
ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ
ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం టౌన్
జగనన్నతోనే సంక్షే మం, అభివృద్ధి సాధ్యమని, 2024 ఎన్నికల్లో కూడా వైసిపి విజయం సాధించి జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి అయితే సంక్షేమం ఇలాగే కొనసాగుతుందని ప్రజలకు చాటి చెప్పాలని జగనన్న సచివాలయ కన్వీనర్లు (జెసిఎస్)కు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ పిలుపునిచ్చారు. పట్టణంలోని వైసిపి కార్యాలయంలో శుక్రవారం జరిగిన జెసిఎస్ శిక్షణా శిబిరంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి కొట్టు మాట్లాడుతూ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవసరం ఏంటనేది ప్రజలకు వివరించి చెప్పాలన్నారు. సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు ఇంటింటికీ వెళ్లి చాటిచెప్పాలన్నారు. చంద్రబాబు అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు దోచుకున్నాడని విమర్శించారు. చంద్రబాబుకు అధికారం దోచుకోవడానికి తప్ప ప్రజలకు సేవ చేయడానికి కాదన్నారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం వాలంటీరు, సచివాలయ వ్యవస్థలతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరు దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమం వినూత్న కార్యక్రమమన్నారు. మన కుటుంబాల్లో పిల్లలైన వాలంటీర్లను దండుపాళ్యం బ్యాచ్ అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను మంత్రి కొట్టు తీవ్రంగా ఖండించారు. పవన్ అసలు మనిషేనా విమర్శించారు. అసలు ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో కూడా తెలియని అజ్ఞాని పవన్ అన్నారు. ప్రతి కుటుంబంలోనూ సంతోషాన్ని నింపుతున్న సంక్షేమ పథకాలను రద్దు చేస్తానని, వాలంటీర్ వ్యవస్థను తీసివేస్తామని, సచివాలయం ఉద్యోగులను తొలగిస్తామని పవన్ కళ్యాణ్ చెప్పడం అతనిలోని అవివేకానికి నిదర్శనమన్నారు. సచివాలయ కన్వీనర్లకు, గృహ సారధులకు పార్టీ బీమా సదుపాయం కల్పిస్తుందన్నారు. ఈ నెల 18 నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకూ బీమా కోసం గృహసారథుల నమోదు జరగాలని డిప్యూటీ సిఎం కొట్టు సత్యనారాయణ సూచించారు. ఈ కార్యక్రమంలో మండల గ్రామ సచివాలయాల కన్వీనర్ ముప్పిడి సంపత్ కుమార్, పట్టణ వన్‌టౌన్ వార్డు సచివాలయాల కన్వీనర్ కొలుకులూరి ధర్మరాజు, టూటౌన్ వార్డు సచివాలయాల కన్వీనర్ కర్రి భాస్కరరావు, పెంటపాడు మండలం గ్రామ సచివాలయాల కన్వీనర్ మైలవరపు పెదబాబు పాల్గొన్నారు.