ప్రజాశక్తి - కలెక్టరేట్ (విశాఖపట్నం)
రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని విశాఖ కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున ప్రారంభించారు. విశాఖపట్నం జిల్లాకు సంబంధించి అర్హులైన 16 మంది విద్యార్థులకుగాను తొలి విడతగా 11 మంది విద్యార్థులకు జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం కింద రూ.కోటీ 16 లక్షలా 78 వేలా 756 సాయం లబ్ధి చేకూరిందని తెలిపారు. ఆ మొత్తాన్ని మెగా చెక్కు రూపంలో నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణిలతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ పథకానికి అర్హతగల ప్రతి విద్యార్థీ దరఖాస్తు చేసుకోవాలని, తద్వారా విదేశీ విద్యను పొందాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జె.సుభద్ర, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, డిసిఎమ్‌ఎస్ చైర్‌పర్సన్ పల్లా చినతల్లి, నగరాల చైర్‌పర్సన్ పిల్లా సుజాత, ఫిషరీస్ చైర్మన్ కోలా గురువులు, గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ కొండా రమాదేవి, సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ రమణమూర్తి, బిసి వెల్ఫేర్ అధికారి శ్రీదేవి, జిల్లా అల్ప సంఖ్యాకుల సంక్షేమ అధికారి ఎంఎ.రహీమ్, పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
రూ.49.55 లక్షలు విడుదల
అనకాపల్లి : కలెక్టరేట్‌లో శుక్రవారం జగనన్న విదేశీ విద్య దీవెన పథకం కింద జిల్లాలో ఐదుగురు విద్యార్థులకు రూ.49,55,857 కలెక్టర్ రవి పఠాన్ శెట్టి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకం కింద ప్రపంచంలోనే ఉన్నత క్యూఎస్ రాంక్ కలిగిన విశ్వవిద్యాలయాలు, విద్య సంస్థల్లో పీజీ, పిహెచ్‌డి, ఎంబిబిఎస్ కోర్సులు అభ్యసించేందుకు సంవత్సరానికి రూ.8 లక్షలు ఆదాయంలోపు ఉన్న బీసీ, ఈబీసీ, కాపు విద్యార్థులు ఏడాదికి రెండుసార్లు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. 35 ఏళ్ల లోపు ఉండి, 60 శాతం మార్కులు వచ్చి ఉండాలన్నారు. ముందుగా తాడేపల్లిలో ముఖ్యమంత్రి కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్ష ప్రసారాన్ని అధికారులు, విద్యార్థులు తల్లిదండ్రులు వీక్షించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కె.రాజేశ్వరి, సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ టి అజరు బాబు, ఏబిసిడబ్ల్యూఓ సురేష్ తదితరులు పాల్గొన్నారు.










