- శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం
ప్రజాశక్తి - ఆమదాలవలస : జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా పౌర సేవలు మరింత సులభతరమయ్యాయని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల తహశీల్దార్లు, ఎంపిడిఒలు, మున్సిపల్ అధికారులతో జగనన్న సురక్ష కార్యక్రమంపై శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమం కోసం చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం, జగనన్నకు చెబుదాం, జగనన్న సురక్ష వంటి ప్రతి కార్యక్రమం నియోజకవర్గంలో విజయవంతమయ్యాయని తెలిపారు. 1902 పేరిట జగనన్నకు చెబుదాం కార్యక్రమం సత్ఫలితాలను ఇచ్చిందని, దానికి అనుసంధానంగా జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ప్రజలకు సేవలు సులభతరం చేశారని చెప్పారు. జగనన్నకు చెబుదాంలో ఎక్కువ ఫిర్యాదులు ప్రభుత్వ సేవలు మరింత విరివిగా అందించాలని వచ్చాయని తెలిపారు. ఈ నేపథ్యంలోనే జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నెల రోజుల పాటు విజయవంతంగా నిర్వహించి 11 రకాల సర్టిఫికెట్లు, పథకాలు లబ్ధిదారులకు అందజేయాలన్న లక్ష్యంతో చేపట్టినట్లు వివరించారు. ఇప్పటివరకు ఎన్ని అర్జీలు అందాయి?, వాటిలో ఎన్ని పరిష్కారానికి నోచుకున్నాయి?, ఎన్నిరకాల సేవలకు సంబంధించి సర్టిఫికెట్లు అందజేసిందన్న వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సాంకేతికపరమైన కారణాలతో పెండింగ్‌లో ఉంటే వాటి పరిష్కారానికి మార్గాలను అన్వేషించాలని సూచించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నిర్దేశించిన పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో 48 సచివాలయాల్లో గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ప్రతి గ్రామానికి కనీస మౌలిక సదుపాయాల కల్పనకు రూ.20 లక్షలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిందని తెలిపారు. నిధులు మంజూరు జరిగిన వెంటనే పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రవి సుధాకర్, తహశీల్దార్లు, ఎంపిడిఒలు, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ బొడ్డేపల్లి రమేష్‌కుమార్, వైస్ ఫ్లోర్‌లీడర్ ఎ.ఉమామహేశ్వరరావు, దుంపల శ్యామలరావు, పొడుగు శ్రీను, సాధు చిరంజీవి, సచివాలయాల కోఆర్డినేటర్లు బొడ్డేపల్లి నిరంజన్‌బాబు, ఎ.రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.










