Oct 18,2023 20:36

మాట్లాడుతున్న ఎంపి బెల్లాన చంద్రశేఖర్‌

ప్రజాశక్తి - రామభద్రపురం : ఎపికి మళ్లీ జగన్మోహన్‌రెడ్డిని సిఎంను చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఎంపి బెల్లాన చంద్రశేఖర్‌, ఎమ్మెల్యే శంబంగి వెంకటచినప్పలనాయుడు కోరారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయ ఆవరణలో మండల పార్టీ అధ్యక్షులు అప్పి కొండ లక్షుంనాయుడు, ఎంపిపి చొక్కాపు లక్ష్మణరావుల ఆధ్వర్యంలో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో వివక్షతకు తావులేకుండా ప్రతీ ఇంటికి సంక్షేమ పథకాలు అందజేస్తున్న ఘనత వైసిపి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. గత టిడిపి పాలనలో జన్మభూమి కమిటీలు, ఆ పార్టీ నాయకులు అనర్హులకు సంక్షేమ పథకాలు అందించి కమిషన్లు మూట గట్టుకొని స్వయం లబ్ధి పొందే వారని విమర్శించారు. సుదీర్ఘ పాదయాత్రలో జగనన్న అన్ని వర్గాల ఇబ్బందులు గుర్తించి అధికారంలోకి వచ్చిన తరువాత వివక్ష లేకుండా లంచం, కమిషన్‌ అనే ప్రసక్తే లేకుండా సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాల్లోకి వేస్తున్నారన్నారు. పార్టీ అధిష్టాన వర్గాల అభిప్రాయం మేరకు 'ఎపికి జగన్‌' ఎందుకు కావాలంటే? కార్యక్రమంలో భాగంగా సచివాలయ కన్వీనర్లు, గృహసారధులు, వాలంటీర్లు, ప్రతీ ఇంటికి వెళ్లి ప్రభుత్వం పార్టీలకు అతీతంగా అర్హులైన వారికి అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధిని వివరించాలని సూచించారు. ఓటర్లందరికీ ప్రభుత్వం చేస్తున్న మంచిని వివరించి ఫ్యాన్‌ గుర్తుకు మరలా ఓట్లు వేసి జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలనే ధృడ సంకల్పంతో మార్పు చెందేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి చొక్కాపు లక్ష్మణరావు, జెడ్‌పిటిసి అప్పికొండ సరస్వతి, వైస్‌ ఎంపిపి బెల్లాన ప్రసాద్‌, బ్రాహ్మణ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ రాయలు, పిఎసిఎస్‌ అధ్యక్షుడు కిర్ల చంద్రశేఖర్‌, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, వైసిపి నాయకులు, సచివాలయ కన్వీనర్లు, గృహసారధులు పాల్గొన్నారు.