Nov 08,2023 22:36

అర్జీదారుని సమస్యను అడిగి తెలుసుకుంటున్న కలెక్టర్‌ గౌతమి

       నార్పల : మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జగనన్నకు చెబుదాం మండల స్థాయి కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సమస్యలపై కలెక్టర్‌కు అర్జీలు అందజేశారు. జెడ్పీ వైస్‌ ఛైర్మన్‌ నాగరత్నమ్మ, మేజర్‌ పంచాయతీ సర్పంచి సుప్రియలు మండల కేంద్రంలో మురుగునీరు, విద్యుత్‌ సమస్యలపై అర్జీని అందజేశారు. స్పందించిన కలెక్టర్‌ తాను నార్పలకు వచ్చే సమయంలో పరిస్థితిని చూశానని, కూతలేరు వంతెన వద్ద తీవ్రమైన దుర్గంధం వెదజల్లుతోందన్నారు. దుమ్ముధూళితో చాలా ఇబ్బందికరంగా ఉందన్నారు. సాధ్యమైనంత వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కషి చేస్తామని హామీ ఇచ్చారు. మండల కేంద్రమైన నార్పల ఉయ్యాలకుంటలో మసీదు కట్ట, సిపిఐ కాలనీ తదితర ప్రాంతాల్లో కరెంటు స్తంభాలు లేక కట్టెలపైనే విద్యుత్‌ కనెక్షన్లను ఇచ్చారన్నారు. బండ్లపల్లి గ్రామంలో పంచాయతీ మోటార్లు కాలిపోయి గ్రామ ప్రజలకు నీటి సమస్య ఎక్కువగా ఉందన్నారు. నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేయాలని సర్పంచి వెంకటనారాయణమ్మ అర్జీ ఇచ్చారు. రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన కుళ్లాయి స్వామి వెలసిన గూగుడు గ్రామంలో సరైన డ్రెయినేజీ వ్యవస్థ లేదని, విశ్రాంతిభవనాలు కూడా లేవని గూగూడు సర్పంచి రమణ కుమారి శివయ్య కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. పూర్తి స్థాయిలో మరుగునీటి కాలువలు ఏర్పాటు చేసి, విశ్రాంతిబవనాలు నిర్మించాలని, కుళ్లాయి స్వామి ఆలయం వరకు రోడ్డును వెడల్పు చేయాలని కలెక్టర్‌కు అర్జీ ఇచ్చారు. నార్పల పశువైద్యశాలలో నెలకొన్న మందుల కొరతను తీర్చాలని పాడి రైతులు అర్జీలు ఇచ్చారు. ఈ విషయంపై కలెక్టర్‌ పక్కనే ఉన్న పశువైద్యశాలను పశుసంవర్ధక శాఖ జెడితో మాట్లాడారు. ఇళ్ల పట్టాలు, భూ సమస్యలపై పలువురు అర్జీలను అందించారు. భోజనం అనంతరం కలెక్టర్‌ జిల్లా, మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు.
వందరోజులు అనంగా ఉపాధి పనులు కల్పించాలి
వర్షాభావంతో తీవ్ర కరువు నెలకొన్న నేపథ్యంలో అన్ని గ్రామాల్లో అదనంగా మరో వంద రోజులు ఉపాధి పనులు కల్పించాలని రైతుసంఘం నాయకులు కలెక్టర్‌ గౌతమిని కోరారు. ఈ మేరకు జగనన్నకు చెబుదాం ప్రత్యేక గ్రీవెన్స్‌లో కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఉపాధి పనులు కల్పించకుంటే గ్రామాల నుంచి వలసలు పెరిగే అవకాశం ఉందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఉపాధి పనులను 200కు పెంచాలని కోరారు. రోజు కూలి రూ.600 ఇవ్వాలన్నారు.