ప్రజాశక్తి-విజయనగరం కోట : కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. అర్జీదారులతో కలెక్టరేట్ ఆడిటోరియం కిటకిటలాడింది. మరోవైపు బయట ధర్నాలతో దద్దరిల్లింది. జామి తహశీల్దార్‌పై చర్యలు తీసుకోవాలని పాత భీమసింగి రెల్లివీధికి చెందిన పలువురు వినతినిచ్చారు. 30 ఏళ్లగా నివాసముంటున్న తమ కాలనీలో కాలువలు, వీధిలైట్లు లేవని, పలుమార్లు అర్జీలు పెట్టుకున్నా సమస్యలు పరిష్కారం కాలేదని తెలిపారు. కలెక్టర్‌కు పదే పదే చెబుతున్నామని తహశీల్దార్ తమను దుర్భాషలాడుతున్నారని ఆవేదన చెందారు. కార్యక్రమంలో బాధితులు అప్పలకొండ మంగమ్మ, కోటమ్మ, రత్నాలు, రామయ్యమ్మ, పద్మ, సింహాచలం తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ మీ వల్ల కాదంటూ జనసేన నాయకులు లోకం మాధవి ధ్వజమెత్తారు. పలు సమస్యలపై ఫిర్యాదు ఇచ్చిన అనంతరం ఆమె మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అక్రమ అరెస్టులు, అరాచక పాలనతో ప్రజలను ఇబ్బంది పెట్టడం తప్ప ఏమీ లేదన్నారు. జగనన్న సురక్ష అని కొత్త నాటకానికి తెర తీశారని, గ్రామాల్లో పారిశుధ్యాన్ని మాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు.
పూసపాటిరేగ మండలం కుమిలికి చెందిన పలువురు దళితులు ఫిర్యాదు చేస్తూ 1988లో 36 కుటుంబాలకు ప్రభుత్వం ఒక ఎకరా చొప్పున భూమి ఇచ్చిందని తెలిపారు. అయితే తాజా డిఆర్ ఫైల్ గురించి గ్రామ విఆర్‌ఒ ని అడిగితే తన వద్ద లేదంటున్నాడని, తమకు ఇప్పించాలని కోరారు.
దాసన్నపేట రూట్ 33 ఎండియుపై చర్యలు తీసుకోవాలని విజయనగరం మండల పట్టణ రేషన్ డిపో డీలర్ల సంఘం డిమాండ్ చేసింది. కార్యక్రమంలో రేషన్ డీలర్ల అధ్యక్షులు ఎఎస్ ప్రకాష్ ఉపాధ్యక్షులు తవ్వ మోహన్‌రావు, కార్యదర్శి టి.మోహన్‌రావు పాల్గొన్నారు.
పూసపాటి రేగ మండలం వెంపడాం గ్రామానికి చెందిన దుక్క రాంబాబు వినతినిస్తూ.. తాను కొప్పెర్ల అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఏడాదిపాటు వంట మాస్టర్ గా పని చేశానని, ఇటీవల తొలగించారని, తిరిగి పనిలోకి తీసుకోవాలని కోరాడు.
గుంకలాం జగనన్న లేఅవుట్‌లో అవకతవకలు
విజయనగరం మండలం గుంకలాంజగనన్న లేఔట్ లో అక్రమాలు జరిగాయని, చర్యలు తీసుకోవాలని టిడిపి నాయకులు కోరారు. 400 ఎకరాలు సేకరించి, అందులో కొంత ఇళ్లకు కేటాయిస్తే మిగతా ఖాళీ స్థలాలు ఎందుకు ఉంచారో చెప్పాలని కోరారు. వినతినిచ్చిన వారిలో టిడిపి నగర అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్, కార్యదర్శి బంగారు బాబు, విజయనగరం మండల పార్టీ అధ్యక్షులు బొద్దల నర్సింగ రావు, కార్యదర్శి గంటా పోలి నాయుడు, కనకల మురళీమోహన్, ఎఎ రాజు, శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

ప్రతి అర్జీదారుని ఇకెవైసి చేయించాలి
జిల్లాలో వివిధ వర్గాల ప్రజల నుంచి జగనన్నకు చెబుదాంలో వచ్చిన వినతులను అర్జీదారులకు సంతృప్తి కలిగించే రీతిలో ఏవిధంగా పరిష్కరిస్తున్నారనే అంశంపై అన్ని ప్రభుత్వ శాఖలు నివేదికలు అందజేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదేశించారు. ప్రతి ప్రభుత్వ శాఖ తమకు అందిన అర్జీల్లో సంతృప్తికరంగా పరిష్కరించిన వినతుల సమాచారంతో ఈ నివేదికలు వారంలోగా ఇవ్వాలని చెప్పారు. దీనితోపాటు ఆయా మండలాల్లో సంతప్తికర వినతుల పరిష్కారంపై మండలాల ప్రత్యేక అధికారులు కూడా తమ మండలాలపై నివేదికలు అందించాలన్నారు. వినతుల పరిష్కారం సందర్భంగా అర్జీదారునితో ఇ-కెవైసి చేయించాలని స్పష్టంచేశారు. జగనన్నకు చెబుదాంలో భాగంగా సోమవారం కలెక్టర్ కార్యాలయంలో వినతులు స్వీకరించారు. కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, జిల్లా రెవిన్యూ అధికారి ఎస్.డి.అనిత, డిప్యూటీ కలెక్టర్‌లు సూర్యనారాయణ, పద్మలత, సుదర్శన దొర తదితరులు వినతులు స్వీకరించి వాటి పరిష్కారం నిమిత్తం సంబంధిత శాఖల అధికారులకు వాటిని పంపించారు. అన్ని ప్రభుత్వ శాఖలకు 238 వినతులు అందాయి.










