Oct 20,2023 22:01

చెరువు సుందీకరణపై వినతిని అందజేస్తున్న నాయకులు

కురుపాం: మండల స్థాయిలో ప్రజా సమస్యలకు క్షేత్రస్థాయిలోనే పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోవిందరావు, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సి.విష్ణు చరణ్‌, ఆర్‌డిఒ కె.హేమలతతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజల సమస్యలకు సత్వర పరిష్కార నిమిత్తం వారు జిల్లా కేంద్రానికి రాకుండా, జిల్లా అధికారులే ప్రజలకు అందుబాటులో వచ్చేందుకు మండల స్థాయిలో జగనన్నకు చెబుదాం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో 93 వినతులు రాగా వాటిలో ఎక్కువగా ప్రజలు తమ గ్రామ సమస్యలు, రోడ్డు, హౌసింగ్‌, వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోరుతూ వినతులు అందజేశారు. వీటిలో కొన్ని....
స్థానిక మేజర్‌ పంచాయతీలో గల శివన్నపేటలో గల 30 ఎకరాల సోమసాగరం చెరువు సుందరీ కరణ పనులు నిమిత్తం జిల్లా కో ఆప్షన్‌ సభ్యులు షేక్‌ నిసార్‌ , ఉప సర్పంచ్‌ షేక్‌ ఆదిల్‌, ఎంపిటిసి వి.బంగారునాయుడు, పిఎసిఎస్‌ అధ్యక్షులు కె.గౌరీశంకర్‌ వినతిపత్రం అందించారు. సమస్య లపై సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి అదేశాలు, సూచనలు చేశారు. కార్యక్రమం అనంతరం మండలంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. నాడు-నేడు, హౌసింగ్‌, మంచినీటి సరఫరా పనులు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. మండల ప్రత్యేక అధికారులు రక్తహీనత గల వారి జాబితా సచివాలయంలో ప్రదర్శిస్తున్నదీ లేనిదీ తనిఖీ చేయాలని, రక్తహీనత గల వారిని సచివాలయం సిబ్బందికి ఇద్దరూ లేక ముగ్గురు చొప్పున అప్పగించి, పర్యవేక్షణ చేసేలా చూడాలన్నారు. ఈ విషయంలో అశ్రద్ధ చూపే సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, స్థానిక ఎంపిడిఒ వివి శివరామప్ప, ఎంపిపి శెట్టి పద్మావతి, జెడ్‌పిటిసి జి.సుజాత, మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.