ప్రజాశక్తి- గార: భూ సంబంధిత సమస్యలను శాశ్వత పరిష్కారం చూపుతూ సమగ్ర సర్వే చేపట్టడం ద్వారా భూ రికార్డుల్లో సమూల మార్పులు వస్తున్నాయని, అన్ని రాకలైన వివాదాలకు పరిష్కారం చూపుతున్నామని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని గార మండలం సతివాడలో గురువారం నిర్వహించిన జగనన్న సురక్షలో పాల్గొని మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి పేదలకు భూమి ఇచ్చారని, 1977లో పిఒటి యాక్టు పేరిట తెచ్చిన చట్టం ప్రకారం పట్టా పొందిన వారు భూమిని అమ్ముకోవాలనే వెసులుబాటు అయ్యేది కాదని అన్నారు. కుటుంబ అవసరాలకు అమ్ముకునే హక్కు లబ్ధిదారునికి ఉండేది కాదన్నారు. రైతుల సాగులో ఇరవై ఏళ్లు ఉన్న అసైన్డ్ ల్యాండ్‌కు హక్కులు కల్పించామని అన్నారు. కార్యక్రమంలో ఎంపిపి గొండు రఘురాం, తహశీల్దార్ రామారావు, బొడ్డేపల్లి పద్మజ, డిసిఎంఎస్ మాజీ చైర్మన్ గొండు కృష్ణ పాల్గొన్నారు.
ఆమదాలవలస : జగనన్న సురక్షతో ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయడమే ముఖ్య ఉద్దేశమని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. పురపాలక సంఘ పరిధిలోని ఎనిమిదో వార్డులో ఉన్న మార్కెట్ కమిటీ యార్డులోని సచివాలయం వద్ద జగనన్న సురక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 11 రకాల ధ్రువపత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత వాలంటీర్లను ఉద్దేశించి మహిళలను విక్రయిం చుకునే వారికి సమాచారం ఇచ్చే వ్యవస్థగా చిత్రీకరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు కోర్టులో ఉన్న కేసులపై స్టేలను ఎత్తివేయించుకొని బయటికి రావాలని సవాల్ విసిరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవిసుధాకర్, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ బొడ్డేపల్లి రమేష్ కుమార్, సచివాలయాల కో-ఆర్డినేటర్ అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, దుంపల శ్యామలరావు, పట్టణ పార్టీ అధ్యక్షులు పొడుగు శ్రీను పాల్గొన్నారు.
వజ్రపుకొత్తూరు : మండలంలోని పల్లివూరు సర్పంచ్ మామిడి భాస్కరరావు అధ్యక్షతన నిర్వహించిన జగనన్న సురక్షలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రతినిధి పాలిన శ్రీనివాసరావు పాల్గొని వివిధ రకాల ధ్రువపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఎంపిడిఒ ఈశ్వరమ్మ, డిటి గిరిరాజ్, గురుప్రసాద్, ధర్మారావు పాల్గొన్నారు.
నందిగాం : మండల పరిషత్ కార్యాలయంలో కణితివూరు, లఖిదాసుపురం, దేవలభద్ర గ్రామ సచివాలయ సిబ్బందితో, వాలంటీర్లతో జగనన్న సురక్ష కార్యక్రమం, అమలు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివద్ధి కార్యక్రమాలపై ఎంపిపి నడుపూరు శ్రీరామ్మూర్తి అధ్యక్షతన ఎంపిడిఒ జి.శివ ప్రసాద్ సమీక్షించారు. కార్యక్రమంలో సర్లాన భైరాగి, అప్పా రావు, పొందల లచ్చయ్య, ఎన్.పాపారావు పాల్గొన్నారు.
జలుమూరు: మండలంలోని యలమంచిలి, కొమనాపల్లి సచివాలయాల వద్ద నిర్వహించిన జగనన్న సురక్షలో ఎంపిపి వాన గోపి పాల్గొని ధ్రువపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్ కనుసు సీతారాం, వైస్ ఎంపిపి తంగి మురళీకృష, జెసిఎస్ కన్వీనర్ ధర్మాన జగన్మోహనరావు, తహశీల్దార్ బి.సత్యం, ఎంపిడిఒ ఎల్.వి.అప్పారావు, ఇఒపిఆర్‌డి ఉఆమాహేశ్వరరావు, ఎంఇఒ బి.మాధవరావు పాల్గొన్నారు.
టెక్కలి రూరల్ : టెక్కలి 1,2 సచివాలయాల్లో నిర్వహించిన జగనన్న సురక్షలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి దువ్వాడ వాణి పాల్గొని 11 రకాల ధ్రువపత్రాలను లబ్ధిదారులకు అందజే శారు. కార్యక్రమంలో ఎంపిడిఒ హెచ్.వి. రమణమూర్తి, సురక్ష స్పెషల్ అధికారి డాక్టర్ జి.గురునాథ్, డిటిఎస్ రవికుమార్, ఎపిఒ బగాది ప్రసాదరావు, కార్యదర్శి కూన వినోద్‌కుమార్, సర్పంచ్ గొండెలి సుజాత, సిహెచ్.మోహనరావు పాల్గొన్నారు.
పలాస : ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందించేందుకే జగనన్న సురక్ష ముఖ్య ఉద్దేశమని పిఎసిఎస్ మాజీ అధ్యక్షులు చింతాడ మాధవరావు అన్నారు. మండలంలోని లొద్దభద్రలో నిర్వహిం చిన జగనన్న సురక్షలో పాల్గొని వివిధ రకాల ధ్రువపత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో ఎంపిడిఒ ఎన్.రమేష్‌కుమార్, తహశీల్దార్ ఎల్.మధుసూదనరావు, పంచాయతీ విస్తరణాధికారి మెట్ట వైకుంఠరావు, మండల సచివాలయం కన్వీనర్ దువ్వాడ రవికుమార్ పాల్గొన్నారు.
మున్సిపాలిటీలో ...
పలాస-కాశీబుగ్గ మున్సిపల్ పరిధిలోని కాశీబుగ్గ సంతమైదానం, ఉదయపురం గ్రామాల్లో జగనన్న సురక్ష నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు, వైస్ చైర్మన్ మీసాల సురేష్‌బాబు, బోర కృష్ణారావు, మున్సిపల్ విప్ దుర్గాశంకర్‌పండా, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ టి.నాగేంద్ర కుమార్, టిపిఒ సీతారాం పాల్గొన్నారు.
సంతబొమ్మాళి : మండలంలోని గోవిందపురం సచివాలయంలో సర్పంచ్ రెయ్య రామిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన జగనన్న సురక్షలో కాళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్ పాల్గొని వివిధ రకాల ధ్రువపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి పాల వసంతరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ కెల్లి జగన్నాయకులు, నందిగాం ఎంపిపి ఎన్.శ్రీరామ్మూర్తి, వైస్ ఎంపిపి ప్రతినిధి పొందల రామకృష్ణ ఎంపిడిఒ ప్రేమలీల, డిటి ప్రవీన్‌కుమార్‌రెడ్డి, వడ్డివాడ సర్పంచ్ గూట్ల మల్లేశ్వరరావు, భావనపాడు సర్పంచ్ బుడ్డ మోహనరెడ్డి, పాలతలగం సర్పంచ్ ప్రతినిధి నక్కిట్ల నరేష్, రెయ్యి ప్రసాదరావు, కార్యదర్శి ఢిల్లేశ్వరరావు పాల్గొన్నారు.
బెంతు ఒరియాల నిలదీత
ఇచ్ఛాపురం : మున్సిపాలిటీ పరిధిలో రత్తకన్నలో చైర్‌పర్సన్ పిలక రాజ్యలక్ష్మి అధ్యక్షతన గురువారం నిర్వహించిన జగనన్న సురక్షలో బెంతు ఒరియాలు అధికార యంత్రాంగాన్ని నిలదీశారు. సమావేశం ప్రారంభంలో స్థానికంగా ఉన్న బెంతుఒరియా తమకు కుల ధ్రువపత్రం లేకపోవడంతో ఇబ్బందులకు గురుతున్నామని వాపోయారు. గతంలో మంజూరు చేశారని, ఇప్పుడు నిరాకరించడంతో చాలా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేవారు. రాజ్యాంగంలో అన్ని తరగతులకూ గుర్తింపు ఉందని, బెంతోఒరియాలకు ఫలానా తరగతికి చెందిన వారిని గుర్తించకపోవడం బాధకరమన్నారు. తమ పిల్లలు ఉన్నత చదువులు, ఉద్యోగాలు పొందడంలోనూ ప్రతిచోటా కుల ధ్రువీకరణ పత్రం అడుగుతున్నారని, ఈ నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బందలు పడుతున్నారని అన్నారు. బెంతో ఒరియాలకు సిజిసి నంబర్‌తో ఇంటిగ్రేటెడ్ ధ్రువపత్రం మంజూరు చేయాలని విన్నవించారు. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు అవుతుందని, ఈ నేపథ్యంలో (సిఇటి) కామన్ ఎంట్రెన్స్ టెస్టు కౌన్సిలింగ్‌కు సిజిసి ధ్రువపత్రం మంజూరు చేయాలని ప్రేమ్‌కుమార్ కోరారు. దీనిపై చైర్‌పర్సన్ మాట్లడుతూ ప్రభుత్వం బెంతో ఒరియాలకు ఆలోచిస్తుందని అన్నారు. ఎటువంటి ధ్రువీకరణ పత్రం లేకపోయినా అమ్మబడి, చేయూత, ఆసరా, జిరో వడ్డీ కింద నగదు అందజేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో కమిషనర్ రమేష్, వార్డ్ కౌన్సిలర్లు జగన్నయకులు, తాడి ఆదిరెడ్డి పాల్గొన్నారు.










