
ప్రజాశక్తి-అనకాపల్లి
జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా కీలక సమస్యల పరిష్కారమవుతాయని జిల్లా ప్రత్యేక అధికారి జె.నివాస్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్ విధానంలో నిర్వహించిన జగనన్నకు చెబుదాం వెబ్‌సైట్ ప్రారంభ కార్యక్రమంలో అనకాపల్లి కలెక్టరేట్ నుంచి జిల్లా ప్రత్యేకాధికారి జె.నివాస్, జిల్లా కలెక్టర్ రవి పఠాన్‌శెట్టి, ఎస్పీ మురళీకృష్ణ, జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి, అడిషనల్ ఎస్పీ విజయ భాస్కర్, జిల్లా రెవెన్యూ అధికారికి వెంకటరమణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సమీక్ష సమావేశంలో అనకాపల్లి ప్రత్యేక అధికారి నివాస్ మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం కార్యక్రమం టోల్ ఫ్రీ నెంబర్ 1902పై క్షుణ్ణమైన అవగాహన కల్పించాలన్నారు. స్పందన గ్రీవెన్స్‌కు మెరుగులు దిద్దుతూ సమస్యలకు నాణ్యమైన, సత్వర పరిష్కారం కొరకే ఈ జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభించినట్లు చెప్పారు. స్పందన ఫిర్యాదులకు ఇచ్చే జవాబులలో మరింత నాణ్యత పెరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా రెవెన్యూ, పోలీస్, గ్రామపంచాయతీ శాఖలలో ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిని వీలైనంత త్వరగా స్పష్టంగా పరిష్కరించినట్లయితే సంతృప్త స్థాయి మరింత పెరుగుతుందని తెలిపారు.
నర్సీపట్నం టౌన్/ రూరల్ : జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభోత్సవాన్ని నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఆర్‌డిఒ హెచ్‌వి జయరాం, డిఎస్‌పి కె ప్రవీణ్ కుమార్ తమ సిబ్బందితో తిలకించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రసంగాన్ని ఆద్యంతం శ్రద్ధగా విన్నారు. అనంతరం ఆర్‌డిఒ జయరాం మాట్లాడుతూ, జిల్లా, డివిజన్ స్థాయిలో వివిధ కారణాల వల్ల పరిష్కారానికి నోచుకోని కీలక సమస్యలు జగనన్నకు చెబుదాం ద్వారా పరిష్కారమవుతాయన్నారు. దీనికోసం గ్రీవెన్స్‌కు 1902 టోల్ ఫ్రీ నెంబర్ ప్రభుత్వం కేటాయించిందన్నారు. కార్యక్రమంలో పట్టణ సిఐ నమ్మి గణేష్, ఎస్‌ఐలు గోవిందరావు, రామారావు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపిపి సుర్ల రాజేశ్వరి, ఎంపిడిఒ జయమాధవి, వైస్ ఎంపిపి ఇన్నం రత్నం తదితరులు పాల్గొన్నారు.
కోటవురట్ల : జగనన్నకు చెబుతాం కార్యక్రమం ప్రారంభోత్సవాన్ని మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపిడిఒ చంద్రశేఖర్, ఎస్‌ఐ నారాయణరావు సహా పలువురు అధికారులు వీక్షించారు, కార్యక్రమంలో ఇఒపిఆర్‌డి ప్రేమ్ సాగర్, పిఆర్ జెఇ వర్మ, హౌసింగ్ ఇంజనీర్ జగదీశ్వరరావు, ఉపాధి ఎపిఒ గంగు నాయుడు పాల్గొన్నారు.
కశింకోట : తాడేపల్లి నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని మండలంలోని ఉగ్గినపాలెం రైతు భరోసా కేంద్రంలో స్థానికులు వీక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కలగా లక్ష్మీ, గ్రామ సర్పంచ్ కలగా గున్నయ్య నాయుడు, పాలకవర్గ సభ్యులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, డ్వాక్రా మహిళలు, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది, గ్రామ పెద్దలు, గృహసారథులు పాల్గొన్నారు
విశాఖలో...
ఎంవిపి.కాలనీ : రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభించిన నేపథ్యంలో జిల్లా స్థాయి అధికారులంతా విశాఖ కలెక్టరేట్ వీడియో కాన్పరెన్సు హాల్ నుంచి ఆ కార్యకమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున, పోలీసు కమిషనర్ సిఎం త్రివిక్రమ్ వర్మ, జివిఎంసి కమిషనర్ సాయి కాంత్ వర్మ, ఎపిఐఐసి ఎమ్‌డి ప్రవీణ్ కుమార్, నగర్ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జె.సుభద్ర, శాసన సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్, తిప్పల నాగిరెడ్డి, నెడ్‌క్యాప్ చైర్మన్ కెకె.రాజు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.