* వచ్చే ఎన్నికల్లో జిల్లాలో విజయకేతనం
* కృష్ణదాస్‌కు మంత్రి సీదిరి సన్మానం
ప్రజాశక్తి - పోలాకి: జగనన్న వదిలిన బాణం దాసన్న అని, ఆ బాటలోనే జిల్లాలో అన్ని సీట్లు వైసిపి ఖాతాలో పడడం ఖాయమని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేస్తూ జిల్లాలో వైసిపి జెండా రెపరెపలాడించిన చరిత్ర కృష్ణదాస్‌కు ఉందన్నారు. అందుకే ముచ్చటగా మూడోసారి జిల్లా అధ్యక్ష పదవి వరించిందని చెప్పారు. ఈ సందర్భంగా నరసన్నపేట వచ్చిన మంత్రి అప్పలరాజు కృష్ణదాస్‌ను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నిర్ధేశించిన దారిలో కలిసికట్టుగా పనిచేసి జగనన్నను ముఖ్యమంత్రి చేస్తామన్నారు. కార్యక్రమంలో పలాస నుంచి ఎంపికైన కార్యవర్గ సభ్యులు పాల్గొనగా, పలాస-కాశీబుగ్గ మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు, వైస్ జెడ్‌పి చైర్‌పర్సన్ ప్రతినిధి పాలిన శ్రీనివాస్, పలాస మండల అధ్యక్షులు పైల వెంకటరావు (చిట్టిబాబు), మందస ఎంపిపి డొక్కరి దానయ్య, పట్టణాధ్యక్షులు సనపల సింహాచలం ఉన్నారు.










