ప్రజాశక్తి-కాకినాడ జగనన్నకు చెబుదాం (జెకెసి) కార్యక్రమంలో వచ్చే అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ప్రత్యేక కమిషనర్ (రైతు భరోసా కేంద్రాలు) గోపాలకష్ణ ద్వివేది అన్నారు. మంగళవారం కలెక్టరేట్ కోర్టుహాల్‌లో కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, ఎస్‌పి ఎస్.సతీష్ కుమార్, జెసి ఎస్.ఇలక్కియ, అసిస్టెంట్ కలెక్టర్ ప్రఖర్ జైన్, డిఆర్‌ఒ కె.శ్రీధర్‌రెడ్డితో కలిసి జగనన్నకు చెబుదాం కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యుత్, రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, గ్రామీణ నీటి సరఫరా విభాగాలకు సంబంధించి వస్తున్న అర్జీలు, వాటి పరిష్కారంపై ఆయా విభాగాల జిల్లాస్థాయి అధికారులతో చర్చించారు. ఇప్పటివరకు 3,082 జెకెసి అర్జీలు రాగా ఈ అర్జీలను నిర్ధేశిత గడువులోగా పరిష్కరించే కార్యక్రమం అమల్లో కాకినాడ జిల్లా ముందు వరుసలో ఉందన్నారు. ఇదే పనితీరును కనబరుస్తూ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి సరఫరా, పారిశుధ్యం, విద్యుత్ తదితర సేవలకు సంబంధించి వచ్చే అర్జీలపై డివిజన్, జిల్లాస్థాయి అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించి అర్జీదారులు పూర్తిస్థాయిలో సంతప్తి వ్యక్తం చేసేలా పరిష్కరించేలా చూడాలన్నారు. ఆయా అర్జీల పరిష్కార ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని గోపాలకృష్ణ ద్వివేది సూచించారు. కొందరు అర్జీదారులతో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకష్ణ ద్వివేది, కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా నేరుగా ఫోన్‌లో మాట్లాడారు. అర్హత ఉన్న ఏ ఒక్కరూ లబ్ధి అందకుండా మిగిలిపోకూడదన్న ఉద్దేశంతో ప్రతి ఇంటికీ వెళ్లి మరీ ప్రభుత్వ పథకాలు, సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన జగనన్న సురక్ష కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా అమలు చేసేందుకు అధికారులు కషి చేయాలని సూచించారు. జులై 1వ తేదీ నుంచి సచివాలయాల వారీగా క్యాంపులు నిర్వహించి అక్కడికక్కడే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సీసీఆర్‌సీ కార్డులు, జనన, మరణ, కుల, ఆదాయ ధ్రువీకరణ వంటి 11 రకాల సర్టిఫికెట్లను ఉచితంగా అందించాల్సి ఉంటుందని ద్వివేది వివరించారు. ఈ సమావేశంలో కాకినాడ ఆర్‌డిఒ ఎన్‌వివి.సత్యనారాయణ, జెడ్‌పి సిఇఒ ఎ.రమణారెడ్డి, డిఆర్‌డిఎ పీడీ కె.శ్రీరమణి, డ్వామా పీడీ ఎ.వెంకటలక్ష్మి, కుడా విసి కె.సుబ్బారావు, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్.విజరుకుమార్, గ్రామీణ నీటి సరఫరా ఎస్‌ఇ ఎం.శ్రీనివాసరావు, డిపిఒ ఆర్.విక్టర్, హౌసింగ్ పీడీ బి.సుధాకర్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.










