Nov 04,2023 01:04

ప్రజాశక్తి - పంగులూరు
"సార్ నా భర్త బండి సుబ్బారెడ్డి 1996లో జరిగిన ఫ్యాక్షన్ గొడవల్లో చనిపోయాడు. మా కుటుంబానికి ఉన్న 38ఎకరాల పొలం, మా బావ బండి వెంకటేశ్వరరెడ్డి కిందే ఉంది. విడగొట్టి నా భాగం పొలం నాకు ఇవ్వమని ఏళ్లతరబడి తిరుగుతున్న, అధికారులు స్పందించడం లేదు" అని రేణింగవరంకు చెందిన బండి రవణమ్మ ఫిర్యాదు చేసింది. తాతల కాలం నుండి మాకు సంక్రమించిన సర్వే నెంబరు 294లోని 88సెంట్ల భూమిని ఐదేళ్ల క్రితం మా గ్రామానికి చెందిన వేరే వ్యక్తి పేరుతో ఆన్లైన్ చేశారు." నా భూమిని నా పేరుతోనే ఆన్లైన్ చేయమని 5ఏళ్ల నుంచి తిరుగుతున్న. ఇంతవరకు అధికారులు చేయలేదని" కొండమూరుకు చెందిన భీమనాదం వెంకటరమణారెడ్డి ఫిర్యాదు చేశాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు 255అర్జీలు కలెక్టర్ రంజిత్ భాషకు అందించారు. స్థానిక టిటిడి కళ్యాణ మండపంలో శుక్రవారం జగనన్నకు చెబుదాం ప్రత్యేక స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రంజిత్ భాష, జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్‌తో పాటు, జిల్లా స్థాయి అధికారులు, మండలంలోని అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సమస్యలపై ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. మండలంలోని బైటమంజులూరు గ్రామ ప్రజలు మండల కేంద్రానికి రావాలంటే జాతీయ రహదారిపై సర్వీసు రోడ్డు లేకపోవడం, డివైడర్ కటింగ్ లేకపోవడం వలన, రాంగ్ రోడ్డులో రావాల్సి వస్తుందని, దీనివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని బట్రాజు కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ చక్రవరం జ్యోతి, వైసీపీ బీసీ సెల్ మండల కన్వీనర్ చక్రవరం భాస్కరరాజు తెలిపారు. బైటమంజులూరులో ఫ్లోరిన్ ఎక్కువ ఉండటం వలన మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారని, ప్రభుత్వం ఆర్వో ప్లాంట్ మంజూరు చేయాలని కోరారు. గ్రామంలో స్మశానం మోకాళ్ళ లోతు నీళ్లలో ఉన్నందున శవాలను ఖననం చేయాలంటే ఇబ్బందిగా ఉంటుందని, స్మశానానికి మెరక తోలి, ప్రహరీ నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. తన ఇంటికి వెళ్లాలంటే చుట్టుపక్కల వాళ్ళు దారి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నట్లు ఆరికట్లవారిపాలెంకు చెందిన తానికొండ సుధాకర్ తన ఫిర్యాదులో తెలిపారు. గ్రామంలో సుమారు 170మందికి నివాసానికి పనికిరాని చౌడు భూముల్లో స్థలాలు ఇచ్చారని, వాటిని రద్దుచేసి ఇల్లు నిర్మించుకునేందుకు మంచి భూమిలో స్థలాలు ఇవ్వాలని అలవలపాడు ముస్లిం మహిళలు కోరారు. చిలకలూరిపేట ఆర్టీసీ బస్సును రద్దు చేయటంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. వెంటనే బస్సు పునరుద్ధరించాలని కోరారు. అద్దంకి బస్సు కూడా నైట్ అవుట్ ఇంకొల్లు బస్సు వేయాలని పంగులూరుకు చెందిన జాగర్లమూడి సుబ్బారావు వినతి పత్రం ఇచ్చారు. పాఠశాల స్థలం ఆక్రమణల నుండి విడిపించాలని దరఖాస్తు చేస్తే కొలవకుండానే కొలిచినట్లు అధికారులు చూపిస్తున్నారని కొప్పెరపాడు గ్రామస్తులు ఆరోపించారు. ఆ భూమిని కొలిచి చుట్టూ ఫెన్సింగ్ వేస్తే విద్యార్థులు ఆడుకోవడానికి ఉపయోగపడుతుందని గ్రామానికి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. కొరిశపాడు మండలానికి చెందిన కలికి సత్యనారాయణరెడ్డి అలవలపాడులో గత సంవత్సరం కంది, పత్తి సాగు చేశాడు. పత్తి పంట భీమా రూ.37వేలు రావాల్సి ఉండగా రాలేదని కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా జెడి అబ్దుల్ సత్తార్‌ను, ఎఒ సుబ్బారెడ్డిని పిలిచి భీమా ఎందుకు రాలేదని ప్రశ్నించారు. రిలయన్స్ కంపెనీ వారు ఎప్పుడు ఇస్తామన్నారని కలెక్టర్ ప్రశ్నించారు. ఆగస్టు 31న ముందస్తు సమాచారం లేకుండా ఐదు సార్లు కరెంట్ కట్ చేశారని బైటమంజులూరుకు చెందిన మోజెస్ ఫిర్యాదు చేశారు. దీంతో ఎందుకు విద్యుత్ కట్‌ చేశారని డిఈని కలెక్టర్ ప్రశ్నించారు. వర్షాలు కురవక, కాలువ నీళ్లు రాక, వేసిన పంటలు ఎండిపోతున్నాయని రైతులు విపరీతంగా నష్టపోతున్నారని, వెంటనే రైతులకు నష్టపరిహారం చెల్లించాలని జడ్పిటిసి రాయిని ప్రమీల కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ రంజిత్ భాష మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం ప్రత్యేక స్పందన కార్యక్రమానికి 255అర్జీలు వచ్చాయని తెలిపారు. ఇందులో ఎక్కువగా భూ సమస్యలు, ఇళ్ల స్థలాల సమస్యలు ఉన్నాయని అన్నారు. గ్రామాల్లో రీ సర్వే జరుగుతున్నందున భూ సమస్యలను పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను కోరారు. కార్యక్రమంలో చీరాల ఆర్డిఓ సరోజినీ, వైసీపీ అద్దంకి ఇంచార్జ్ బాచిన కృష్ణ చైతన్య, మాజీ ఎంఎల్‌ఎ బాచిన చెంచు గరటయ్య, తహశీల్దారు పద్మావతి, ఎంపీడీఒ రామాంజనేయులు, ఎంపీపీ తేళ్ళ నాగమ్మ, సర్పంచ్ గుడిపూడి నాగేంద్రమ్మ, జడ్పిటిసి రాయిని ప్రమీల, మండల ఉపాధ్యక్షులు ఎర్రం శ్రీనివాసరెడ్డి, ఎంఈఓ కె నాగభూషణం, మాజీ జెడ్పిటిసి బాచిన చెంచు ప్రసాద్, మండల అభివృద్ధి కమిటీ అధ్యక్షులు రాయని వెంకటసుబ్బారావు, మాజీ ఎంపీపీ జంపానీ రవిబాబు పాల్గొన్నారు.