
గాలివీడు : ప్రభుత్వం జిల్లా కేంద్రానికి రాలేని వారి సమస్యల పరిష్కారానికి మండల స్థాయిలో జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కలెక్టర్ గిరీష పేర్కొన్నారు. శుక్రవారం ఎంపిడిఒ కార్యాలయ ఆవరణంలో మండల స్థాయిలో జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ గిరీష, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ ప్రజల నుంచి వచ్చిన అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నిరంతరం ప్రజాసేవకే అంకితమై ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కరించాలనే ఉద్దేశంతో నేటి నుంచి మండల స్థాయిలో జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. అధికారులందరూ ప్రజల సమస్యలకు మెరుగైన, వేగవంతమైన పరిష్కారం లభించే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. సచివాలయాలు వచ్చిన తర్వాత చాలావరకు ఆయా గ్రామాలలోనే సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలిపారు. ప్రతి సచివాలయం పరిధిలో వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు రాసుకుని పరిష్కరిస్తున్నారన్నారు. గాలివీడు మండలంలో ఎక్కువగా 22-ఎ, చుక్కల భూములు, హౌసింగ్, తాగునీటి సమస్యలు ఉన్నాయని ఈ సమస్యలన్నీ జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమంలో అర్జీ సమర్పించి పరిష్కరించుకోవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో 150 దరఖాస్తులు వచ్చాయన్నారు. దరఖాస్తులను ఆయా శాఖల అధికారులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. దరఖాస్తులకు సంబంధించి వచ్చే వారం రోజుల లోపల ఆక్షన్, టేకెన్ రిపోర్టు తమకు సమర్పించాలన్నారు. స్థానిక ఎమ్మెల్యేకు ఆక్షన్, టేకెన్ రిపోర్టు పంపడం జరుగుతుందని జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమంలో ప్రజలు సమర్పించిన అర్జీలకు తీసుకున్న చర్యలపై రిపోర్టు స్పష్టంగా క్లియర్‌గా ఉండాలని ఇందులో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. వైఎస్ ఎంపిపి యదుభూషణ్‌రెడ్డి, రాయచోటి ఆర్‌డిఆఒ రంగస్వామి, తహశీల్దార్ దైవాదీనం, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.