Apr 08,2023 00:36
రేపల్లెలో జగనన్నే మా భవిష్యత్తు ప్రచారంలో మోపిదేవి

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: బాపట్ల జిల్లా వ్యాప్తంగా 'జగనన్నే మా భవిష్యత్‌' కార్యక్రమాన్ని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ఘనంగా ప్రారంభించారు. వైసీపీ ప్రజా ప్రతినిధులైన ఎమ్మెల్యేలు, గృహ సారథులు, కన్వీనర్లు ప్రతి ఇంటికీ వెళ్లి సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించే కార్యక్రమం చేపట్టారు. జిల్లా అంతటా ఈ నెల 20 వరకు 'మా నమ్మకం నువ్వే జగన్‌' అనే కార్యక్రమం జరుగనుంది. ఇందులో భాగంగా గత టిడిపి ప్రభుత్వానికి ప్రస్తుత వైసిపి ప్రభుత్వ పాలనకు గల తేడా ఏమిటో ప్రజలకు తెలియజేసే కార్యక్రమంలో వైసిపి నేతలు, గృహ సారథులు, కన్వీనర్లు పాల్గొన్నారు.
రేపల్లె: సీఎం జగన్‌ నేతృత్వంలోని వైఎస్‌ఆర్‌సీపీ 'జగనన్నే మా భవిష్యత్తు' అనే పేరుతో అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రచార కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు రేపల్లె నియోజకవర్గంలో ప్రారంభించారు. 'జగనన్నే మా భవిష్యత్తు' కార్యాచరణ వివరిస్తూ రేపల్లె పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు మాట్లాడారు. 7 లక్షల మంది పార్టీ సైనికులు 14 రోజుల్లో ఏప్రిల్‌ 7 నుంచి 20 వరకు రాష్ట్రంలోని 1.6 (కోటి అరవై లక్షల) కోట్ల కుటుంబాలను.. 5 కోట్ల మంది ప్రజలను కలిసి 'మెగా సర్వే' చేయనున్నారని మోపిదేవి చెప్పారు. అంతరం 13వ వార్డులో ప్రత్యేకంగా 'పీపుల్స్‌ సర్వే' నిర్వహించారు. సంక్షేమ పథకాల లబ్ధి పొందారో అడిగి తెలుసుకున్నారు. ప్రజలను వారి భవిష్యత్తు కోసం సీఎం జగన్‌ను విశ్వసిస్తున్నారా అని అడిగారు. ఆయన సందేశాన్ని చివరి మైలు వరకు తీసుకెళ్లడమే ముఖ్య ఉద్దేశం అని మోపిదేవి వివరించారు. కార్యక్రమంలో బుడా చైర్మన్‌ దేవినేని మల్లికార్జునరావు మున్సిపల్‌ చైర్మన్‌ కట్టామంగా, పట్టణ అధ్యక్షులు గడ్డం రాధాకృష్ణమూర్తి, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అద్దంకి: మన భవిష్యత్‌కు, భవిష్యత్‌ తరాలకు ఉపయోగపడే పనులు చేస్తున్న మన జగనన్నను నిండు మనస్సుతో ఆశీర్వదించి ఆదరించి గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలిపించి జగన్‌ను మరలా ముఖ్యమంత్రిని చేయాలని ఎమ్మెల్సీ పోతుల సునీత ప్రజలను కోరారు. వైసిపి ఆధ్వర్యంలో పట్టణంలో శుక్రవారం నిర్వహించే జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోతుల సునీత రాష్ట్ర శాప్‌ నెట్‌ వర్క్‌ చైర్మన్‌ నియోజకవర్గ వైసిపి ఇన్‌ఛార్జి బి కృష్ణ చైతన్యతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఆర్‌అండ్‌బి బంగ్లాలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ రాష్ట్రంలో 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో 175కు 175 సీట్లు గెలిచి మరలా జగన్‌ ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. కృష్ణ చైతన్య మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వంలో నియోజకవర్గంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి కుటుంబానికి లబ్ది చేకూర్చే విధంగా పని చేశామని అన్నారు. 'జగనన్నే మా భవిష్యత్‌' స్టిక్కర్‌ను ఇంటింటికి అంటించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు కాకాని రాధాకృష్ణమూర్తి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎస్తేరమ్మ, వైస్‌ చైర్మన్‌ 5వ వార్డు కౌన్సిలర్‌ దేసు పద్మేష్‌, కౌన్సిలర్లు, వార్డు ఇన్‌ఛార్జులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, కార్పొరేషన్‌ డైరెక్టర్లు, కో ఆప్షన్‌ సభ్యులు, జెసిఎస్‌ ఇన్‌ఛార్జులు, స్థానిక నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.