ఎం హెచ్ ఓ డాక్టర్ పృథ్వి చరణ్, మాజీ కార్పొరేటర్లు నల్లబిల్లి సుజాత, రోకళ్ళ సత్యనారాయణ, శిగల మధు, కర్రి శైలజ,పోలిశెట్టి పద్మావతి, బండి సత్యనారాయణ, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్లు బోరా వెంకటేశ్వరరావు, కొంతం శ్రీనివాసరావు, స్థానిక నాయకులు తొంపల తాతారావు, నందకుమార్, బత్తిన రాజు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










