Jul 11,2023 22:20

ఫొటో : సర్టిఫికెట్లు అందజేస్తున్న ఎంపిపి కేత వేణుగోపాల్‌ రెడ్డి

జగనన్న సురక్షతో సమస్యలకు పరిష్కారం
- ఎంపిపి కేత వేణుగోపాల్‌ రెడ్డి
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న సురక్ష ద్వారా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఎంపిపి కేత వేణుగోపాల్‌ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా రామస్వామిపల్లి సచివాలయంలో మంగళవారం జగనన్న సురక్ష క్యాంపును ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఆశయాల మేరకు అర్హులైన ప్రతి ఒక్కరూ సంక్షేమ ఫలాలు పొందాలనే ఉద్దేశంతో, అందుకు అవసరమైన ధృవీకరణ పత్రాలు ఎవరికైనా లేనిపక్షంలో వలంటీర్లు, సచివాలయం సిబ్బంది, మండలాధికారులు గడప గడపకు వెళ్లి సర్వే చేసి, అర్హులైన అందరినీ గుర్తించి, వారికి అవసరమైన ధృవీకరణ పత్రాలు అందించాలన్నారు.
అత్యంత పారదర్శకంగా సేవలు అందిస్తున్న ఈ ప్రభుత్వానికి మద్దతు తెలుపాలని ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న కన్వీనర్‌ సానా వేణుగోపాల్‌ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులు గురించి వివరించి భవిష్యత్‌ కార్యాచరణ గురించి అందరికీ తెలియజేశారు. అనంతరం ఎంపిడిఒ ఐజాక్‌ ప్రవీణ్‌ మాట్లాడుతూ ఈ జగనన్న సురక్ష క్యాంపులో 11 రకాల ధ్రువీకరణ పత్రాలు ఉచితంగా అందిస్తారని, ఈ అవకాశాన్ని అర్హులైన అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సంపతి రమణమ్మ, తహశీల్దార్‌ లక్ష్మీనరసింహం, ఎంఎఒ కిషోర్‌బాబు, స్థానిక నాయకులు మాల్యాద్రి, పంచాయతీ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు, సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు, స్థానిక నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.