ప్రజాశక్తి - కర్నూలు కలెక్టరేట్
'జగనన్నకు చెబుదాం', స్పందన అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ జి.సృజన అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో స్పందన కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను కలెక్టర్ సృజన, జెసి నారపురెడ్డి మౌర్య స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జగనన్నకు చెబుదాం, స్పందన అర్జీలను నాణ్యతగా పరిష్కరించడం అత్యంత కీలకమని తెలిపారు. స్పందన అర్జీల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, సకాలంలో పరిష్కరించడం ముఖ్యమని చెప్పారు. ప్రత్యేక దృష్టి సారించి స్పందన అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా పరిష్కరించాలని ఆదేశించారు. స్పందన అర్జీలకు నాణ్యతగా పరిష్కారం చూపించి రీఓపెన్ రాకుండా చూసుకోవాలని తెలిపారు. ఆయా శాఖల అధికారులు స్పందన అర్జీల పరిష్కారంపై రోజూ మానిటర్ చేయాలన్నారు. జులై 1 నుంచి ఆగస్టు 1 వరకు జిల్లాలో నిర్వహించే జగనన్న సురక్ష పథకంలో భాగంగా ఈనెల 24 నుంచి 30 వరకు ఇంటింటికీ వెళ్లి సర్వే చేయడం, సచివాలయ పరిధిలో నిర్వహించే క్యాంపుల ప్రత్యేక ప్రణాళికలు చేపట్టాలని ఆర్‌డిఒలు, మండల ప్రత్యేకాధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దార్లు, ఎంపిడిఒలను ఆదేశించారు. ఈ నెల 24 నుంచి 30 వరకు వార్డు, గ్రామ సచివాలయ పరిధిలోని ప్రతి ఇంటికీ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది వెళ్లి వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సర్టిఫికెట్లు అవసరం ఉందో తెలుసుకోవాలని సూచించారు. కార్యక్రమం విజయవంతమయ్యేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కుష్టు నిర్మూలన గోడపత్రికలు ఆవిష్కరణ
కుష్టు నిర్మూలనలో భాగంగా జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఈనెల 26 నుంచి జులై 16 వరకు 21 రోజులు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సచివాలయ వ్యవస్థ ద్వారా లెప్రసీ అనుమానిత వ్యాధిగ్రస్తులను సమర్థవంతంగా గుర్తించడానికి ఇంటింటికీ వెళ్లి వాలంటీర్లు సర్వే చేయాలని చెప్పారు. ఇంత వరకు గుర్తించని/నమోదు కానీ కేసులను గుర్తించి సదరు వ్యాధి ఇతరులకు సోకకుండా సర్వే చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జడ్‌పి సిఇఒ, మున్సిపల్ కమిషనర్లు సచివాలయ, వాలంటీర్లకు ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఆశా, వాలంటీర్లు జూన్ 26 నుంచి ఇంటింటి సర్వే నిర్వహించి అనుమానితులను గుర్తించాలన్నారు. మండల ప్రత్యేకాధికారులు కూడా వారికి కేటాయించిన గ్రామాలకు వెళ్లినప్పుడు లెప్రసీ వ్యాధిగ్రస్తులను గుర్తించాలని తెలిపారు. కాలానుగుణంగా వచ్చే డెంగీ, మలేరియా వ్యాధులపై మండల స్థాయి అధికారులు దృష్టి సారించాలన్నారు. జెసి నారపురెడ్డి మౌర్య మాట్లాడుతూ... రీసర్వే రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఇప్పటి వరకు 23 కేంద్రాల్లోనే రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయని తెలిపారు. మిగతా 34 కేంద్రాల్లో కూడా రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలన్నారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా జిల్లా రిజిస్ట్రార్‌ను సంప్రదించి సమస్యను నివృత్తి చేసుకొని రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని తెలిపారు. డిఆర్‌ఒ నాగేశ్వర రావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు రమ, నాగ ప్రసన్న లక్ష్మి, జిల్లా పరిషత్ సిఇఒ నాసర రెడ్డి, సిపిఒ అప్పలకొండ, డిఎంహెచ్‌ఒ రామగిడ్డయ్య, జిల్లా కుష్టు, ఎయిడ్స్, టిబి నివారణ అధికారి డాక్టర్ ఎల్.భాస్కర్, డిఎన్‌ఎంఒ డాక్టర్ మల్లికార్జున రెడ్డి, హెచ్‌ఇఒ శివశంకర్, డిప్యూటీ హెచ్‌ఇఒ దేవ ప్రసాద్ పాల్గొన్నారు.
స్పందనలో అర్జీలను స్వీకరిస్తున్న కలెక్టర్ సృజన










