May 11,2023 00:13

మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి, జె.సి రాజకుమారి

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి:ప్రభుత్వ సేవలకు సంబంధించి ప్రజలు తెలిపిన సమస్యలకు మరింత మెరుగైన పరిష్కారం అందించాలన్న ముఖ్య ఉద్ధేశ్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జగనన్నకు చెబుదాం కు ఎవరైనా తమ సమస్యలను తెలియజేయవచ్చునని జిల్లా కలెక్టర్‌ ఎం వేణుగోపాల్‌ రెడ్డి తెలిపారు.బుధవారం కలెక్టరేట్‌లో సంయుక్త కలెక్టర్‌ జి రాజకుమారితో కలసి ఆయన మీడియాతో మాట్లాడుతూ 1902 టోల్‌ ఫ్రీ నెంబరు ద్వారా ప్రజలు ఇంటి నుంచే వారికి ఉన్న సమస్యలను 24/7 హెల్ప్‌ లైన్‌కు తెలియజేయవచ్చన్నారు. ప్రజలు తెలియజేసిన సమస్యకు యువర్‌ సర్వీస్‌ రిక్వేస్ట్‌ (వైఎస్‌ఆర్‌) నెంబరు , లింక్‌ తో కూడిన సంక్షిప్త సందేశాన్ని ఫోన్‌కు పంపుతారని అన్నారు. ఇప్పటివరకు జరుగుతున్న స్పందన కార్యక్రమంలో తీసుకుంటున్న అర్జీలు జగనన్నకు చెబుదాం కార్యక్రమంకు అనుసందానం చేసి మరింత మెరుగ్గా అందుబాటులో ఉంటాయన్నారు. ఇప్పటికే ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతున్న స్పందన కార్యక్రమంలోను, ప్రతి సోమవారం మండల, డివిజన్‌, జిల్లా స్థాయిలో జరుగుతున్న స్పందనలో ప్రజలు అందించిన వినతులు, జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో 1902 టోల్‌ ఫ్రీ నెంబరు ద్వారా వచ్చిన వినతులు అన్నింటిని సక్రమంగా పరిష్కరించేలా నిరంతరం పర్యవేక్షించటం జరుగుతుందన్నారు. సమస్యలను మరింత మెరుగ్గా పరిష్కరించటానికి ప్రాసెస్‌ రీఇంజనీరింగ్‌ ద్వారా సమస్యలు ఎక్కువుగా వస్తున్న శాఖలకు సంబంధించి కారణాలను పూర్తి స్థాయిలో విశ్లేషించి, పరిష్కారాలను సులభతరం చేయటం జరుగుతుందన్నారు. ప్రాజెక్టు మానిటరింగ్‌ యూనిట్స్‌ (పీఎంయు)ను రాష్ట్ర, జిల్లా, డివిజన్‌, మండల స్థాయిలో ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారంను నిరంతరం పర్యవేక్షించటం జరుగుతుందన్నారు, పీఎంయులో నియమించిన అధికారులందరూ ప్రజల నుంచి వచ్చిన ప్రతి వినతిని సంబంధిత శాఖ అధికారికి ఫార్వర్డ్‌ చేసి వాటిని సక్రమంగా పరిష్కరించేలా జిల్లా, డివిజన్‌, మండల స్థాయిలో నిరంతరం పర్యవేక్షించటం జరుగుతుందన్నారు. పరిష్కరించిన వినతి పై ప్రజల నుంచి పరిష్కరించిన విధానం పై ఫీడ్‌ బ్యాక్‌ తీసుకొని కారణాలను విశ్లేషించటం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్‌ నుంచి గ్రామ, వార్డు సచివాలయంలోని ఉద్యోగి వరకు ప్రజలు అందించిన పిర్యాదులను ముఖ్యమంత్రి రిఫర్‌ చేసినట్లుగా భావించి అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చి మరింత మెరుగ్గా పరిష్కారించే ప్రయత్నం జరుగుతుందన్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభం సందర్భంగా కూడ ముఖ్యమంత్రి చేసిన మార్గనిర్దేశం ప్రకారం జిల్లా యంత్రాంగంను సిద్దం చేయటం జరిగిందన్నారు. జిల్లాలో వస్తున్న పిర్యాదులను విశ్లేషించగా ఎక్కువుగా మున్సిపల్‌, రెవెన్యూ, పంచాయితీ రాజ్‌, పోలీస్‌, విద్యుత్‌ శాఖ తదితర శాఖల నుంచి వస్తున్నట్లు తెలిసిందన్నారు. ఎక్కువుగా పిర్యాదులు వస్తున్న శాఖల ముఖ్య అధికారులతో పాటు ఇతర శాఖల అధికారులను పీఎంయూలలో నియమించటం జరిగిందన్నారు. వీరు ప్రజలు ఇచ్చిన సమస్యలకు సక్రమంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవటంతో పాటు సరియైన పరిష్కారం ఇవ్వలేకపోతున్న సమస్యలకు కారణాలను విశ్లేషించి దానికి సంబంధించి తీసుకోవాల్సిన అంశాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించేలా చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీల పరిష్కారంను ప్రతి సోమవారం, బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహిస్తామన్నారు.