జగనన్నకు చెబుదాం కార్యక్రమ సర్వీసుల డెలివరీలను పక్కాగా నిర్వహించండి.
జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్
సర్వే రాళ్ళు నాటే లక్ష్యాన్ని పూర్తి చేయండి.
వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులను ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్ జవహర్ రెడ్డి.
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
జగనన్న శాశ్వత భూ హక్కు - భూ రక్ష పథకంలో భాగంగా రీ సర్వే పూర్తయిన ప్రాంతాల్లో సర్వే రాళ్ళు నాటే ప్రక్రియను లక్ష్యం మేరకు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ఎస్. జవహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను సూచించారు. గురువారం వివిధ శాఖల కార్యదర్శులతో కలిసి స్పందన అర్జీల పరిష్కారం, భూముల రీ సర్వే, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, నాడు నేడు, జగనన్న విద్యా కానుక కిట్లు తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డాక్టర్ కె. ఎస్. జవహర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు.కలెక్టర్ ఛాంబర్ నుండి జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ తో పాటు జాయింట్ కలెక్టర్ నిశాంతి. టి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు జూమ్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాల్లో రీసర్వే ప్రక్రియను వేగవంతం చేసి లక్ష్యం మేరకు పూర్తి చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను సూచించారు. జాతీయ రహదారుల భూసేకరణ, గృహ నిర్మాణాల స్టేజి కన్వర్షన్ ఉండేలా వేగవంతం చేయాలన్నారు. స్పందన గ్రీవెన్స్ లను నాణ్యతతో పరిష్కరించాలన్నారు. పర్యాటక శాఖకు చెందిన భూసేకరణ త్వరితగతిన చేయాలన్నారు. వ్యవసాయ మరియు అనుబంధ శాఖలు రైతులకు మెరుగైన సేవలు అందించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం కార్యక్రమం కింద స్వీకరించిన దరఖాస్తులకు సంబంధించిన సర్వీసుల డెలివరీ పక్కగా నిర్వహించాలని పంచాయతీరాజ్, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారులను ఆదేశించారు. స్పందన అర్జీలను సకాలంలో నాణ్యతగా అర్జీదారుల సంతృప్తి మేరకు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సూక్ష్మ సేద్య అమలు పథకం కింద డ్రిప్, స్ప్రింక్లర్స్ సరఫరాకు రైతులను గుర్తించి రిజిస్ట్రేషన్లు చేయించాలని ఏపీఎంఐపి పిఓను కలెక్టర్ ఆదేశించారు. పర్యాటక అభివృద్ధికి సంబంధించి సేకరించిన భూములను పర్యాటక శాఖకు స్వాధీనం చేయాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ సూచించారు. యంత్ర సేవా పథకం కింద 21 గ్రూపులకు రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకర్లతో సంప్రదించాలని కలెక్టర్ జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు. పండ్ల తోటల అభివృద్ధిలో జిల్లా దిగువ నుండి 5వ స్థానంలో ఉందని పండ్ల తోటల అభివృద్ధికి లబ్ధిదారులను గుర్తించి చర్యలు తీసుకోవాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు.










