Nov 07,2023 23:21

జగనన్నది రైతు సంక్షేమ ప్రభుత్వం: మంత్రి రోజా


రైతన్నల ఖాతాల్లో రూ.73.95 కోట్లు జమ


జగనన్నది రైతు సంక్షేమ ప్రభుత్వం: మంత్రి రోజా
ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో
2023-24 సంవత్సరంకు గాను వైయస్‌ఆర్‌ రైతు భరోసా - పియం కిసాన్‌ కింద వరుసగా ఐదో ఏడాది రెండో విడత నగదు బదిలీ చేయు కార్యక్రమంను ముఖ్యమంత్రి వైయస్‌. జగన్‌ మోహన్‌ రెడ పుట్టపర్తి, శ్రీ సత్యసాయి జిల్లా నుండి ప్రారంభించి బటన్‌ నొక్కి నేరుగా నేడు అర్హులైన రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. జిల్లాలో 1,80,654 మంది భూయజమాని రైతులకు, కౌలు, ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ సాగు రైతులకు రూ.73.95కోట్ల లబ్ది చేకూరిందని రాష్ట్ర పర్యాటక, యువజన సర్వీసుల, క్రీడా, సాంస్కతిక శాఖా మంత్రి ఆర్కే రోజా తెలిపారు. జిల్లా స్థాయి కార్యక్రమం వడమాలపేట మండల కేంద్రంలోని ఎస్‌ఆర్టి ఫంక్షన్‌ హాల్‌లో ముఖ్యమంత్రి ప్రత్యక్ష ప్రసారం వీక్షించే ఏర్పాట్లు చేయగా మంత్రితో పాటు, జిల్లా కలెక్టర్‌ కె.వెంకట రమణరెడ్డి తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ రైతు బాగుంటే మనం అందరం బాగుంటామని, రైతు చెమటోడ్చి పండిస్తే మనకు ధాన్యాలు అందుతున్నాయని గుర్తు చేశారు. రైతు భరోసా కింద రైతులకు ఏటా రూ. 13,500 ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారని అన్నారు. తిరుపతి జిల్లాలోనే 2019 నుండి 2022 వరకు 176345 రైతు కుటుంబాలకు 927 కోట్లు వారి ఖాతాల్లో నేరుగా జమ చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్రం లోని రైతులందరికి సాగు ఖర్చు క్రింద పెట్టుబడి సహాయం అందించాలనే ఉద్దేశ్యంతో అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి రూ.13,500ల చొప్పున రైతుల ఖాతాలలో నేరుగా ప్రభుత్వం జమ చేస్తున్నదని, దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న నిబద్ధత కలిగిన ప్రభుత్వం అని తెలిపారు. అనంతరం మంత్రి, కలెక్టర్‌ రూ. 73.95 కోట్ల మెగా చెక్కును రైతులకు అందచేశారు. పుత్తూరు మునిసిపల్‌ చైర్మన్‌ హరి, ఎంపీపీ విజయలక్ష్మి, పిఎసిఎస్‌ చైర్మన్‌ సుధీర్‌ రెడ్డి, వడమలపేట సర్పంచ్‌ మునెమ్మ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ప్రసాద్‌, జిల్లా ఎపిఎంఐపి అధికారి సతీష్‌, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి దశరథ రామిరెడ్డి, పాల్గొన్నారు.