'జగనన్నకు చెబుదాం'కు విశేష స్పందన
- అధిక సంఖ్యలో పాల్గొన్న అర్జీదారులు
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : జగనన్నకు చెబుదాం (స్పందన) కార్యక్రమంలో ఆత్మకూరు డివిజన్‌లో వచ్చిన సమస్యలపై డివిజన్‌స్థాయి అధికారులు అందరూ ప్రత్యేక దృష్టి సారించి అర్జీదారుడు సంతృప్తి చెందే విధంగా సమస్యలు పరిష్కరించాలని, అర్జీదారులు మళ్లీ పునరావృతం కాకుండా పరిష్కార మార్గం చూపాలని జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణ అధికారులకు సూచించారు. సోమవారం ఆత్మకూరు ఆర్‌డిఒ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ నిర్వహించిన జగనన్నకు చెబుదాం (స్పందన) కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఉదయం 10.15 గంటల నుండి మధ్యాహ్నం 2.45 నిమిషముల వరకు కలెక్టర్ ఆర్‌డిఒ కార్యాలయంలో ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించారు. వందలాది మంది అధ్యదారులు వచ్చి కలెక్టర్ తమ సమస్యలపై అర్జీలు అందజేశారు. జిల్లా కలెక్టర్ కోర్టుతో నాలుగున్నర గంట పాటు ప్రజాసమస్యలు సావధానంగా వింటూ వారికి పరిష్కార మార్గం చూపుతూ అర్జీలను సంబంధిత అధికారులకు అందజేసి నిర్ణీత గడవలోని పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీదారుడు సంతృప్తి చెందే విధంగా పరిష్కారం చూపాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అధికారులు అదరూ హాజరయ్యారని అర్జీలను వారు కూడా గమనించాలని తెలిపారు. మళ్లీ ఇవే సమస్యలు తలెత్తకుండా తగిన పరిష్కారం చూపాలన్నారు. ప్రజలు నెల్లూరు స్పందనకు రావడం వల్ల ఖర్చు సమయం వృథా కాకుండా తానే ఆత్మకూరు వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రత్యేకంగా స్పందన కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలియజేశారు. శాశ్వతంగా పరిష్కారించడానికి ప్రభుత్వం జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రవేశపెట్టిందన్నారు. సోమవారం జరిగిన స్పందనలో రెవెన్యూకి సంబంధించిన సమస్యలపై అర్జీలు ఎక్కువగా వచ్చాయని తెలిపారు. రెవెన్యూ సమస్యలపై నియోజకవర్గస్థాయిలో స్థానిక శాసనసభ్యులు ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారని దానివల్ల 20 నుండి 30 శాతం సమస్యలు తగ్గాయని తెలిపారు. క్షేత్రస్థాయిలో రీసర్వే పూర్తి అయితే సమస్యలు ఇంకా తగ్గుతాయని కలెక్టర్ వెల్లడించారు. సిపిఎం పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గంటా లక్ష్మీపతి ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు ఆహ్లాద వాతావరణంలో పార్కులు నిర్మించాలన్నారు. అసంపూర్తిగా మిగిలిన క్రీడా ప్రాంగణ భవనం పూర్తిచేసి క్రీడ మైదానాన్ని అన్ని సౌకర్యాలతో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ కలెక్టర్‌కు అర్జీ అందజేశారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆత్మకూరు శాఖ ఆధ్వర్యంలో మినీ బైపాస్ రోడ్డు మార్గంలో ఉన్న బాలికల గురుకుల పాఠశాలకు ప్రహరీ లేక అవస్థలు ఎదుర్కొంటున్న బాలికల పాఠశాలకు ప్రహరీ నిర్మించాలని వినతిపత్రం అందజేశారు. ఎపి రైతుసంఘం నాయకులు కృష్ణమోహన్, ఎల్‌కె ప్రసాద్, కౌలు రైతు సంఘం గంటా లక్ష్మీపతి ఆధ్వర్యంలో నేషనల్ హైవే విస్తరణలో భాగంగా వాశిలి గ్రామం నుండి నరసాపురం వరకు భూములు కోల్పోయిన 38 మంది రైతులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. అలాగే ఆత్మకూరు మిగులు జలాలు వెళ్లడానికి పంట కాలవలు ముళ్లపొదలతో నిండి ఉన్నాయని పంటకాలు పూడిక తీసి రైతులకు మేలు చేయాలని వినతి పత్రం అందజేశారు. కోటపాడు గ్రామంలో విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు రోడ్డు మార్గం సరిగా లేదని రోడ్డు మార్గం కల్పించాలని వినతిపత్రం అందజేశారు. ఈ సమస్యలను పరిష్కరిస్తారని కలెక్టర్ కోరడంతో కలెక్టర్‌ను కోరడంతో సానుకూలంగా స్పందించిన కలెక్టర్ కార్యక్రమంలో ఆర్‌డిఒ కరుణ కుమారి, డి.ఎస్.పి. కోటారెడ్డి, మున్సిపల్ కమిషనర్ బి.నాగేశ్వరరావు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.










