Oct 27,2023 21:57

అర్జీలను స్వీకరిస్తున్న కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌

ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం : స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో మండల స్థాయిలో శుక్రవారం ఏర్పాటుచేసిన జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి వినతులు వెల్లువలా వచ్చాయి. కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ ఆధ్వర్యాన నిర్వహించిన ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోవిందరావు, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సి.విష్ణుచరణ్‌, ఆర్‌డిఒ ఎం.లావణ్య ప్రజల నుంచి 85 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మండల స్థాయిలో నిర్వహిస్తున్న జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వచ్చిన వినతలను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
సాగునీటి వనరులు అభివృద్ధి పరచాలని, ఏజెన్సీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, గుమ్మలక్ష్మీపురంలో గిరిజన మ్యూజియం ఏర్పాటు చేయాలని వినతులు అందాయి. డుమ్మంగి, బొద్దిడి గ్రామాల్లో పాఠశాలలు ఏర్పాటు చేయాలని, గుమ్మలక్ష్మీపురంలో క్రీడా పాఠశాల ఏర్పాటు చేసి యువతకు శిక్షణ ఇవ్వాలని టిడిపి ఎస్‌టి సెల్‌ అరకు పార్లమెంట్‌ అధికార ప్రతినిధి నందివాడ కృష్ణబాబు కోరారు. ఇరిడి, పెద్దఖర్జ పంచాయతీలోని గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేక ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, వెంటనే రోడ్డు మంజూరు చేయాలని కడ్రక. మల్లేశ్వరరావు, గ్రామస్తులు దరఖాస్తు అందజేశారు. మంగళాపురంలో 40 ఏళ్ల క్రితం ఏర్పాటుచేసిన చెక్‌డ్యామ్‌ దెబ్బతిందని, దీంతో వ్యవసాయ భూములకు సక్రమంగా నీరు అందక ఇబ్బంది పడుతున్నామని, చెక్‌ డ్యామ్‌ మరమ్మతులు పూర్తి చేయాలని మండంగి నాగేశ్వరరావు, రైతులు అర్జీ అందించారు.
గుమ్మలక్ష్మీపురం మండలం సంధిగూడ గ్రామానికి పాఠశాల, అంగన్వాడీ భవనం లేక గ్రామంలో ఉన్న చిన్నారులు ఇబ్బంది పడుతున్నారని బి.క్రిష్ణ వినతి పత్రం సమర్పించారు. కేదారిపురం పంచాయతీ కె.డి కాలనీ గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్ర భవనం శిథిలావస్థకు చేరుకుందని, వెంటనే బాగుచేయాలని ఎ.భారతి కోరారు. కేదారిపురం గ్రామానికి చెందిన పి. జానకి జగనన్న గృహ నిర్మాణ పథకం ద్వారా ఇల్లు మంజూరు చేయాలని దరఖాస్తు అందజేశారు. ఎల్విన్‌పేట గ్రామానికి చెందిన మండంగి మాణిక్యం మూడేళ్ల నుంచి పింఛను, రేషన్‌ రావడం లేదని వినతి సమర్పించారు. తాడికొండ గ్రామానికి చెందిన ఎ.చిన్నారావు నేషనల్‌ లైవ్‌ స్టాక్‌ మిషన్‌ పథకం ద్వారా సబ్సిడీ రుణాన్ని మంజూరు చేయవలసిందిగా కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి.జగన్నాథరావు, డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్‌ పి.కిరణ్‌ కుమార్‌, డ్వామా ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ కె.రామచంద్రరావు, స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ఎడి ఎం.ఇ.రాణి, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి ఎం.ఎన్‌.రాణి, జిల్లా పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారి జి.మల్లికార్జున, జిల్లా పంచాయతీ అధికారి బలివాడ సత్యనారాయణ, జిల్లా ఉద్యాన శాఖాధికారి కె.వి.ఎన్‌.రెడ్డి, జిల్లా పశు సంవర్ధక అధికారి జె.రత్నాకర్‌, బిసి సంక్షేమ అధికారి ఎస్‌.కృష్ణ, ముఖ్య ప్రణాళికా అధికారి వీర్రాజు, ఎల్‌డిఎం జెఎల్‌ఎన్‌ మూర్తి, తహశీల్దార్‌ రాములమ్మ, ఇతర శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.