ప్రజాశక్తి-విజయనగరం కోట : కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో ప్రజల నుంచి జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.డి.అనిత, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దొర, సుమబాల, ఇతర జిల్లా అధికారులు వినతులు స్వీకరించారు. ఈ వినతుల స్వీకరణ కార్యక్రమంలో సోమవారం 257 వినతులు అందాయి. అందులో రెవెన్యూకు సంబంధించి అత్యధికంగా 203 అర్జీలందాయి. గ్రామ వార్డు సచివాలయాల శాఖ 19, వైద్య ఆరోగ్యశాఖ 4, డిఆర్‌డిఎ 9, జిల్లా పంచాయతీ అధికారి 4, హౌసింగ్ 10, మున్సిపల్ 3, డిసిహెచ్‌ఎస్ 3 వినతులు వచ్చాయి. ఆయా వినతుల పరిష్కారం కోసం జెసి మయూర్ అశోక్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. వినతుల్లో కొన్ని.. జిల్లాలో కరువు మండలాలను ప్రకటించాలని టిడిపి, జనసేన నాయకులు వేర్వేరుగా వినతులు అందించారు. తీవ్ర వర్షాభావంతో రైతులు నష్టపోయారని, వెంటనే కరువు మండలాలను ప్రకటించాలని రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు బొద్దుల నర్సింగరావు, గంటా పోలి నాయుడు, జనసేన నాయకులు లోకం మాధవి, గురాన అయ్యలు, మర్రాపు సురేష్ పాల్గొన్నారు. కరోనా సమయం నుంచి కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యాన్ని ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున అందించి రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చినట్లు ప్రకటిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం తరపున బియ్యం అందించాలని టిడిపి జిల్లా ప్రధానకార్యదర్శి ఐవిపి రాజు, పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లకీëవరప్రసాద్ వినతి అందించారు. గంట్యాడ మండలం కరకవలస గ్రామానికి చెందిన కొరువాడ అప్పారావు తన భూమిని ఆన్‌లైన్ చేయాలని వినతి సమర్పించారు.
స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని వినతి
విజయనగరం టౌన్ : అయ్యప్పనగర్ నుండి ప్రధానరహదారి పైకి వచ్చే చోట స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంతో నెలరోజుల్లో ముగ్గురు మరణించారని, వెంటనే స్పీడ్‌బ్రేకర్లు ఏర్పాటుచేయాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యాన జాయింట్ కలెక్టర్‌కు వినతి అందించారు. స్పందించిన జెసి మున్సిపల్ అధికారులను పిలిచి.. అయ్యప్పనగర్, హనుమాన్ నగర్, పాలిటెక్నిక్ కాలేజీ వద్ద రెండు రోజుల్లో స్పీడ్ బ్రేకర్స్ వేయాలని ఆదేశించారు. అక్రమ వాటర్ ప్లాంట్‌ను సీజ్ చేయాలని ఆ సంఘం నాయకులు కోరగా, ఇప్పటికీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించినట్లు జెసి తెలిపారు. కార్యక్రమంలో పట్టణ పౌర సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి శంకరరావు, అయ్యప్పనగర్ పోరాట కమిటీ కన్వీనర్ యుఎస్ రవికుమార్, కార్యదర్శి ఎన్.సుధీర్ పాల్గొన్నారు.