Oct 27,2023 23:02

గడప గడపకూ కార్యక్రమంలో బుక్‌లెట్లను అందజేస్తున్న మంత్రి ఆదిమూలపు సురేష్‌


ప్రజాశక్తి-యర్రగొండపాలెం
జగనన్నతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, పేదవారి జీవితాల్లో వెలుగు నింపి వారి తలరాతను మార్చాలన్నదే సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి లక్ష్యమని రాష్ట్ర పురపాలక, పట్టణాభివద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. యర్రగొండపాలెం పట్టణంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ఐదేళ్ల కాలంలో ఎంతెంత లబ్ధి పొందారో వివరాలతో కూడిన బుక్లెట్‌ను లబ్ధిదారులకు అందించారు. స్థానికులు పలు సమస్యలను మంత్రి దష్టికి తీసుకొచ్చారు. ఆయా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సంధర్భంగా మంత్రి సురేష్‌ మాట్లాడుతూ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా అత్యంత పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే ప్రతిపక్షాల కడుపు ఎందుకు మండిపోతోందో అర్థం కావడం లేదని విమర్శించారు. ప్రజా శ్రేయస్సు ధ్యేయంగా జగనన్న పాలన సాగిస్తున్నారని వివరించారు. వచ్చే ఎన్నికల్లో సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని ఆదరించి మరోసారి సీఎం చేసుకుంటే మరెన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అదుకుంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు ఒంగోలు మూర్తిరెడ్డి, ఎంపిపి దొంతా కిరణ్‌ గౌడ్‌, జడ్పిటిసి చేదూరి విజయభాస్కర్‌, జడ్పి కో ఆప్షన్‌ సభ్యుడు సయ్యద్‌ షాబీర్‌ బాషా, వైసీపీ మండల కన్వీనర్‌ కొప్పర్తి ఓబుల్‌రెడ్డి, సర్పంచ్‌ రామావత్‌ అరుణాబాయి, వైసీపీ అధికార ప్రతినిధి నర్రెడ్డి వెంకటరెడ్డి, ఈవోఆర్డీ ఈదుల రాజశేఖర్‌రెడ్డి, ఎంపీడీవో నాగేశ్వరరావు, పిఆర్‌ డీఈ సుబ్బారెడ్డి, నాయకులు ఐవి సుబ్బారావుతో పాటు వైసీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.