ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
'జగనన్నకు చెబుదాం' స్పందనలో వచ్చిన అర్జీలను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ ప్రసన్నవెంకటేష్ అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక వాసవీ కన్యకాపరమేశ్వర ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో నిర్వహించిన జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమంలో ప్రజలను అర్జీలను అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. సుమారు 124 వినతులు ప్రజల నుంచి వచ్చాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలస్థాయిలో నిర్వహించే జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యతిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అందిన ప్రజాసమస్యలను నిర్ధేశించిన గడువులోగా సంబంధిత అధికారులు పరిష్కరించాలన్నారు. జాయింట్ కలెక్టర్ బి.లావణ్యవేణి మాట్లాడుతూ స్పందన దరఖాస్తులను నిర్లక్ష్యం చేయొద్దని తెలిపారు. అర్జీలను కూడా నాణ్యతతో పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ క్రమంలో పట్టెన్నపాలెం బ్రిడ్జి నిర్మాణాన్ని తక్షణం చేపట్టాలని టిడిపి నాయకులు అర్జీని అందజేశారు. జంగారెడ్డిగూడెంలోని కాలేజి గ్రౌండ్ ఆక్రమణకు గురికాకుండా పూర్తిసర్వే చేసి కాలేజీకి అప్పగించాలని స్థానిక ప్రజలు అర్జీని అందించారు. జంగారెడ్డిగూడెం శ్రీరామపురం గ్రామానికి చెందిన జి.వెంకటేశ్వర్లు 125 మందికి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇప్పించాలని కోరుతూ అర్జీ అందజేశారు. జంగారెడ్డిగూడేనికి చెందిన కె.వెంకటరమణ తమకు వేగవరంలో ఉన్న భూమి పక్కన ప్రభుత్వ పుంత ఉందని, దాన్ని కొంతమంది ఆక్రమించుకోవడం వల్ల రాకపోకలకు ఇబ్బందిగా ఉందని, ప్రభుత్వం స్పందించి ఆక్రమణలను తొలగించాలని అర్జీ అందజేశారు. పట్టణంలోని కంటి ఆసుపత్రిలో తమకు కంటి ఆపరేషన్ చేయకుండా చేశామని సొమ్మలు కూడా తమ పేరున డ్రా చేసుకున్నారని దీనిపై విచారణచేసి తనకు న్యాయం చేయాలని ఎ.ఫ్రాన్సిస్ అర్జీని అందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్‌పి భాస్కర్‌రావు, ఆర్‌డిఒ జాన్సీరాణి, డిఆర్‌డిఎ పీడీ ఆర్.విజయరాజు, డ్వామా పీడీ రాము, డిజిఎస్‌డబ్ల్యూఎస్ నోడల్ అధికారి రమణ, మైనారిటీ సంక్షేమ అధికారి కృపావరం, మునిసిపల్ చైర్‌పర్సన్ బత్తిన నాగలక్ష్మి, స్థానిక తహశీల్దార్ స్లీవ జోజి, ఎంపిడబొ కెవి.ప్రసాద్, మునిసిపల్ కమిషనర్ పి.భవాని ప్రసాద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.










