Aug 21,2023 20:13

అర్జీలు సమర్పిస్తున్న అర్జీదారులు

అర్జీలు సమర్పిస్తున్న అర్జీదారులు
జగనన్నకు చెబుదాం అర్జీలకు
నిర్ణీత గడువులో పరిష్కరించాలి
ప్రజాశక్తి-నెల్లూరు:జగనన్నకు చెబుదాం (స్పందన) అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్‌ ఎం హరి నారాయణన్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జాయింట్‌ కలెక్టర్‌ కూర్మనాథ్‌ , ఇన్చార్జి డిఆర్‌ఓ పద్మావతి, జడ్పీ సీఈవో చిరంజీవితో కలిసి కలెక్టర్‌ స్పందన కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించి, సంబంధిత అధికారులకు అందజేసి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని ఇతర ప్రాంతాలకు సంబంధించిన అర్జీలపై ఎండార్స్మెంట్‌ చేసి పరిష్కరించాలని ఆదేశించారు. అత్యవసరమైన అర్జీలపై వెంటనే స్పందించిన కలెక్టర్‌ సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అధికారులు స్పందన అర్జీల పరిష్కారానికి ప్రత్యేక దష్టి సారించాలన్నారు. అన్ని శాఖల అధికారులు తమకు సంబంధించిన అర్జీలను ముందుగా పరిశీలించాలన్నారు. వచ్చిన అర్జీలు మళ్లీ మళ్లీ వస్తుంటే, దరఖాస్తుదారుడి వద్దకు వెళ్లి సమస్య ఎందుకు పరిష్కారం కావడం లేదో అర్థమయ్యేలా వివరించాలని చెప్పారు. ప్రతి సమస్య పరిష్కారానికి నిర్దిష్ట గడువు ఉంటుందని, ఆ గడువులోగా పరిష్కారం కాకపోతే మరలా స్పందన కార్యక్రమానికి రావాలని అర్జీదారులకు సూచించారు. ఒక సమస్య పరిష్కారం కోసం ఎక్కువమంది వచ్చి ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దని అర్జీదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఎ, హౌసింగ్‌ పీడీలు సాంబశివరెడ్డి, నాగరాజు, డి ఎం హెచ్‌ ఓ పెంచలయ్య, డి.ఎస్‌.ఒ వెంకటేశ్వర్లు, డిపిఓ సుస్మిత, డిఇఓ గంగాభవాని తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.