మాట్లాడుతున్న అరుణమ్మ
జగనన్న విద్యాదీవెన పథకంతో
విద్యార్థులు ఉన్నత చదువులకు భరోసా
- జిల్లాలో 46,031 మంది విద్యార్థులకు లబ్ది
- జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ
ప్రజాశక్తి-నెల్లూరు:పేద కుటుంబాల్లోని విద్యార్థులందరూ ఉన్నత చదువులు చదువుకుని, ఆయా కుటుంబాలు ఆర్థికంగా పరిపుష్టి సాధించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేద విద్యార్థుల ఉన్నత చదువులకు అండగా నిలుస్తున్నారని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ పేర్కొన్నారు. సోమవారం జగనన్న విద్యా దీవెన మూడో త్రైమాసిక నిధులు జమ కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లా నగరి నుంచి ముఖ్యమంత్రి ప్రారంభించగా, స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్ ఆర్ శంకరన్ హాలు నుంచి వర్చువల్ గా జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్, డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతి, జిల్లా స్థాయి అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రకటించిన నవరత్నాల్లో జగనన్న విద్యా దీవెన పథకం ఎంతో ప్రధానమైనదన్నారు. సమాజంలో చదువుకు పేదరికం అడ్డు రాకూడదనే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి శ్రీకారం చుట్టారని, ఈ పథకం వలన పేదరికంతో ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాల్లోని విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకుని ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందగలిగారని, తండ్రి స్ఫూర్తితో ప్రస్తుత ముఖ్యమంత్రి జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కార్యక్రమాలను ప్రవేశపెట్టి క్రమం తప్పకుండా నిధులు విడుదల చేస్తూ పేద విద్యార్థులకు అండగా నిలుస్తున్నారన్నారు. జగనన్న విద్యా దీవెన పథకం కింద జిల్లాకు సంబంధించి మొత్తం 46,031 మంది విద్యార్థులకు సుమారు రూ. 34.45 కోట్లను విద్యార్థుల తల్లుల ఖాతాలకు నేరుగా ముఖ్యమంత్రి జమ చేశారన్నారు. ఎక్కడా కూడా ఖర్చుకు వెనకాడకుండా విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు చేపట్టిన ఘనత ముఖ్యమంత్రి కే దక్కిందన్నారు. నాడు నేడు, జగనన్న విద్యా కానుక, అమ్మ ఒడి, విదేశీ విద్య వంటి పథకాలతో విద్యాభివద్ధికి ముఖ్యమంత్రి ఎంతో కషి చేస్తున్నారని చెప్పారు. పేద విద్యార్థుల విద్యాభివద్ధికి భరోసాగా నిలుస్తున్న ముఖ్యమంత్రికి విద్యార్థులు, తల్లిదండ్రులు ఆశీస్సులు అందించి అండగా నిలవాలని మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ డిడి రమేష్, ట్రైబల్ వెల్ఫేర్ పిఓ డాక్టర్ మంద రాణి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి వెంకటయ్య, మైనార్టీ సంక్షేమ అధికారి నిర్మలాదేవి, హాస్టళ్ల సంక్షేమ అధికారులు, వార్డెన్లు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.










