May 24,2023 23:45

చెక్కు అందిస్తున్న విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున

ప్రజాశక్తి-యంత్రాంగం
కలెక్టరేట్‌, విశాఖ : జగనన్న విద్యా దీవెన పథకం కింద విశాఖ జిల్లాలో 41,075 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరిందని, వీరందరికీ ఈ పథకం కింద రూ.37 కోట్ల మేర ప్రయోజనం కలిగిందని విశాఖ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున తెలిపారు. జగనన్న విద్యా దీవెన కింద జనవరి - మార్చి త్రైమాసికానికి రాష్ట్రస్థాయిలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బుధవారం ప్రారంభించగా, జిల్లా స్థాయిలో కలెక్టర్‌ ఆధ్వర్యాన నిర్వహించారు. విశాఖ జిల్లాలో రూ. 36,92,71,992 మొత్తాన్ని మెగా చెక్కు రూపంలో జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున ప్రజా ప్రతినిధులతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లాలో ఈ త్రైమాసికానికి సుమారు 41,075 మంది విద్యార్థులకు విద్యా దీవెన కింద లబ్ధి చేకూరిందన్నారు. విద్యా దీవెనకు సంబంధించి ఏమైనా సమస్యలుంటే విద్యార్థులు సచివాలయంలో ఉండే వెల్ఫేర్‌ అసిస్టెంట్లకు తెలియజేస్తే పరిష్కరిస్తారన్నారు. జిల్లాలో 207 మంది ఎస్‌సి విద్యార్థులకు రూ.30.35 లక్షలు, 180 మంది ఎస్‌టి విద్యార్థులకు రూ.14.60 లక్షలు, 33,157 మంది బిసి విద్యార్థులకు రూ.29.01 కోట్లు, 4,640 మంది ఇబిసి విద్యార్థులకు రూ.4.73 కోట్లు, 1,418 మంది కాపు విద్యార్థులకు రూ.1.38 కోట్లు, 221 మంది క్రిస్టియన్‌ మైనారిటీ విద్యార్థులకు రూ.25 లక్షలు, 1,252 మంది ముస్లిం మైనారిటీ విద్యార్థులకు రూ.1.09 కోట్లు, జమచేసినట్లు తెలిపారు. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ జె.సుభద్ర, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ కొండా రమాదేవి, సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ రమణమూర్తి, బిసి వెల్ఫేర్‌ ఆఫీసర్‌ శ్రీదేవి, గ్రామ, వార్డు సచివాలయాల జిల్లా ఇన్‌ఛార్జి పూర్ణిమా దేవి, విద్యార్థులు పాల్గొన్నారు.
అనకాపల్లి జిల్లాలో 37,348 మంది విద్యార్థులకు..
అనకాపల్లి : జగనన్న విద్యా దీవెన రెండో త్రైమాసిక నిధులు జమ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ రవి పఠాన్‌శెట్టి పాల్గొన్నారు. విద్యా దీవెన చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 37,348 మంది విద్యార్థులకు రూ.28,52,09,123 విద్యార్థుల తల్లుల ఖాతాలకు నేరుగా ముఖ్యమంత్రి జమ చేసినట్లు చెప్పారు. 36,435 మంది బీసీ విద్యార్థులకు 27.86 కోట్లు, 119 మంది ఎస్సీ విద్యార్థులకు రూ.15.55 లక్షలు, 543 ఎస్‌టి విద్యార్థులకు రూ.29.92 లక్షలు, 45 మంది క్రిస్టియన్‌ మైనార్టీలకు రూ 3.94 లక్షలు, 206 ముస్లిం మైనారిటీ విద్యార్థులకు రూ.16.45 లక్షలు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి అజరు బాబు, జిల్లా బీసీ సంక్షేమ అధికారి రాజేశ్వరి, ఏటి డబ్ల్యూ ఓ నాగ శిరీష విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.